Thursday, May 2, 2024

రాష్ట్రంలో 19

- Advertisement -
- Advertisement -

Coronavirus

 

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బాధితులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం మరో మూడు కొత్త కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం బాధితుల సంఖ్య 19 కి చేరింది. లండన్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన 18 ఏళ్ల యువతికి, ఇండోనేసియా నుంచి ఢిల్లీ వచ్చి, ఆ తర్వాత ట్రైన్ మార్గం ద్వారా కరీంనగర్‌కి చేరిన 27 ఏళ్ల మహిళతో పాటు, 60 సంవత్సరాల ఇండోనేసియా వ్యక్తికీ కరోనా సోకిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. రాష్ట్రం మొత్తం మీద నమోదైన బాధితుల్లో 10 మంది ఇండోనేసియా దేశస్తులు ఉండటం గమనార్షం. ఇప్పటి వరకు బాధితుల్లో ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని, ఐసొలేషన్ వార్డులో అందరు చికిత్స పొందుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు.

అయితే రెండు రోజుల్లో నలుగురు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా విదేశీయుల్ని గుర్తించేందుకు ప్రభుత్వం జల్లెడ పడుతోంది. హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల్లో కూడా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. మార్చి 1 తర్వాత రాష్ట్రానికి వచ్చిన వారు స్వతహాగా రిపోర్టు కావాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

రెండు రోజుల్లో నలుగురిని డిశ్చార్జ్ చేసే అవకాశం…
ఇప్పటి వరకు రాష్ట్రంలో 19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అనుమానిత లక్షణాలతో ఆసుపత్రుల బాట పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే పాజిటివ్ వచ్చిన 19 మందిలో ఒకరు డిశ్చార్జ్ కాగా, రెండు రోజుల్లో మరో నలుగురిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఇండోనేషియా బృందం పర్యటన కలకలం రేకేత్తిస్తుంది. ఇటీవల మతప్రచారం నిమిత్తం ఢిల్లీ నుంచి రామగుండంకి వచ్చిన 12 మంది సభ్యుల్లో 10 మందికి పాజిటివ్ రావడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. విదేశాల నుంచి వచ్చే వారు మాత్రమే కరోనా వైరస్ బారిన పడుతుండటంతో విదేశీయుల్ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారిలో 1156 మందిని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచామని అధికారులు వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేకంగా 20 అంబులెన్స్‌లు కూడా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

రాజేంద్రనగర్‌లో 2 వేల మందికి క్వారంటైన్ బ్లాక్‌లు…
రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో అధికారులు అలెర్ట్ అయినారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయం ఈ ప్రాంతానికి ఉండడంతో విదేశాల నుంచి వచ్చే వారిని ఇక్కడ క్వారంటైన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. వ్యవసాయ కళాశాలతో పాటు ఎన్‌ఐఆర్‌డి, మేనేజ్, వాలంతరి ఇనిస్టిట్యూట్‌లలో దాదాపు 2200 పడకల క్వారంటైన్ బ్లాకులను సిద్దం చేశారు. కేవలం ఒక్క శుక్రవారం రోజు దుబాయ్, ఆస్ట్రేలియా, లండన్ దేశాల నుంచి రెండు వేల మంది ప్రయాణికులు రాగా, వారందరికీ కరోనా టెస్టులు చేసి అధికారుల పర్యవేక్షణలో ఉంచినట్లు సమాచారం.

క్వారంటైన్ బెడ్స్ ఇలా….
ఎన్‌ఐఆర్‌డి ఆవరణలో 150 గదులలో 300 బెడ్స్ , నార్మ్‌లో 100 గదులలో 200ల పడకలు, మేనేజ్‌లో 100 గదులలో 100, ఎన్‌ఐపిహెచ్‌ఎం బుద్వేల్‌లో 100 గదుల్లో 200, వ్యవసాయ వర్సిటీ ప్రాంగణంలోని హస్టల్ 150 గదుల్లో 300 , ఇటర్నేషనల్ హాస్టల్ 100 గదులలో 200 డివోఆర్ ,పిజెటిఎస్‌ఎయులో కలిపి 30 గదుల్లో 60, బోర్లాక్ గెస్ట్ హౌస్‌లో 100, భీమయ్యనిలం హస్టల్ 100 , టిఎస్‌కాబ్ సిటిఎలో 180, ఐసిఎంలో మరో 80 క్వారంటైన్ బెడ్స్‌ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

