Thursday, May 2, 2024

వానాకాలం నాటికి ‘రైతు భరోసా’

- Advertisement -
- Advertisement -

వచ్చే వానకాలం నాటికి తమ ప్రభుత్వం రైతు భరోసా (రైతు బంధు) కింద ప్రకటించిన సాయాన్ని కేవలం సాగులో ఉన్న భూములకే అందజేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం ఎపిలోని ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం, గుబ్బలమంగమ్మ అమ్మవారి దేవాలయంలో ఆయన మొక్కు తీర్చుకున్నారు. అనంతరం ఆశ్వారావుపేట మండలం, కన్నాయిగూడెంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ…రైతు బంధు సాయం పంపిణీకి పరిమితిని ఖరారు చేసేందుకు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని అన్నా రు. అఖిలపక్ష ఎంఎల్‌ఎల అభిప్రాయాలు, ఇతర వ్యవసాయ నిపుణుల సలహాలు, సూచనల మే రకు ఒక స్లాబ్‌ను నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వహాయంలో దాదాపు 35 లక్షల ఎకరాలకు వ్యవసాయం చేయకుండానే రైతు బంధు సాయం అందించామని ప్రకటించారని, వ్యవసాయం చేయని వారికి రైతు పెట్టుబడి సాయం ఎందుకు అందించారో వారికే తెలియాలని అన్నారు.

వెంచర్లు, కాలువలు, జాతీయ రహదారులు, క్వారీలు, రైల్వే లైన్ ఉన్న భూములకు, పడావు బడ్డా భూములకు విచ్చలవిడిగా రైతు బంధు సాయం చేసి నిధులను దుబారా చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం కేవలం వ్యవసా య పంటలను సాగు చేసే సన్న, చిన్న కారు రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని భావిస్తుందని అన్నారు. ఇప్పటివరకు రైతు బంధు పథకం కింద అయిదెకరాలలోపు రైతులందరికీ (92.36 శాతం) సాయాన్ని అందజేశామని ఇంకా నాలుగు లక్షల మందికి పంపిణీ చేయాల్సి ఉంటుందని, వారికి ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. రైతులు పండించిన వరి పంటను కొనుగోలు చేసేందుకు ఏప్రిల్ 1 నుంచే కొనుగోళ్ళు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. తొలిరోజే సూర్యాపేట, జనగాం, తిరుమలగిరి మార్కెట్లలో ఎంఎస్‌పి కంటే తక్కువ ధరకు కొనుగోళ్ళు చేస్తున్నారని సమాచారం అందిన వెంటనే అక్కడికి మార్కెటింగ్ డైరెక్టర్ వెళ్లి విచారణ చేయాల్సిందిగా అదేశాలను జారీ చేశామన్నారు.

అదేవిధంగా రైతు పంటకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇచ్చేందుకు కూడా కసరత్తులు చేస్తున్నామని, ఎంఎస్‌పి ధర వచ్చిన ధాన్యానికి ఇవ్వాలా ? లేదా ఎన్ని ఎకరాలకు, లేదా ఎన్ని బస్తాలకు ఇవ్వాలనే దానిపైనే సమాలాలోచనలు జరుగుతున్నాయని అన్నారు. ఖమ్మం, మహబూబ్‌బాద్ జిల్లాలోని ప్రజలకు తాగునీటిని అందించేందుకు సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్‌కు నీటిని విడదల చేయించామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ 12 సీట్లకుపైగా గెల్చుకుంటుందని మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News