Saturday, April 27, 2024

సిఎఎపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసన, చర్చకు పట్టు

- Advertisement -
- Advertisement -

 CAA

 

న్యూఢిల్లీ : పౌరచట్టం, ఎన్‌ఆర్‌సి సంబంధిత అంశాలపై పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం దద్దరిల్లాయి. ఇతర సభా కార్యక్రమాలన్నింటినీ పక్కకు పెట్టి కా, ఎన్‌పిఆర్ వంటి వాటిపైనే చర్చ జరగాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ముందుగా సిఎఎపైనే చర్చ జరగాలని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా పట్టుపట్టాయి. ఏకపక్ష చట్టాలతో, సరికొత్త నిబంధనలతో ప్రజలతో చెలగాటమాడుతున్నారని కాంగ్రెస్, టిఎంసి, డిఎంకె, వామపక్షాలు నిరసనకు దిగాయి. దీనితో రాజ్యసభ పూర్తిగా సోమవారం వాయిదా పడింది.

లోక్‌సభలో పలుసార్లు అంతరాయం ఏర్పడింది. ప్రతిపక్షాల బలం ఉన్న ఎగువ సభలో పౌరచట్టం వ్యతిరేక నినాదాలు మార్మోగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలో ఈ అంశంపై చర్చను బిజెపి సభ్యులు ప్రవేశ్ సాహిబ్ సింగ్ వర్మ ప్రారంభించారు. వెంటనే కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష సభ్యులు నినాదాలకు దిగుతూ ఉండటంతో గందరగోళం నెలకొంది.

సభ్యులు తమ స్థానాలలో కూర్చోవాలని స్పీకర్ ఎంతగా చెప్పినప్పటికీ సభ అదుపులోకి రాలేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, ముందుగా కీలక అంశాలపై చర్చించండంటూ డిఎంకె, టిఎంసి, వామపక్షాల సభ్యులు డిమాండ్‌కు దిగారు. వివాదాస్పద చట్టాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం , పైగా దీనిని ప్రశ్నించే వారిని కాల్చివేయాలనే మంత్రుల మాటలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

ఢిల్లీ ఎన్నికల సభలలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అనుచిత వ్యాఖ్యలకు దిగారని, దీనికి సభాముఖంగానే వివరణ ఇచ్చుకోవాలని లేకపోతే సభను సాగనిచ్చేది లేదని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. దీనితో గందరగోళం మధ్య సభ కొద్ది సేపు వాయిదా పడింది. ఇక రాజ్యసభలో ఉదయం రెండు సార్లు ఇదే అంశంపై సభ వాయిదా పడింది. తరువాత మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి ప్రారంభం అయింది. కాంగ్రెస్, ఎస్‌పి, డిఎంకె, టిఎంసి సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లారు.

కాపై నిరసనలకు దిగే వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, పైగా హింసాత్మక చర్యలకు రెచ్చగొట్టే మాటలకు దిగుతున్నారని విమర్శించారు. సభ్యులు శాంతించాలని సభాధ్యక్షులు ఎంతగా యత్నించినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చకు సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ యత్నించారు. ఫలితం లేకుండా పోయింది. సిఎఎ, ఎన్‌పిఆర్, ఇతర అంశాలపై ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాయి. వీటిని తిరస్కరించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Oppositions protests in Parliament over CAA
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News