Friday, May 10, 2024

గాంధీలో కరోనా

- Advertisement -
- Advertisement -

Gandhi Hospital

 

ప్రారంభించిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్

తెలుగు రాష్ట్రాలు రెండింటికీ ఇక్కడే
గంటల వ్యవధిలో రానున్న ఫలితాలు
పది రోజులుగా పుణెకు వెళుతున్న శాంపిల్స్
రాష్ట్రంలో చేరిన 20 మంది అనుమానితుల్లో 19 మందికి కరోనా లేదని నిర్ధారణ
కేంద్రం నుంచి వచ్చిన కిట్స్, తగినంత సిబ్బంది ఉన్నారు : మంత్రి ప్రకటన

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కరోనా వైరస్ గురించి ఆందోళన చెందుతున్నాయని, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత 10 రోజులుగా కరోనా టెస్ట్‌లను పూణెకు పంపుతున్నామనా, కానీ, ఇప్పుడు గాంధీలోనే టెస్ట్‌లు ప్రారంభించామని అన్నారు. కరోనా పరీక్షల ఫలితాలు గంటల్లోనే వస్తాయని తెలిపారు. సోమవారం గాంధీ వైద్య కళాశాలలో వైరాలజీ లాబ్, సోలేషన్ వార్డులను మంత్రి పరిశీలించారు. అనంతరం గాంధీ మెడికల్ కాలేజీ లైబ్రరీ బిల్డింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజెందర్ మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల టెస్టులు గాంధీలోనే చేస్తామన్నారు.

కేంద్రం కిట్స్ పంపిందని, లాబ్‌లో కిట్స్, మ్యాన్ పవర్ అన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వెల్లండించారు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు. గాంధీలో డెర్మటాలజీ విభాగంలో కొత్త టెక్నాలజీ ప్రారంభించామని తెలిపారు. పిల్లల్లో వినికిడి సమస్యల పరిష్కారం కోసం కూడా టెక్నాలజీ ప్రారంభించామని, క్యాన్సర్ హాస్పిటల్‌లో పెట్ స్కాన్‌ను ప్రారంభిస్తున్నామని అన్నారు. కరోనా వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ 14 రోజులు అని, చైనా నుంచి వచ్చిన వారిని 14 రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి అవసరమైన చికిత్స అందించనున్నట్లు చెప్పారు.

అనంతరం కోఠిలోని ప్రసూతి ఆసుపత్రిలో నూతన భవనాన్ని మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఉన్న 260 పడకలకు అదనంగా మరో 150 పడకలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఒకేసారి 9 మందికి డెలివరీ చేసే సదుపాయం ఈ ఆసుపత్రిలో ఉందని పేర్కొన్నారు. చాలా ఏళ్ల చకిత్ర కలిగిన ఈ ఆసుపత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు.

20కి చేరిన కరోనా అనుమానితుల సంఖ్య
రాష్ట్రంలో కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య 20 మందికి చేరింది. అందులో 19 మందికి కరోనా వైరస్ లేదని వైద్య పరీక్ష్లో నిర్ధారణ కాగా, సోమవారం ఆసుపత్రిలో చేరిన ఒక్కరికి సంబంధించిన పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా వైరస్‌పై బులిటెన్ విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ పేర్కొన్నారు. వైరల్ వ్యాధులు సోకినప్పుడు ఉపయోగించే మందును పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామని చెప్పారు.

గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు మొదలుపెట్టామని తెలిపారు. కరోనా వైరస్ గురించి ప్రజలు భయాందోళనలు చెందవద్దని కోరారు. అయితే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారరు. జలుబు, దగ్గుతో ఉన్నవారు రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెళ్లవద్దని అన్నారు. దగ్గు వచ్చినప్పుడు తప్పకుండా చేతులు అడ్డం పెట్టుకోవాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. కరోనా వైరస్‌కి సంబంధించిన అనుమానాల నివృత్తి కోసం 24 గంటల కాల్ సెంటర్ 040- 24651119ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Corona Diagnostic tests begin in Gandhi Hospital
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News