Friday, August 8, 2025

దారుణ హత్యకు గురైన తల్లీకూతురు

- Advertisement -
- Advertisement -

జనగామ జిల్లా, జఫర్‌గడ్ మండలం, తమ్మడపల్లి (ఐ)లో తల్లీకూతురు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. అందరితోను కలివిడిగా ఉండే వారు హఠాత్తుగా హత్యకు గురికావడంతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే… తమ్మడపల్లి (ఐ) గ్రామానికి చెందిన గాలి రాణమ్మ (60), ఆమె తల్లి తుమ్మ అన్నమ్మ (90) ఇద్దరు గుర్తు తెలియని దుండగుల చేతిలో గురువారం రాత్రి హత్యకు గురయ్యారు. ఇంట్లో నిద్రిస్తున్న వారిద్దరిని నిద్రలేపిన దుండగులు హత్య చేసి, అక్కడి నుండి పారిపోయారు. శుక్రవారం ఉదయం ఈ హత్యోదంతం వెలుగు చూసింది. తమ్మడపల్లి (ఐ)కి చెందిన గాలి జార్జిరెడ్డి మొదటి భార్య సుందరి. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుందరి అనారోగ్యంతో మృతి చెందిన అనంతరం జార్జిరెడ్డి దేవరుప్పుల మండలం, నీర్మాలకు చెందిన తన భార్య స్వంత సోదరి రాణమ్మను రెండో భార్యగా వివాహం చేసుకున్నాడు.

వీరికి ఒక కూతురు ఉంది. జార్జిరెడ్డి 25 సంవత్సరాల క్రితమే మృతి చెందాడు. దీంతో గ్రామంలో ఒంటరిగా ఉంటున్న రాణమ్మ తన తండ్రి మృతి చెందడంతో తల్లి అన్నమ్మను తమ్మడపల్లి (ఐ)కి తీసుకువచ్చి పోషించుకుంటోంది. గత ఏడేళ్లుగా ఇద్దరూ కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతురు గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురికావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న వర్ధన్నపేట్ ఎసిపి అంబటి నర్సయ్య, సిఐ శ్రీనివాస్ రావు, ఎస్‌ఐ బి రామ్ చరణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వరంగల్ ఎంజిఎంకు తరలించారు. కాగా, వీరిద్దరి హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News