Tuesday, April 30, 2024

వనవాసులా, గిరిజనులా, ఆదివాసులా?

- Advertisement -
- Advertisement -

ఇండిజెనస్’ అనే పదం మొట్టమొదట స్థానిక మూల అమెరికావాసులను, అక్కడి బానిస ఆఫ్రీకన్ల నుండి వేరుగా చూడడం కోసం యూరోపియన్లు వాడారని తెలుస్తున్నది. ఇదొక లాటిన్ పదం ఇండిజిన అంటే (నేటివ్) స్వయంగా పుట్టిన, స్వకీయమైన , స్వాభావికమైన అని అర్ధం. కాస్త విడమర్చి చెప్పాలంటే స్వదేశీయులు లేదా ఆదిమ వాసులు లేదా మాతృక దేశస్థులు అని అర్ధం.భూమి మీద ఎక్కడైనా జనజీవనారంభానికి ఆద్యులని చెప్పవచ్చు.వీరు ఆప్రాంతపు పర్యావరణ కాపలాదారులు. ఇతర ఆధిపత్య సమాజానికి భిన్నంగా ఆప్రాంత స్థానికతకు వారసత్వంగా వస్తున్న అసమానమైన సంస్కృతీ, సంప్రదాయాలకు వారసులు.వీరు నివసిస్తున్న ప్రాంతం ఆర్ధిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వైశిష్టతను బతికిస్తూ వస్తున్నవారు. ప్రపంచ వ్యాప్తంగా వీరు ఎంతో సాంస్కృతిక వైవిధ్యం కలిగి ఉన్నా వారి భిన్న జీవన విధానాలకు సంబంధించి హక్కుల పరిరక్షణ విషయంలో అందరి సమస్యలూ ఒకే విధంగా ఉన్నాయి. వీరు ఒక గుర్తింపు పొందడం కోసం, వీరికి వారసత్వంగాఉన్న సహజ వనరులను, భూములను, వీరిసరిహద్దులను, పర్యావరణ వైవిధ్యాన్నీ కాపాడుకునే విషయంలో శతాబ్దాలుగా పోరాడుతునే ఉన్నారు.

వీరికి సంఘీభావం తెలిపే వారే లేరు. అనాది వీరి సర్వహక్కులు దోపిడీకి గురవుతున్నాయి. ఇక, భారత దేశానికి సంబంధించిన వరకూ వీరి పరిస్థితి అత్యంత హృదయవిదారకం, దయనీయంగా ఉందంటే అతిశయోక్తి కాదు. భారత దేశ ఎవరిని ఈ ఇండిజెనస్ ప్రజలుగా గుర్తించాలి? ఆదిమవాసులా, మూలవాసులా ఇద్దరూ ఒక్కటేనా? ఇంకెవరైనా ఉన్నారా? అనే ప్రశ్నలకు ఆర్యులు వలస సిద్ధాంతం ప్రకారం, ద్రావిడ వలస సిద్ధాంతం, జన్యు పరిశోధనల ప్రకారం, పురావస్తు త్రవ్వకాల ప్రకారం సింధు నాగరికత ఆనవాళ్లు, వైదిక సాహిత్యం, బౌద్ధ చారిత్రక ఆధారాల ప్రకారం మాత్రమే సమాధానం చెప్పగలం. ఆర్యుల కంటే ఎంతో ముందు 45 వేల సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికా నుండి ఈ భారత భూభాగానికి వచ్చి జనజీవనానికి బీజం వేసినవారే ఈ ఇండిజెనస్ ప్రజలు.ఆర్యులు వచ్చి ఈ ఇండిజెనస్ ప్రజలను వివిధ రకాలుగా విడదీసి, ఎన్ని విధాలుగా, ఎన్నిరంగాల్లో, ఎన్ని అంశాల్లో అవమానించాలో అన్ని విధాలుగా అవమానిస్తున్నారు.ఈ మధ్య కొందరు వీరిని వనవాసులని నామకరణం చేసి అవమానాలను పరాకాష్ఠకు చేర్చారు. వనం అంటే అడవి, ఆర్‌ఎస్‌ఎస్ దృష్టిలో వీరు అడవి మనుషులు.

