Sunday, June 16, 2024

ఉరి తీశారు

- Advertisement -
- Advertisement -

Nirbhaya convicts

 

శుక్రవారం తెల్లవారుజాము గం.5.30కు నిర్భయ దోషులు నలుగురికీ తీహార్ జైల్లో ఒకేసారి ఉరిశిక్ష అమలు
జైలు బయట జనం హర్షధ్వానాలు, లాంగ్ లివ్ నిర్భయ, భారత్ మాతాకి జై నినాదాలు, నలుగురిలో ఒక్కరూ ప్రతిఘటించలేదు, అల్పాహారం కూడా తీసుకోలేదు : జైలు అధికారులు
ఆలస్యమైనా చివరికి మా కూతురికి న్యాయం జరిగింది : నిర్భయ తల్లిదండ్రులు, న్యాయం జరిగింది : ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: ఉరిశిక్షనుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు చివరి క్షణం వరకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. వారు దాఖలు చేసిన పిటిషన్లన్నిటినీ న్యాయస్థానాలు కొట్టి వేశాయి. దీంతో దోషులైన ముకేశ్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26),అక్షయ్ కుమార్ సింగ్ (31)లను శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీశారు. పలువురు జైలు అధికారులు, జిల్లా మేజిస్ట్రేట్ సమక్షంలో మూడో నంబరు జైలులో నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీశారు. తలారి పవన్ జల్లాద్ ఉరిశిక్ష ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సమయంలో 17 మంది జైలుసిబ్బంది విధులో పాల్గొన్నారు. డాక్టర్ మృత దేహాలను పరీక్షించి నలుగురూ చనిపోయినట్లు ధ్రువీకరించినట్లు తీహార్ జైలు సూపరింటెండెంట్ సందీప్ గోయల్ చెప్పారు.

నిబంధనల ప్రకారం ఉరి తీసిన తర్వాత మృత దేహాలను అరగంట సేపు ఉరి కొయ్యలకే వేలాడదీసినట్లు జైలు అధికారులు చెప్పారు. దక్షిణాసియాలోనే అతి పెద్ద కారాగారమైన తీహార్ జైలులో నలుగురినీ ఒకే సారి ఉరి తీయడం ఇదే తొలిసారి. ఉరినుంచి తప్పించుకోవడానికి న్యాయపరంగా ఉన్న అన్ని మార్గాలు దోషులకు మూసుకుపోయిన తర్వాత ఉరిశిక్ష అమలు చేశారు. చివరి ప్రయత్నంగా ఉరి తీయడానికి కొన్ని గంటల ముందు కూడా దోషులు ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. ఉరికి కొద్ది గంటల ముందు దోషుల్లో ఒకరైన పవన్‌కుమార్ గుప్తా, రాష్ట్రపతి తన రెండో క్షమాబిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

అసాధారణ రీతిలో తెల్లవారుజామున 2.30 గంటలకు అతని చివరి పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ దాదాపు గంట విచారణ అనంతరం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో దోషుల ఉరికి మార్గం సుగమం అయింది. అంతే కాకుండా ఉరి తీయడానికి ముందు దోషులు పవన్ గుప్తా, అక్షయ్ సింగ్‌లు తమ కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి అనుమతిస్తూ ఆదేశాలు ఇవ్వడానికి కూడా బెంచ్ నిరాకరించింది.

జైలు బైట జనం హర్షాతిరేకాలు
కాగా తమ కుమార్తెకు ఎట్టకేలకు న్యాయం జరిగిందంటూ సంతోషం వ్యక్తం చేసిన నిర్భయ తల్లిదండ్రులు దేశంలోని మిగతా ఆడపిల్లల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిర్భయ దోషులు నలుగురినీ ఉరి తీశారన్న వార్త తెలియగానే తెల్లవారుజామునుంచే తీహార్ జైలు వద్దకువందల సంఖ్యలో చేరుకున్న జనం సంతోషంతో కేరింతలు కొట్టారు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ‘లాంగ్ లివ్ నిర్భయ’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. జైలు బయట గుమి కూడిన వారిలో సామాజిక ఉద్యమ కార్యకర్త యోగితా భయానా కూడా ఉన్నారు.

‘ నిర్భయకు న్యాయం లభించింది. మిగతా ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు’ అన్న స్లోగన్ రాసి ఉన్న బ్యానర్‌ను ఆమె పట్టుకుంది. ఎట్టకేలకు న్యాయం లభించిందన్న ఆమె ఇది న్యాయవ్యవస్థ విజయమన్నారు. అయితే ఈ ఉరితో సమాజంలో ఎలాంటి మార్పూ రాదని పశ్చిమ ఢిల్లీకి చెందిన సనా అనే మహిళ అంటూ, అయితే నలుగురు దోషులను ఉరి తీసినందుకు, నిర్భయకు న్యాయం జరిగినందుకు మాకు సంతోషంగా ఉందన్నారు.

సుదీర్ఘ న్యాయ ప్రయాణం
2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి ఢిల్లీలో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థినిపై ఆరుగురు మృగాళ్లు లైంగిక దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను బస్సులోనుంచి నడిరోడ్డుపైకి తోసేయగా, దాదాపు పక్షం రోజులు మృత్యువుతో పోరాడిన అనంతరం సింగపూర్ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాంసింగ్ జైల్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా, మరో వ్యక్తి మైనర్ అని తేలింది. దీంతో జువనైల్ చట్టం కింద మూ డేళ్ల జైలు శిక్ష విధించారు. జైలునుంచి విడుదలైన తర్వా త అతను దక్షిణ భారత దేశంలో అజ్ఞాత జీవితం గడుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా మిగిలిన నలుగురు నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంఘటన జరిగిన ఏడాది లోపే అంటే మరుసటి సంవత్సరం సెప్టెంబర్ 13న మరణ శిక్ష విధించింది.

ఈ శిక్షను హైకోర్టు, సుప్రీంకోర్టులు ధ్రు వీకరించినప్పటికీ ఏడాది గడిచినా డెత్ వారంట్లు జారీ కాలేదు. ఎట్టకేలకు ఈ ఏడాది జనవరిలో పటియాల హౌస్ కోర్టు డెత్ వారంట్లు జారీచేసినప్పటికీ నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలన్న అంశాన్ని అడ్డం పెట్టుకుని శిక్ష అమలు కాకుండా అడ్డుపడసాగారు. చట్టంలోని లొ సుగులను అడ్డుపెట్టుకుని ఒకరి తర్వాత ఒకరుగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేస్తూ, రాష్ట్రపతి వా టిని తిరస్కరించాక మళ్లీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ కాలయాపన చేయడానికి ప్రయత్నించారు. అనారోగ్యాన్ని సాకుగా చూపడం, ఒక దశలో తమను తాము గాయపర్చుకోవడం లాంటి చర్యలకు పాల్పడ్డం కూడా చేశారు. ఫలితంగా మూడుసార్లు జారీ అయిన డెత్ వా రంట్లు అమలు కాలేదు. అయితే ఎట్టకేలకు వీరి తీరును గ్రహించిన న్యాయవ్యవస్థ సారి అందుకు అవకాశమివ్వలేదు. దీంతో మార్చి 20న నిర్భయకు న్యాయం జరిగింది. నలుగురు నిందితులను ఒకేసారి ఉరి తీశారు.

 

Nirbhaya convicts executed all four
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News