Monday, August 4, 2025

మార్నింగ్ వాక్‌లో ఎంపీ చైన్ చోరీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ ఢిల్లీలో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో తన మెడలోని చైన్ కొట్టేశారని ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిఎంకె నాయకురాలు రజతితో కలిసి చాణక్య పురిలోని పోలండ్ సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కూడా లేఖ రాశారు.

“ఉదయం 6.15 6.20 గంటల సమయంలో హెల్మెట్ పెట్టుకొని స్కూటీ మీద మాకు ఎదురుగా వచ్చిన ఒక వ్యక్తి.. నా మెడ లోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. మాకు ఎదురుగా బండిపై నిదానంగా వస్తుండటంతో అతడిని మేం చైన్ స్నాచర్‌గా అనుమానించలేదు. అతడు బలంగా గొలుసు లాగడంతో నా మెడమీద గాయాలయ్యాయి. నా డ్రెస్ కూడా కొద్దిమేర చినిగింది. కిందపడిపోకుండా ఎలాగోలా ఆగాను. తర్వాత మేమిద్దరం సహాయం కోసం ఎదురుచూశాం. కొద్ది సేపటికి పెట్రోలింగ్ వాహనం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇలాంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఎంపీగా ఉన్న ఒక మహిళపై జరిగిన ఈ దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది.  ఈ ప్రదేశం లోనే ఒక మహిళ సురక్షితంగా నడిచే పరిస్థితి లేకుంటే.. ఇక ఇతర ప్రాంతాల్లో రోజువారీ పనులను మేం ఎలా ధైర్యంగా పూర్తి చేసుకోగలం? ఈ ఘటన వల్ల నాకు మెడపై గాయాలయ్యాయి. నాలుగు సవర్ల గొలుసును పోగొట్టుకున్నాను. ఇదంతా నన్నెంతో బాధిస్తోంది” అని ఆమె లేఖలో పేర్కొన్నారు.

ఆ నిందితుడిని గుర్తించి త్వరగా న్యాయం జరిగేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను లేఖలో కోరారు. తమిళనాడు లోని మయిలాదుతురై పార్లమెంట్ నియోజక వర్గానికి సుధా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతుండడంతో ఆమె ఢిల్లీలో ఉన్నారు. ఇక చాణక్యపురిలో పలు దేశాల దౌత్య కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారిక భవనాలు ఉంటాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News