Thursday, May 2, 2024

మేకింగ్ కాదు ప్యాకింగ్!

- Advertisement -
- Advertisement -

2024 డిసెంబరు నాటికి మేడిన్ ఇండియా తొలి చిప్ మార్కెట్‌కు వస్తుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల అమెరికా వెళ్లినపుడు ఈ మేరకు మైక్రాన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని, గుజరాత్‌లోని సనంద్ వద్ద దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫాక్స్‌కాన్ వేదాంత సంయుక్త భాగస్వామ్యంలో మరో కంపెనీ కూడా దరఖాస్తు చేయనుందని చెప్పారు. జనాలు నిజమే అని ఆహో, ఓహో నరేంద్ర మోడీ మంత్రదండం మహిమ ఏమిటో చూడండి, ఇలా ఒప్పందం చేసుకున్నారో లేదా అలా ఉత్పత్తి వచ్చేస్తోంది, ఇదే ఊపుతో త్వరలో చైనాను వెనక్కు నెట్టేస్తాం అన్నట్లుగా స్పందించారు. ఆకలితో ఆవురావురు మంటూ ఎదురు చూస్తున్న అన్నం కనిపిస్తే చాలు కడుపు నిండుతుంది అన్నట్లుగా ఈ వార్త సంతోషం కలిగిస్తుంది, ఆనందాన్ని తెస్తుంది.

దీని వెనుక ఉన్న కథ తెలిస్తే వామ్మో గుజరాత్ మోడల్ ఇలా ఉంటుందా అని గుండెలు బాదుకుంటారు. ఇక్కడ ఒక ప్రశ్న అడిగితే దేశభక్తిని ప్రశ్నిస్తారేమో? ఫాక్స్‌కాన్ వేదాంత సంస్థ కలసి గుజరాత్‌లో లక్ష మందికి ఉపాధి కల్పించేందుకు 19.5 బిలియన్ డాలర్లతో (రూ. లక్షా 60 వేల కోట్లు) ఒక చిప్స్ ఫ్యాక్టరీని పెడుతున్నట్లు 2022 సెప్టెంబరులో ప్రకటించారు. అది ఇంతవరకు ఏమైందో, ఎక్కడుందో చెప్పరు. కొత్తగా పద్దెనిమిది నెలల్లోనే ఐదు వేల మందికి పని చూపే మైక్రాన్ ఉత్పత్తి మార్కెట్‌కు వస్తుందని చెబుతున్నారు. మోడీ చెప్పింది వినాలి తప్ప అడిగితే మామూలుగా ఉండదు. ప్రశ్న అడిగిన అమెరికా జర్నలిస్టును ఎలా వేధిస్తున్నారో చూస్తున్నాంగా ! మైక్రాన్ కంపెనీ పెట్టుబడి 270 కోట్ల డాలర్లు (మన రూపాయల్లో 22,350 కోట్లు) అని చెప్పారు. దీనిలో అది నిజంగా పెట్టే మొత్తం రూ. 6,830 కోట్లు. మరి మిగతాది! కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్లు (50 శాతం), రాష్ర్ట ప్రభుత్వం భూమి, ఇతర రూపాల్లో మరో ఇరవైశాతం సబ్సిడీ ఇస్తుందట. కంపెనీ పెట్టేది కేవలం 30 శాతం మాత్రమే. అంటే రూ. 30 పెట్టుబడి పెట్టిన మైక్రాన్ కంపెనీని రూ. వందకు స్వంతదారును చేస్తారు. ప్రతి పైసాను కాపాడేందుకు చౌకీదారును అని చెప్పుకున్న మోడీ ఏలుబడిలో తప్ప ఎక్కడైనా ఇలా జరుగుతుందా? చైనాలో గిట్టుబాటు కావటం లేదని కొన్ని కంపెనీలు ఇతర దేశాల్లో సబ్సిడీలను చూసి అక్కడ నుంచి వెళుతున్నట్లు చెబుతున్నారు. అలాగే మరొక దేశం ఏదైనా ఇంతకంటే ఎక్కువ సబ్సిడీలు ఇస్తామంటే మైక్రాన్ కంపెనీ సరకు, సరంజామా మొత్తాన్ని అక్కడికి తరలిస్తే… 2020లో జనరల్ మోటార్స్ కంపెనీ వెళ్లిపోయినట్లే జరగవచ్చు. అది తీసుకున్న సబ్సిడీ పైసా తిరిగి ఇవ్వదు. అయినా 70 శాతం సబ్సిడీ ఇస్తామంటే ఎవరైనా మన దేశానికి రాకుండా ఉంటారా? అవసరం తీరింతరువాత వెళ్లిపోకుండా ఉంటారా? అసలు కత వేరే. ఈ కంపెనీ మన దేశంలో చిప్స్ (సెమీకండక్టర్లు) తయారు చేయదు. ఎక్కడో డిజైన్ చేసి మరెక్కడో ఉత్పత్తి చేసిన విడి భాగాలను మన దేశానికి తీసుకు వచ్చి వాటి రూపకల్పన ప్రకారం ఒక దగ్గర అమర్చి (ఫాబ్రికేషన్), సరిగా ఉన్నాయా లేదా అని పరీక్ష చేసి అట్టపెట్టెల్లో పెట్టి ఎక్కడి కావాలంటే అక్కడికి పంపుతారు. చెప్పేది మేడిన్ లేదా మేకిన్ ఇండియా జరిగేది, ప్యాకింగ్ ఇండియా. అదైనా గొప్పేకదా కొంత మందికి ఉపాధి దొరుకుతుంది కదా అని చెప్పేవారిని మేకింగుకు ప్యాకింగు తేడా తెలుసుకోవాలని చెప్పటం తప్ప చేసేదేమీ లేదు.