కరోనా పై ప్రత్యేక గైడ్‌లైన్స్…
రాష్ట్రంలో కరోనా వ్యాధిని నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక గైడ్‌లైన్స్‌ని విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

నిబంధనలు ఇలా………
@ కరోనా లక్షణాలు ఉన్నా లేకపోయినా విదేశాల నుంచి వచ్చిన వారు తప్పక 14రోజుల పాటు స్వీయనిర్భందంలో ఉండాలి.
@ కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ అయినవారు తప్పక ఐసోలేషన్ తీసుకోవాలి.
@ కరోనాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించినా తక్షణం దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలి.
@ కోవిడ్ 19కి సంబధించిన ఎలాంటి సమాచారం కోసమైనా 104ని సంప్రదించాలి.
@ తుమ్మేటప్పుడు, దగ్గేప్పుడు తప్పక ఖర్చీఫ్ లు, లేక టిష్యూ పేపర్లను వినియోగించాలి. తరచు చేతులను సబ్బు నీటితో లేక సానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలి
@ కనీసం 30 సెకండ్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలి.
@ ఎక్కువ జనసమూహం ఉన్న ప్రాంతాల్లో సంచరించరాదు
స్వీయ నిర్భందంలో ఉండేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…..
@ కరోనా అనుమానితులు, లేక కరోనా సోకిన వ్యక్తులతో కలిసి మెలిగిన వారు తప్పక స్వీయ నిర్భంధం లోకి వెళ్లాలి.
@ స్వీయ నిర్భందంలో ఉన్న వారి గదిలో తప్పక గాలీ, వెలుతురూ ఎక్కువగా ఉండాలి
@ గదిలోకి వీలైనంత వరకు ఒక్కరే వచ్చేలా చూడాలి. ఆహారం, నీరు అందించేందుకు వచ్చే వారు కూడా పూర్తి ఆరోగ్యవంతులై ఉండేలా జాగ్రత్తపడాలి.
@ ఇంట్లోని మిగతా వారు ఇతర గదుల్లో ఉండాలి. అలా కుదరని పక్షంలో కనీసం ఒకరికి ఒకరు ఒక మీటరు దూరం ఉండేలా జాగ్రత్తపడాలి. @ ఐసోలేషన్ లో ఉన్నవారికి కావాల్సినవి అందించేవారు తప్పక మాస్కులను ధరించాలి.
@ మాస్కులు తడిగా అయినా లేక మురుకిగా మారినా వెంటనే మార్చుకోవాలి. ఆరు గంటలకు మించి మాస్కుని వాడరాదు. మాస్కులను తీసివేసిన తర్వాత తప్పక చేతులను శుభ్రపరుచుకోవాలి.
@ క్వారంటైన్లో ఉన్నవారికి కావాల్సిన వస్తువులు అందించిన వెంటనే చేతులను సబ్బునీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
@ ఇంట్లో తిరిగి వాడుకునే ప్రతి వస్తువుని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు శుభ్ర పరచాలి.
@ వీలైతే డిస్పోజబుల్ పేపర్ టవల్స్ ని లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కో టవల్ ని ప్రత్యేకంగా ఉంచాలి. టవల్ తడిగా మారిన వెంటనే కొత్తవాటిని వాడాలి.
@ హైపో క్లోరైడ్ సొల్యూషన్ తో కనీసం రోజుకు ఒక్కసారైనా ఇంట్లోని టాయిలెట్, బెడ్ ఫ్రేమ్స్, టేబుల్స్ ని శుభ్రం చేయాలి.
@ కరోనాకి ఎలాంటి మందులు లేవు. ఒకరికి ఒకరు దూరంగా ఉండటం, చేతులను తరచు శుభ్రం చేసుకోవటం, జనసమూహంలోకి వీలైనంత తక్కువగా వెళ్లటం ద్వారా కరోనా సోకకుండా జాగ్రత్త పడొచ్చు.

Corona victims in state is steadily increasing
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News