Monday, May 20, 2024

పోలింగ్ కేంద్రంలో ఓటేసిన బాలుడు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశంలో దశల వారీగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఒక పోలింగ్ కేంద్రంలో ఓ బాలుడు ఓటు వేస్తోన్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం మధ్యప్రదేశ్ లోని బెరాసియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

బెరాసియా ప్రాంతానికి చెందిన వినయ్ మెహర్, బీజేపీ స్థానిక నేత. తన మైనర్ కుమారుడితో కలిసి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. తన తండ్రి స్థానంలో ఆ పిల్లాడు ఈవిఎం బటన్ నొక్కి బీజేపీకి ఓటు వేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దాంతో ఇవి కాస్తా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ దృష్టికి చేరాయి.

“బీజేపీ.. ఎన్నికల సంఘాన్ని పిల్లల ఆటవస్తువుగా మార్చింది. బీజేపీ నేత వినయ్ మెహర్ తన ఓటును కుమారుడితో వేయించారు. ఆ తతంగాన్ని వీడియో తీసి, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. పిల్లల్ని, మొబైల్ ఫోన్లను లోపలికి ఎలా అనుమతించారు? దీనిపై ఏమైనా చర్యలు ఉంటాయా ? అని కమల్‌నాథ్ ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల సంఘం నుంచి స్పందన రావాల్సి ఉంది. గుజరాత్ లోని దాహోద్ లోక్‌సభ నియోజక వర్గ పరిధి లోని ఓ పోలింగ్ కేంద్రంలో కూడా ఇదే తరహా సంఘటన ఒకటి జరిగింది. కేంద్రం లోపల నుంచి వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేసిన విజయ్ భాభోర్‌ను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. అతడు స్థానిక బీజేపీ నేత కుమారుడు. ఇలాంటి చర్యతో ప్రజాస్వామ్యాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News