మేకిన్, మేడిన్ ఇండియా పిలుపులు విఫలమైనందున కేంద్ర ప్రభుత్వం ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పేరుతో వేల కోట్ల రూపాయలను పక్కన పెట్టింది. మైక్రాన్ సంస్థ మన దేశంలో ఉత్పాదక కంపెనీ కాదు, కానీ దీనికి ఆ సొమ్మును ఇవ్వనుంది. ఇంత వాటంగా ఉంది కనుకనే అమెరికా పాలకులు అక్కడి కంపెనీలను మన దేశంలో ప్యాకింగ్ యూనిట్లు పెట్టి ఎంత వీలైతే అంత సొమ్ము చేసుకోమని చెబుతున్నారు. చైనా బాటలో నడచి దేశాన్ని వృద్ధి చేస్తామని, దాన్ని వెనక్కు నెడతామని మన పాలకులు చెప్పారు. చైనా కూడా పెట్టుబడులు పెట్టిన వారికి సబ్సిడీలు ఇచ్చింది, ఇలా ప్యాకింగ్ రాయితీలు కాదు, ఉత్పత్తి చేసి తన వారికి పని కల్పించి ఎగుమతులు చేసింది. అమెరికాను మించి జిడిపిలో ముందుకు పోనుంది. సెమీకండక్టర్ రంగంలో స్వంతంగా ఉత్పత్తికి పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది తప్ప ఇతర దేశాలకు లొంగి వాటి షరతులను, ప్యాకింగ్‌లకు అంగీకరించటం లేదు. గతంలో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన చిప్స్‌లో 90 శాతం దిగుమతి చేసుకొనేది. ప్రస్తుతం నాణ్యత తక్కువగా ఉన్నప్పటికీ 1,000 రకాల చిప్స్‌ను చైనా ఉత్పత్తిదారుల నుంచే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వరంగ కార్ల సంస్థ నిర్ణయించింది. ఆధునిక రకాల రూపకల్పనకు యుద్ధ ప్రాతిపదికన ముందుకు పోతున్నది.
చైనాతో మైక్రాన్ కంపెనీకి ఎక్కడ చెడింది? ప్రతి దేశం తన భద్రతను తాను చూసుకుంటుంది. అమెరికాలో ఉత్పత్తి అవుతున్న చిప్స్‌ను ఏ దేశంలోనైనా వినియోగిస్తే ఆ దేశానికి లేదా ఉత్పత్తికి సంబంధించిన సమాచారం, రహస్యాలను సేకరించే అవకాశం ఉంది. తన టెలికాం పరికరాల ద్వారా చైనా ఆ పని చేస్తున్నదంటూ అమెరికా, మన దేశం అనేక యాప్స్‌ను నిషేధించించిన అంశం తెలిసిందే. అలాంటి పరీక్షలో మైక్రాన్ సంస్థ తన ఉత్పత్తుల్లో అలాంటి దొంగ చెవులు, కళ్లేమీ లేవని నిరూపించుకోలేపోయింది కనుక చైనా తమ మార్కెట్లో వాటి కొనుగోళ్ల మీద ఆంక్షలు ప్రకటించింది. భద్రతా పరీక్షలేమీ లేకుండా వాటిని మన మార్కెట్లో అమ్ముకొనేందుకు, ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేసేందుకు నరేంద్ర మోడీ సర్కార్ అంగీకరించింది.