నిజానికి వీరు అడవులకు అధిపతులు.మరికొందరు వీరిని గిరిజనులు అన్నారు. గిరి అంటే కొండ. కానీ వీరు మైదాన ప్రాంతాల్లో, అడవుల్లోనూ ఉన్నారు. ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఇలా ఎవరి అవసరం మేరకు వారు వీరికి నామకరణం చేసి పడేసారు. వీరిని పిలుచుకునే గౌరవ ప్రదమైన పదం ఆదివాసులు, లేదా మూలవాసులు. ఈ పదాలనే వీరి ఉనికిని ఉదహరించే పదాలను వాడుకలోనికి తెచ్చే ప్రయత్నాలు చేయాలి. వీరందరిని రాజ్యాంగ నిర్మాతలు ఒక జాబితా లో చేర్చి గౌరవించే విధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్, లేదా షెడ్యూల్డ్ తెగలని అన్నారు. కాబట్టి ఆ పదాన్ని అయినా వాడాలి. అయితే భారత దేశంలో ఇండిజెనస్ ప్రజలు అంటే కేవలం షెడ్యూల్డ్ తెగల వారేనా అంటే సమాధానం ‘కాదు’ అని వస్తుంది. భారత రాజ్యాంగంలో ఇండిజెనస్ ప్యూపిల్ అనే పదం ఎక్కడా కనబడదు. రాజ్యాంగం ఈకోవలోకి వచ్చే మూలవాసులందరినీ షెడ్యూల్డ్ తెగల వారితో సహా కలిపి ఎస్‌ఇబిసి (ఎస్‌ఇబిసి, సోషల్లీ, ఎడ్యుకేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాస్)అనే నామకరణం చేసింది. అంటే సామాజికంగా సోషల్లీ), విద్యాపరంగా (ఎడ్యుకేషనల్లీ) వెనుకబాటుకు గురైనవారు (బ్యాక్‌వర్డ్ క్లాసెస్) అని అర్ధం.

వివక్షతో కూడుకున్న కుల వ్యవస్థ వేళ్ళూనుకున్న ఈ భారతీయ సమాజంలో రుగ్వేద పురుష సూక్తం సాక్షిగా నాలుగే వర్ణాలు. కానీ ఈ వ్యవస్ధ నాలుగవ వర్ణాన్ని తీవ్రంగా అణచివేత వేసి, అతి నీచాతి నీచమైన పనుల కోసం పంచములను, అయిదవ వర్ణమును అంటరాని వారిని తయారు చేసుకుంది. వీరిలో కొందరు పట్టణాలకు పరిమితమై రాజీపడి అంటరాని కులాలుగా (వీరే షెడ్యూల్డ్ కులాలుగా) స్థిరపడితే, అంటరానితనంతో రాజీపడకఅడవుల్లో స్థిరపడిన అంటరానివారు ఆదిమ తెగలుగా (షెడ్యూల్డ్ తెగలుగా) పిలవబడ్డారు. ఎస్‌సిలు, ఎస్‌టిలది సామాజిక అణచివేతతో కూడిన వెనుకబాటుతనం.మరొక ప్రక్క పైమూడు వర్ణాలు ఆధిపత్యం చేస్తూ నాల్గవ వర్ణమైన శూద్రులకు శతాబ్దాలుగా విద్యను దూరం చేసి వారికి కుల వృత్తులను అంటగట్టి విద్యా పరమైన వెనుకబాటు తనానికి బలి చేశాయి. ఇలా విద్యాపరంగా వెనుకబడిన వారినే ఒబిసిలులేదా అదర్ బ్యాక్ వర్డ్ (ఒబిసి) అని లేదా సింపుల్‌గా బిసిలు అన్నారు.

