కాంగ్రెస్, ఎన్‌సిపికి ఎంఐఎం లేఖ
ఛత్రపతి శంభాజీనగర్: రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న 28 నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఎఐఎంఐఎం పొత్తు కోసం కాంగ్రెస్, ఎన్‌సిపిలను సంప్రదించింది. మహా వికాస్ అఘాడి(ఎంవిఎ)తో పొత్తు పెట్టుకుని 28 స్థానాలలో పోటీ చేయాలని ఆశిస్తున్నట్లు తమ ప్రతిపాదనను కాంగ్రెస్, ఎన్‌సిపి(ఎస్‌పి)లకు పంపినట్లు మాజీ ఎంపి, ఎంఐఎం నాయకుడు ఇంతియాజ్ జలీల్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీని సంప్రదించిన తర్వాతే ఒక లేఖను రాసి కాంగ్రెస్, ఎన్‌సిపి(ఎస్‌పి) పంపామని ఆయన వెల్లడించారు.
ఎంవిఎ కూటమిలోని శివసేన(యుబిటి) ఇటీవలే లౌకివకాదిగా మారిందని, వివిధ అంశాలపై ఆ పార్టీ వైఖరి తమకు తెలుసునని ఆయన చెప్పారు. ఇటీవలే సెక్యులర్‌గా మారిన పార్టీతో(శివసేన-యుబిటి)తో కాంగ్రెస్, ఎన్‌సిపి(ఎస్‌పి) పొత్తు పెట్టుకోగా లేనిది ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ముస్లిం ప్రాబల్యంగల 28 నియోజకవర్గాలను తమకు కేటాయించాలని కోరుతూ ఒక ప్రతిపాదన అందచేశామని, ఆ సీట్లలో తాము గట్టి పోటీని ఇవ్వగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే దాంట్లో నుంచి బిజెపి లబ్ధి పొందగలదని కాంగ్రెస్, ఎన్‌సిపికి తెలియచేసినట్లు ఆయన చెప్పారు.
తాము పోటీ చేయదలచుకున్న నియోజకవర్గాల జాబితాను అంచేశామని, తక్కువ సీట్లలో పోటీ చేసే అవకాశం కూడా ఉందని ఆయన వివరించారు. 288 సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత అసెంబ్లీలో 103 మంది ఎమ్మెల్యేలతో బిజెపి ఏకైక అతి పెద్ద పార్టీ కాగా శివసేనకు 40, ఎన్‌సిపికి 41, కాంగ్రెస్‌కు 40, శివసేన(యుబిటి)కు 15, ఎన్‌సిపి(ఎస్‌పి)కి 13, ఇతరులు 29 మంది సభ్యులు ఉన్నారు. కొన్ని స్థానాలు ఖాళీగా కూడా ఉన్నాయి.