అమెరికా మీద అంతనమ్మకం ఉంచటం ప్రమాదకరం. సెమీకండక్టర్ల పరిశ్రమలు పెడితే సబ్సిడీలు ఇచ్చేందుకు 2021లో కేంద్ర ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల మేరకు నిధులు పక్కన పెడుతున్నట్లు చెప్పింది. ఆ మొత్తాన్ని స్వంతం చేసుకోవాలని అనేక మంది రంగంలోకి వచ్చారు. వాటిలో ఫాక్స్‌కాన్‌వేదాంత ఒకటి. వీటి దగ్గర డబ్బు ఉంది తప్ప చిప్స్ ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానం, అనుభవమూ లేదు. రెండూ కలసి ఐరోపాకు చెందిన ఎస్‌టిఎం మైక్రో టెక్నాలజీస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రతిపాదించాయి. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, పెట్టుబడితో సహా అనేక షరతులను ఎస్‌టిఎం ముందుకు తెచ్చింది. ఐదు పది సంవత్సరాల తరువాత తాము తప్పుకుంటామని చెప్పగా వేదాంత ఫాక్స్‌కాన్ దీర్ఘకాలం ఉండాలని డిమాండ్ చేసినట్లు వార్తలు. వీరి పెట్టుబడి రూ. 66 వేల కోట్లు కాగా, దీనికి కూడా కేంద్రం రూ. 76 వేల కోట్లు సబ్సిడీ ఇస్తామన్నది, గుజరాత్ కూడా గణనీయంగా రాయితీలు ఇచ్చేందుకు సిద్ధపడినా ముందుకు సాగటం లేదు. ఇది కూడా 30కి 70 సబ్సిడీగానే ఉంటుంది. కర్ణాటకలో పరువు పోయింది. దేశంలో ఆర్థిక స్థితి సజావుగా లేదు. ఐదు రాష్ట్రాలు, తరువాత లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కనుక ప్యాకింగ్‌ను కూడా మేకింగ్‌గా ఎన్నికల ముందు ప్రచారం చేసుకోవచ్చని మైక్రాన్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు కనిపిస్తోంది.