ఇదంతా ఎందుకంటే భారత దేశంలో ఇండిజెనస్ ప్రజలు అంటే ఎస్‌ఇబిసిలని (ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిల కలయిక) తెలుసుకోవాలి. కానీ ప్రాతినిధ్య ఆధారంగా ( రాజ్యాంగబద్ధమైన రిప్రజెంటేషన్) అధిక శాతం ఎస్‌సిలు, ఒబిసి లు నగరాల్లో స్థిరపడి సామాజికంగా, ఆర్ధికంగా, విద్యాపరంగా ఎదిగారు. కానీ, అటవీ ప్రాంతాల షెడ్యూల్డ్ తెగల వారు ఇంకా ఈ పైమూడు రంగాలలో వెనుకబడే ఉన్నారు. అయితే, నాటి ఆదిమ కళలను, సంస్కృతిని, మాతృస్వామ్య వ్యవస్థనీ, మానవవిలువలైన సమానత్వాన్ని, స్వేచ్ఛని అనుభవిస్తూ కాపాడుకుంటూ వస్తున్నారు. ఆసనాతన కళలకు, సనాతన భారతీయ సంస్కృతికీ తిరిగి పునర్వైభవం తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దురదృష్టం ఏమిటంటే భారత దేశ ఆదివాసులు అత్యంత దయనీయమైన జీవితాలు గడుపుతున్నారు. స్వాతం త్య్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా విద్యకు, వైద్యానికీ, సామాజిక న్యాయానికి ఎంతో దూరంలో ఉన్నారు. మరొక ప్రక్క రాజ్యాంగం వీరికి కల్పించిన ప్రత్యేక హక్కులు, రాయితీలు తీవ్ర భంగపాటు కు, దోపిడీకి గురవుతున్నాయి.

ఇంకొక ప్రక్క అనాదిగా వారు నమ్ముకుని బతుకుతున్నా వారి ఆస్తులైన జల్, జంగిల్, జమీన్ నెమ్మదిగా ప్రైవేటీకరణ ముసుగులో అన్యాక్రాతం అవుతున్నాయి. మరొక వైపు సాంస్కృతిక వారసత్వంగా వారి సమూహాలను, తెగలను కులాలుగా చీల్చి లేని కులాలను వారిలో సృష్టించి మతాలను ఆపాదించి బ్రాహ్మణీకరణ వైపు మళ్లించే కుట్ర బలం గా కొనసాగుతున్నది. ప్రస్తుత మణిపూర్ ఈ కోవకు చెందినదే. మన దేశ 1951 జనాభా లెక్కల ప్రకారం సుమారు 700లకు పైగా షెడ్యూల్డ్ తెగలున్నాయి. వీరి జనాభా 104 మిలియన్లు, అంటే దేశ జనాభాలో 8.6%. దేశంలోనే ఉంటూ ఇంత మందిభారతీయులు భారతీయ సామాజిక వ్యవస్థకు బయట జీవిస్తున్నారన్నమాట. ఒక్కొక్క తెగనూ ఒక్కొక్క కులంగా విడదీసిన ఘనత మన కుల వ్యవస్థది. అన్ని తెగలూ సమానంగా మనుగడ సాగించాల్సిన చోట నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను చొప్పించారు. మొత్తంగా 705 వరకూ తెగలున్నా కేవలం 550 తెగలకు మాత్రమే గుర్తింపు పొందాయి. దేశ జనాభాతో పాటూ వీరి జనాభా కూడా పెరుగుతూ వస్తున్నది. 2001- 2011 దశాబ్ద కాలంలో దేశ జనాభా 17.64% పెరిగితే ఎస్‌టిల జనాభా 23.30% పెరిగింది. తెగల సంఖ్య పెరగడంతో పాటూ వారిలో వారికి అంతర్గత సమస్యలూ, విభేదాలు, అసమానతలు, వివక్షలు, వైరుధ్యాలూ పెరిగాయి.దీనికంతటికీ బ్రాహ్మణీకరణ, క్రైస్తవీకరణ తమ వంతు పాత్ర పోషించాయి.తెగల జాబితాలు విషయంలో మార్పులూ, చేర్పులపై హక్కులు, రాయితీల అంశాలపై అనేక అభ్యంతరాలు కోర్టుల్లోనూ, బయట నలుగుతున్నాయి. వీటికి ఆజ్యం పోస్తూ ప్రభుత్వాలూ తమ వంతు స్వార్ధ రాజకీయాలు చేస్తున్నాయి.

