Saturday, October 5, 2024

తిరుమల లడ్డూ వివాదం వెనుక బిజెపి కుట్ర: ఎంఎల్ఎ జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

తిరుమల లడ్డూ వివాదం వెనుక బిజెపి కుట్ర ఉందంటూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డు కల్తీ అయిందన్న వివాదంలో వాస్తవాల్లో భాగంగా ఏమీ జరిగిందన్న విషయాలను చర్చిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయన్నారు. ఇక్కడ జరిగిన అంశాల కంటే రాజకీయ లబ్ది, మత పరమైన అంశాలపై ఎక్కువగా చర్చ జరుగుతుందని, వాస్తవాలు మరుగున పడిపోతున్నాయని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను వెంటనే బయటపెట్టి తిరిగి కల్తీలేని లడ్డులను భక్తులకు అందించి అలాంటి దోషాలు తిరిగి జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకొని భక్తులకు భరోసా కల్పించాలని ఆయన సూచించారు. కానీ, అలా కాకుండా చంద్రబాబు దీనిని రాజకీయం చేయడం, మత ప్రస్తావన తేవడం, జగన్ పేరు ప్రస్తావన చేయటంతో వ్యక్తిగతంగా తనకు కొన్ని అనుమానాలు వస్తున్నాయని బిజెపి ఏమైనా చంద్రబాబుతో మతపరమైన రాజకీయాలకు తెరతీస్తుందా అన్నది తన అనుమానం అని ఆయన పేర్కొన్నారు. బిజెపి ఎజెండానే ఎప్పుడు ప్రజా సమస్యల చుట్టూ కాకుండా మతపరమైన అంశాల చుట్టూనే ఉంటుందన్నారు.

విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు
ఎపి రాజకీయాల్లో జగన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయించడాన్ని రాజకీయాలకు అతీతంగా అంతా తప్పు పట్టామని, ఒక విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబును గౌరవిస్తానన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం చాలా గొప్పదని జగ్గారెడ్డి కొనియాడారు. జగన్ విజన్ క్లారిటీ లేదని, కానీ, చంద్రబాబుకు విజనరీ అనే పేరు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు వయస్సును చూడకుండా కొంతమంది వైసిపి మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరైంది కాదన్నారు. అత్యంత సీనియర్ నేతల్లో ఒకరైన చంద్రబాబును కాపాడుకోవడం, గౌరవించుకోవడం అవసరమని గతంలోనే చెప్పానన్నారు. అధికారం మైకంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆయనకే శాపంగా మారాయన్నారు. అదే సమయంలో చంద్రబాబు ప్రజల్లో తిరుగుతూ కష్టపడ్డారని మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారని ఆయన తెలిపారు.

రానున్న రోజుల్లో ఎపిలో కాంగ్రెస్‌దే అధికారం
ఎపిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రం విభజన చేసిందన్న కోపం అక్కడ ప్రజలకు ఉందని అందుకే మూడు ఎన్నికలను కాంగ్రెస్ పార్టీని అక్కడి ప్రజలు నమ్మలేదన్నారు. భవిష్యత్‌లో కాంగ్రెస్‌కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడతారన్న నమ్మకం తనకు ఉందన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీకి దేశ ప్రజలు కచ్చితంగా అవకాశం ఇస్తారన్నారు. ఎపికి ప్రత్యేక హోదా రాహుల్ నేతృత్వంలోనే జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీనే పూర్తి చేస్తారని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News