దేశ ప్రజలందరి సొమ్మును మోడీ సర్కార్ గుజరాత్‌కే సబ్సిడీగా ఖర్చు చేసేందుకు పూనుకోవటం మరొక అంశం. ఇతర బిజెపి పాలిత రాష్ట్రాలకూ లేదు, మోడీకి అణగిమణగి ఉంటున్న ఆంధ్రప్రదేశ్, ఒడిషా, తెలంగాణ వంటి రాష్ట్రాలకూ ఒక్క ప్రాజెక్టూ రావటం లేదు. గుజరాత్‌కు ఇస్తున్న మాదిరి కేంద్రం సబ్సిడీ ఇస్తే ఏ రాష్ర్టంలోనైనా వాటిని పెట్టవచ్చు. మోడీ అంటే గుజరాత్ ప్రధాని అనుకుంటున్నారు గనుక అది జరగదన్నది తెలిసిందే. నరేంద్ర మోడీ సర్కార్ గత తొమ్మిదేండ్లలో చేసిన అప్పు గురించి ఎవరైనా అడిగితే కరోనా కాలంలో చేసిన సాయం, ఉచితంగా వ్యాక్సిన్లకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఎదురు ప్రశ్నిస్తారు. అవి నిన్నగాక మొన్న, 2014 నుంచి చేసిన అప్పులు, చమురు మీద విధించిన భారీ సెస్సుల మొత్తం గురించి మాట్లాడరు. మోడీ చేసిన అప్పుకు గబ్బర్‌సింగ్ టాక్సు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తే వచ్చిన డబ్బు అదనం. ఇంత అప్పుతో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కానీ, పేదరిక నిర్మూలన అనేది ఎక్కడా జరగలేదు. మరి ఈ డబ్బు ఎక్కడికి పోయింది? అంటూ ఒక పోస్టు వ్యాట్సాప్‌లో తిరుగుతోంది. అచ్ఛేదిన్, తనకు అధికారం ఇస్తే కాంగ్రెస్ ఏలుబడిలో తూర్పున పొడిచిన సూర్యుడిని పశ్చిమానికి మారుస్తాను అన్నట్లుగా జనాన్ని నమ్మించిన నరేంద్ర మోడీ 2014లో అధికారానికి వచ్చారు.

కాగ్ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రూ. 50,68, 235 కోట్లు కాగా, కేవలం నరేంద్ర మోడీ చేసిన అప్పు 2024 మార్చి నాటికి రూ. 118,78,431 కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. దీనికి పాత అప్పును కలుపుకుంటే 169 లక్షల కోట్లు అవుతుంది. కొత్తగా ప్రభుత్వ రంగంలో ఒక్క పరిశ్రమ లేదు. తొమ్మిదేండ్లలో ఎవరితోనూ యుద్ధాలు లేవు గనుక మిలిటరీ నిర్వహణ తప్ప కొత్తగా ఆయుధాలు పెద్దగా కొన్నది లేదు. ఇంత సొమ్ము ఏం చేశారంటే కార్పొరేట్లు బ్యాంకులకు ఎగవేసిన రుణాలను రద్దు చేసి దాని బదులు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొంత మొత్తం సర్దుబాటు చేశారు. ఏదో ఒక పేరుతో పైన చెప్పిన సెమీకండక్టర్ పరిశ్రమల రాయితీలు, ఇతర సబ్సిడీల పేరుతో కార్పొరేట్లకు సమర్పించుకున్నారన్నది స్పష్టం. వాటితో పోలిస్తే రైతాంగానికి, ఇతరులకు ఇచ్చిన రాయితీలు నామమాత్రం. అందుకే సొమ్ము పోయే శనీ పట్టే అన్నట్లుగా కార్పొరేట్లు సబ్సిడీలను తమ ఖాతా ల్లో వేసుకున్నారు తప్ప తిరిగి పెట్టుబడిగా కూడా పెట్టలేదు. జనానికి ఉపాధి లేదు.

