Monday, May 13, 2024

చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేను: మోడీకి స్పష్టం చేసిన దీదీ

- Advertisement -
- Advertisement -

చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేను:మోడీకి స్పష్టం చేసిన దీదీ
కేంద్రం, పశ్చిమబెంగాల్ మధ్య వివాదాల తుపాన్

Not Release to Chief Secretary: Mamata Banerjee

కోల్‌కతా: కేంద్రం, బెంగాల్ మధ్య వివాదాల తుపాన్ ఆగడం లేదు. యాస్ తుపాన్ సమీక్ష సమావేశం కేంద్రం, దీదీ మధ్య వివాదాల తుపాన్‌గా మార్చింది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వ కార్యదర్శి అలపన్ బంధోపాధ్యాయను తక్షణం రిలీవ్ చేయాలని కేంద్రం రెండు రోజుల క్రితం ఆదేశించగా ఆయనను రిలీవ్ చేయలేమని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కేంద్రానికి స్పష్టం చేశారు. సిఎస్‌ను కేంద్రానికి రిపోర్ట్ చేయాలని వెలువడిన ఏక పక్ష ఉత్తర్వు తనను షాక్‌కు గురి చేసిందని, మమత తన నిరసన గళం వినిపించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ప్రధాని మోడీకి సోమవారం లేఖ రాశారు. కరోనాతో బెంగాల్ విలవిల్లాడుతోందని, దీనికి తోడు యాస్ తుపానుకు మరింత నష్టపోయిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని రిలీవ్ చేయలేమంటూ ఆమె లేఖలో స్పష్టం చేశారు. మే 31 నాటికి బంధోపాధ్యాయకు 60 ఏళ్లు నిండుతాయి.వాస్తవానికి ఈరోజే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన సేవలను మరో మూడు నెలల పాటు పెంచుతూ గత సోమవారం మమత ఆదేశాలు జారీ చేశారు. కరోనాను ఎదుర్కోవడంలో ఆయనకు ఉన్న అనుభవం దృష్టా సేవల పెంపుపై ఈనెల 12న ప్రధానికి మమత లేఖ రాశారు.

ఆయన పదవీకాలం పొడిగించడానికి రాష్ట్రం చేసిన అభ్యర్థనను కేంద్రం అంగీకరించిందని ఈ సందర్భంగా లేఖలో ఆమె గుర్తు చేశారు. దాంతో తాజా ఉత్తర్వులు చట్టాలను ఉల్లంఘించేవిగా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆమె ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆదేశాల వెనుక కలైకుండాలో ప్రధాని మోడీతో జరిగిన సమావేశానికి ఏదైనా సంబంధం ఉందా? అదే కారణం అయితే చాలా దురదృష్టకరం. ఈ నిర్ణయం ప్రజా ప్రయోజనాలను బలిపెట్టడం కిందకే వస్తుందని ఆమె లేఖలో వ్యాఖ్యానించారు. గత శుక్రవారం యాస్ తుపాను పై మోడీతో జరిగిన సమావేశానికి మమతతో కలసి ప్రధాన కార్యదర్శి ఆలస్యంగా వచ్చారు. ఆ వెంటనే ఆయన ఢిల్లీలో రిపోర్టు చేయాలని కేంద్రం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ ఉత్తర్వుల వెనుక సమావేశం ప్రభావం ఉందేమోనన్న చర్చ జరుగుతోంది.

Not Release to Chief Secretary: Mamata Banerjee

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News