ఒక తెగను గానీ ఒక జాతిని గానీ ఎస్‌టి జాబితాలో చేర్చడానికి ఆర్టికల్ 342 కొన్ని ప్రమాణాలను సూచిసున్నది. ప్రధానంగా ఆ తెగకు ప్రాచీన లేదా అనాదిగా వస్తున్న విశిష్ట వారసత్వం ఉండాలి, విలక్షణమైన సంస్కృతీ ఉండాలి, భౌగోళికంగా ఒంటరి మనుగడ ఉండాలి, ఇతర సామాజిక సమూహాలతో సామాజిక సంపర్కం ఉండకూడదు, ఆర్ధిక వెనుకబాటుతనం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక సమూహాన్ని షెడ్యూల్డ్ తెగ జాబితాలో చేరుస్తారు. కానీ ప్రస్తుతం ఎంత శాతం ఆదివాసులు ఈ ప్రమాణాలకు అనుగుణంగా మనుగడలో ఉన్నాయో వారందరికీ తగిన స్థాయిలో రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయో అన్నది ప్రశ్నర్థకమే.ఇక ఈ ఏడాది అంతర్జాతీయ ఇండిజెనస్ డేకు తీసుకున్న ధీమ్/ అంశం పైన ప్రస్తావించినట్లు ట్రైబల్ యువతకు సాధికారతతో వారిని పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం చేయడం లాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన సమయం వచ్చింది. నేడు ఈ షెడ్యూల్డ్ తెగల యువతలో బాధ్యతా రాహిత్యం కొట్ట వచ్చినట్లు కనిపిస్తుంది. తండాలలో నిరక్షరాస్యులైన తలిదండ్రులు, చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలు, నిధులు కొరత , ప్రణాళిక లేని పాలన వీటికి తోడుగా చాప కింద నీరులా కార్పొరేట్ దోపిడీ ఇవన్నీ యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్నాయి.

కొత్తగా వచ్చిన మరొక సమస్య ఏమిటంటే ఎన్నోయాళ్లగా షెడ్యూల్డ్ ప్రాంతాలకు (ట్రైబల్ ఏరియాలకు) వలస వెళ్లి అక్కడ ఆస్తులు సంపాదించి, వ్యాపారులు చేస్తున్న నాన్ ట్రైబ్స్ (షెడ్యూల్డ్ తెగలకు చెందని వారు) కూడా అక్కడ వనరుల మీద ఆధిపత్యాన్ని హక్కులను డిమాండ్ చేయడం. ట్రైబల్ టూరిజం పేరుతో విపరీతంగా జరుగుతున్న పర్యావరణ హానీని ఆపే నాధుడే లేడు.ట్రైబల్ టూరిజం పేరుతో స్థానిక యువతకు ఉద్యోగాల ఆశ చూపి చిన్న చిన్నఉద్యోగాలు ఎర వేసి వారి విద్యనీ, వారి ఉన్నత అవకాశాలను, ఉజ్వల భవిష్యత్తును దోచుకుంటున్న కుట్ర కూడా ఇక్కడ ప్రస్తావించాలి. గ్లోబలైజేషన్ దెబ్బకు షెడ్యూల్డ్ తెగలకు చెందిన యువత త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతుంది.అధిక శాతం మొబైల్ ఫోన్లకు బానిసలైతే, మిగిలిన వారు గంజాయి, పొగాకు ఉత్పత్తుల వ్యసనాలకు బానిసలై వారి జీవితాలను, వారి కుటుంబాలను వారి విశిష్టమైన వారసత్వ సంక్రమిత సంస్కృతినీ నాశనం చేస్తున్నారు. రహదారులు లేని చోట కూడా సిగ్నల్ టవర్స్ ఏర్పాటు చేసి వీరి భవిష్యత్‌ను కార్పొరేట్ కాటేస్తున్నది. నిర్దిష్ట తెగలను, జాతులను రూపు రేఖలు లేకుండా తుడిచి వేసే ప్రక్రియ పరోక్షంగా జరుగుతున్నది. దీనినే ఎత్నిక్ ఖ్లెన్సింగ్ అంటాం. తెగలను వారి ఉనికిని నాశనం చేసే భావజాలమిది. జాతులు అంతరించిపోతే వారసత్వ సంస్కృతీ, వనరులు, పర్యావరణ దేశ మనుగడ అంతరించిపోయే పరిస్థితి నెలకొనవచ్చు.

-డా. మాటూరి శ్రీనివాస్
9749000037.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News