పాబ్రికేషన్, ప్యాకింగ్ ద్వారా ప్రపంచ సెమీకండక్టర్ ఉత్పత్తి కేంద్రంగా మన దేశం మారుతుందని ఎవరైనా చెప్పగలరా? ఇలా ఏ దేశమైనా ఏ ఉత్పత్తిలోనైనా ఇలా మారిందా? మలేషియా ఇప్పటికే ఈ రంగంలో ఎంతో ముందుంది. వేరే చోట్ల తయారైన చిప్స్ పరీక్ష, విడి భాగాల ఫాబ్రికేషన్ ప్రపంచ ఉత్పత్తిలో పదమూడు శాతం వరకు అక్కడే అక్కడ జరుగుతోంది. ఒక విధంగా ప్రపంచ హబ్‌గా ఉంది. ఆధునిక చిప్స్ కంపెనీలను తమ దేశంలోనే ఉంచుకొని తక్కువ రకం వాటిని ఇతర చోట్ల పరీక్షలకు అమెరికా కంపెనీలు పంపుతున్నాయి. వంద బిలియన్ డాలర్ల మెగా ఫాబ్రికేషన్ సంస్థను అమెరికా వాషింగ్టన్ సమీపంలోని క్లే అనే చోట ఏర్పాటు చేస్తూ 2.75 బి.డాలర్ల (దానిలో 70 శాతం మన సబ్సిడీ) సంస్థను గుజరాత్‌లో ఏర్పాటు చేసేందుకు మైక్రాన్ సంస్థ పూనుకుంది. మన దేశంలో చిప్స్ అవసరం నానాటికీ పెరుగుతున్నది. ఎంతగా అంటే 2019లో 22.7 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ 2026 నాటికి 64 బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా. అందువలన మన దేశం స్వంతంగా ఉత్పత్తి చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. ప్రస్తుతం వివిధ రకాల సెమీకండక్టర్లు ఉన్నాయి. వాటి రూపకల్పన, తయారీ, విడి భాగాల అమరిక, పరీక్ష, ఉత్పత్తి చేసే యంత్రాలు ఇలా ఎన్నో ప్రక్రియలు ప్రస్తుతం కొన్ని దేశాల స్వంతం అంటే అతిశయోక్తి కాదు. గుత్తాధిపత్యం, మార్కెటింగ్ నిలుపుకొనేందుకు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నాయి.

తైవాన్ ప్రాంతం, దక్షిణ కొరియా, అమెరికా, జపాన్, నెదర్లాండ్స్, చైనా, ఐరోపా సమాఖ్య, ఇజ్రాయెల్ ఈ రంగంలో తిరుగులేనివిగా ఉన్నాయి. ఇతర దేశాల ఉత్పత్తులతో పోల్చితే చైనా వెనుకబడి ఉంది. ఉత్పత్తితో పాటు అవసరాలకు అది ఎక్కువగా దిగుమతుల మీదనే ఆధారపడుతోంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఎగుమతులు, ఉత్పత్తికి అవసరమైన యంత్రాలను చైనాకు అమ్మకుండా అమెరికా, దానితో చేతులు కలిపిన దేశాలు ప్రస్తుతం చిప్స్ వార్ జరుపుతున్నాయి. చివరకు తమ పౌరులెవరూ చైనా కంపెనీల్లో పని చేయకూడదని నిషేధం విధించాయి. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ ఉత్పత్తుల వంటి వాటిలో సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన గాలియం, జెర్మీనియం వంటి లోహాల దిగుమతి, వినియోగం గురించి అమ్మకాలు జరిపే సంస్థలు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలంటూ పరోక్షంగా చైనా నిషేధం విధించింది. అమెరికాకు చెందిన మైక్రాన్ సంస్థ ఉత్పత్తులు రక్షణకు ముప్పు తెస్తాయని వాటిని నిషేధించింది. ఈ పోరు ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించటం లేదు. గతంలో అనేక రంగాల్లో చైనాను ఇబ్బంది పెట్టేందుకు చూస్తే వాటిని సవాలుగా తీసుకొని తనదైన ప్రత్యేకతను నిరూపించుకుంది. ఇప్పుడూ అదే బాటలో ఉంది. మన దేశం మాదిరి ప్యాకింగ్‌తో సంతృప్తి చెందకుండా మేకింగ్‌తో ముందుకు పోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News