Sunday, May 19, 2024

మిలిటెంట్లను విడిపించుకోడానికి సైన్యాన్ని అడ్డుకున్న మహిళలు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సైన్యం అదుపు లోకి తీసుకున్న పలువురు మిలిటెంట్లను విడిపించుకోడానికి దాదాపు 1500 మంది మహిళలు భద్రతా బలగాలను చుట్టుముట్టడం గమనార్హం. దీంతో పౌరుల భద్రత దృష్టా మైతేయ్ మిలిటెంట్ గ్రూప్ ‘కేవైకేఎల్’ కి చెందిన 12 మంది మైతేయ్ మిలిటెంట్లను విడిచిపెట్టినట్టు సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. తూర్పు ఇంఫాల్ లోని ఇథం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఇంఫాల్ ఈస్ట్ లోని ఇథమ్‌లో మిలిటెంట్లు దాక్కున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో గ్రామంలో సైన్యం శనివారం ఓ ఆపరేషన్ మొదలు పెట్టింది. తనిఖీలు చేసి మైతేయ్ మిలిటెంట్ గ్రూప్ కేవైకెఎల్ కి చెందిన 12 మంది మిలిటెంట్లను అదుపు లోకి తీసుకుంది.

2015 లో 6 డోగ్రా యూనిట్‌పై ఆకస్మిక దాడితో సహా అనేక సంఘటనల్లో ఈ బృందం హస్తం ఉందని ఆర్మీ తెలిపింది. దీంతోపాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున గుమి గూడారు. దాదాపు 1200 నుంచి 1500 మంది మహిళలు సైన్యాన్ని చుట్టుముట్టి అడ్డుకున్నారు. ఆర్మీ వాహనాలు ముందుకెళ్లకుండా అడ్డుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరినా ఫలితం లేక పోయింది. ఈ విధంగా ఇరు వర్గాల మధ్య రోజంతా ప్రతిష్టంభన కొనసాగింది. చివరకు సైన్యం వారిని విడిచిపెట్టింది. దీంతో ఎలాంటి ఘర్షణ తలెత్తకుండా ఉద్రిక్త పరిస్థితి సద్దు మణిగింది. అయితే స్వాధీనం చేసుకున్న ఆయుధాలను తరలించినట్టు సైన్యం పేర్కొంది.

గ్రామస్థులు ఎదురుతిరగడంతో మైతేయ్ వర్గానికి చెందిన మిలిటెంట్ల గ్రూప్ కంగ్లీ యావోల్ కన్నా లుప్ సభ్యులు తప్పించుకున్నారు. వారిలో మొయిరంగథెం తంబా కూడా ఉన్నాడని అధికారులు వెల్లడించారు. అతడు 2015లో 6 డోగ్రా రెజిమెంట్‌పై జరిగిన దాడితో సహా అనేక సంఘటనల్లో సూత్రధారి అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News