Wednesday, May 8, 2024

ఐఎఎస్ అధికారి వీఆర్‌ఎస్… 24గంటల్లోనే కేబినెట్ ర్యాంక్

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన 24 గంటల్లోనే ఓ ఐఎఎస్ అధికారికి రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ హోదా దక్కింది. విపక్షాల విమర్శల మధ్య ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. సీఎంకు అంత నమ్మకస్థుడైన ఆ వ్యక్తి ఎవరంటే..? ఒడిశా క్యాడర్‌లో 2000 ఏడాది బ్యాచ్‌కు చెందిన ఆ ఐఎఎస్ అధికారి పేరు వీకే పాండియన్. ఆయన ధర్మగఢ్ సబ్ కలెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. 2005లో మయూర్‌భంజ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. 2007లో గంజాం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ నమ్మకాన్ని చూరగొన్నారు. దాంతో 2011లో ముఖ్యమంత్రి కార్యాలయానికి బదిలీ అయ్యారు.

ఆ తర్వాత సీఎం వ్యక్తిగత కార్యదర్శిగా పదోన్నతి పొందారు. అయితే గత కొద్ది కాలంగా పాండియన్ రాజకీయాల్లోకి వస్తారని, అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన కీలక బాధ్యతలు స్వీకరిస్తారని వార్తలు వస్తున్నాయి. వాటికి తగ్గట్టే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆయన అభ్యర్థనకు అక్టోబర్ 23న ఆమోదం లభించింది. ఆ తర్వాత 24 గంటల వ్యవధి లోనే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 5t, సబిన్ ఒడిశా స్కీమ్‌కు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈమేరకు ఒడిశా జనరల్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ గ్రీవెన్స్ విభాగం ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ ర్యాంకు హోదాతో ప్రభుత్వం ఆయనకు బాధ్యతలు కట్టబెట్టింది.

ఈ పరిణామాలపై బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు గుప్పించాయి. “బ్యూరోక్రాట్ ముసుగులో కాకుండా ఇక నుంచి ఆయన బహిరంగం గానే రాజకీయాలు చేయగలరు” అని కమలం పార్టీ దుయ్యబట్టింది. వచ్చే ఎన్నికలకు ముందు పాండియన్ ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని కాంగ్రెస్ విమర్శించింది.“ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఎవరు నియంత్రిస్తున్నారు మాత్రం అందరికీ తెలుసు. సెలవుల వేళ మూడు రోజుల వ్యవధిలో వీఆర్‌ఎస్ కు ఆమోదం లభించింది. సూపర్ ఫాస్ట్ ” అని బిజూ జనతా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నిందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News