Monday, May 20, 2024

తెల్లకాగితంపై సంతకం చేయించి రేప్ కేసు పెట్టారు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో సందేశ్‌ఖాలీ ఆందోళనల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇదంతా బీజేపీ కుట్రేనని తృణమూల్ కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తమపై అకృత్యాలకు పాల్పడ్డారంటూ టీఎంసీ నేతలపై ఫిర్యాదు చేసిన ముగ్గురు మహిళల్లో ఒకరు తాజాగా తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు.

తాను ఎలాంటి వేధింపులకు గురికాలేదని, స్థానిక బీజేపీ కార్యకర్తలు తనతో బలవంతంగా తెల్లకాగితంపై సంతకం చేయించారని ఆరోపించారు. “బీజేపీ మహిళా మోర్చా విభాగానికి చెందిన కొందరు నేతలు, ఇతర కార్యకర్తలు ఆ మధ్య మా ఇంటికి వచ్చారు. పీఎంఏవైలో పేరును చేర్చుతామంటూ తెల్లకాగితంపై నా సంతకం తీసుకున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి టీఎంసీ నేతలపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయించారు. నేనెప్పుడూ రాత్రివేళ ఆ పార్టీ ఆఫీసుకు వెళ్లలేదు.

నాపై ఎలాంటి అకృత్యాలు జరగలేదు” అని ఆ మహిళ పేర్కొన్నారు. తన వల్ల తప్పు జరిగిందని తెలుసుకుని ఇప్పుడు కేసును వెనక్కి తీసుకున్నానని చెప్పారు. ఈ విషయం తెలిసి కొందరు బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీస్‌లకు మరో ఫిర్యాదు చేశారు. ఆ మహిళ ఆరోపణలను బీజేపీ నాయకులు ఖండిస్తున్నారు. ఇదిలా ఉండగా సందేశ్‌ఖాలీ సంఘటన బీజేపీ కుట్ర అని ఆరోపించిన టీఎంసీ, ఇటీవల స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి ఉన్నట్టు బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు గంగాధర్ వ్యాఖ్యానించడం ఈ వీడియోలో కనిపించింది.

షాజహాన్ షేక్ సహా ముగ్గురు తృణమూల్ నేతలపై అత్యాచార ఆరోపణలు చేసేలా స్థానిక మహిళలను ప్రేరేపించాలని సువేందు తనకు సూచించినట్టు అతడు వీడియోలో చెప్పారు. ఈ నేపథ్యంలో సందేశ్‌ఖాలీ వ్యవహారంపై టీఎంసీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించనుంది. వీడియో ఆధారంగా బీజేపీ నేత సువేందు, ఇతరులపై ఫిర్యాదు చేస్తామని టీఎంసీ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ మేరకుఈసీకి లేఖ రాస్తామని తెలిపాయి. అయితే ఈ వీడియోను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. అది మార్ఫింగ్ వీడియో అని, కృత్రిమ మేథ (ఏఐ)తో తన స్వరాన్ని రూపొందించి అందులో పెట్టారని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు గంగాధర్ ఆరోపించారు. దీనిపై సిబిఐకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News