Friday, September 20, 2024

అనాగరిక విశ్వాసాలే అనర్థాలు

- Advertisement -
- Advertisement -

మూర్ఖత్వాన్ని ఉన్నతీకరించి గొప్పగా చెప్పుకోవడం అనేది నన్ను అమితంగా బాధిస్తుంది. అంతకన్నా నన్ను బాధించేది మరొకటి లేదు’ అని అన్నారు ప్రఖ్యాత శాస్త్రవేత్త, వైజ్ఞానిక రచయిత కార్ల్ సాగన్. NOTHING DISTURBS ME MORE THAN THE GLORIFICATION OF STUPIDITY CARL SAGAN. వివేచన, మౌనం రెండూ కవల పిల్లలు. అందులో ఒకటి వచ్చిందంటే, దానితో పాటు రెండోది తప్పకుండా వస్తుంది. పిచ్చివాగుడు వాగే వారికి వివేచన ఉండదని ఇక్కడ గోప్యంగా చెప్పడం జరిగింది. మంగళ సూత్రాల మీద మాట్లాడే మన దేశ మహా నాయకుడికి ఇది వర్తిస్తుందంటారా? బిజెపి ప్రభుత్వానికి అంతర్గతంగా కొన్ని నినాదాలున్నాయి. అవేమంటే “హిందుత్వాన్ని ప్రేమించలేని వాడు భారత దేశాన్ని ఎలా ప్రేమించగలడూ?” అని! “జై శ్రీరామ్ అనని వాళ్ళంతా పాకిస్తాన్ వెళ్ళిపోవాలి” అని! “రోగాన్ని ప్రేమించలేని వాడు శరీరాన్ని ఎలా ప్రేమించగలడూ?” అన్నట్టుగా ఉంది వీరి నినాదం.

హిందూ, ముస్లిం, క్రైస్తవం లాంటి మతాలన్నీ “ధర్మవ్యాధులే”. ఇందులో హిందూ ధర్మ వ్యాధిని భారత దేశ ప్రజలకు అంటించిన తొలి పేషంట్ నరేంద్ర మోడీ. ఈయనను ఈ దేశ ప్రజలు ధర్మవ్యాధిని వ్యాప్తి చేయడానికి ప్రధానిగా చేశారా? లేక పరిపాలన చేయ్యమనా? దేశాన్ని దేశంగానే ప్రేమించాలి. అందుకోసం ఏదో ఒక ధర్మవ్యాధిని అంటగట్టుకోవాల్సిన పని లేదు. శరీరం వ్యాధిగ్రస్తమైతే ఏం చేస్తాం? చికిత్స చేయించుకుని ఆ వ్యాధిని వదిలించుకుంటాం, కనీసం తగ్గించుకుంటాం. అందువల్ల, మతానికీ, దేశానికీ తేడా తెలియని వారు వెంటనే మానసిక చికిత్స చేయించుకోవాలి. దేశం వేరు, మతం వేరూ అనేది తెలుసుకోగలగాలి. ప్రపంచంలో ఏ దేశమూ ఏ ఒక్క మతానికీ స్వంతం కాదు. కొంచెం ఎక్కువ, తక్కువలుగా ప్రస్తుతం అన్ని మతాల వారు అన్ని దేశాల్లోకి వలస వెళ్ళారు.

మన భారత దేశపు ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ శతాబ్దాలుగా ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులు సమ్మిళితమై ఉన్నాయి. ‘మానసిక రోగులు’ ముందు ఆ విషయం గ్రహించుకోవాలి! ఈ భూమి, ఈ దేశం ఎవరో తయారు చేసింది కాదు. ఎవరి స్వంత ఆస్తో కాదు. ఇది అందరిది! ఇక విశ్వాసాలు, మతాలూ అంటారా? అవి వ్యక్తిగతంగానే ఉండాలి. ప్రతి ఒక్కరికీ ఆ స్వేచ్ఛ ఉంది. ఈ భూమి జనాన్ని విడదీయడం లేదు. ఈ భూమి మీద మనిషి ఎప్పుడో ఒకప్పుడు అనాగరిక యుగంలో ఏర్పరుచుకున్న విశ్వాసాలు ఇప్పుడు జనాన్ని విడగొడుతున్నాయి! అందులోనూ అధికారంలో ఉన్నవారు మూర్ఖంగా మతాని ఊరేగిస్తూ, తాము ఊరేగుతున్నారు. అందుకు ఈ దేశ ప్రజలు ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఈ దేశంలోని మూలవాసులే కొంత మంది కాలక్రమంలో ముస్లింలుగా, క్రైస్తవులుగా మారారు. తప్పిస్తే, ఇక్కడ ఆ మతాలకు మూలాలు లేవన్నది నిజం. బౌద్ధులుగా, జైనులుగా ఉన్న ఈ దేశ మూలవాసుల్ని బలవంతంగా శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వగైరాలంతా కలిసి వారి వారి కాలాలలో వైదిక మతస్థులుగా మార్చారన్నది నిజం! అందుకు అన్ని ఆధారాలూ ఉన్నాయి.

ఇక ఇప్పుడు అన్ని మతాల వారు కలిసి మెలిసి శతాబ్దాలుగా సహజీవనం చేస్తూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒక మిశ్రమ భారతీయ సంస్కృతిని అభివృద్ధి చేసుకున్న దశలో ఎవడో వచ్చి, ఇది ‘హిందూ దేశం’ అని అంటే కుదరదు.
ఈ దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు ఇంకా అనేకానేక మతాల వారు అందరూ ఈ దేశ మూలవాసులే! లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి జీవ పరిణామ దశలు గమనిస్తే, పెద్ద ఎత్తున జరిగిన మానవ వలసల విషయం క్షుణ్ణంగా గ్రహిస్తే, ఈ దేశానికి అందరికందరూ వలస వచ్చిన వారే. అయితే తొలుత వచ్చిన ఎన్నో మానవ జాతుల్లోంచి లక్షల సంవత్సరాల కాలంలో హోమియో సేపియన్లు విడివడి, క్రమంగా నాగరికతను ఏర్పచుకుంటూ వచ్చారు. వ్యవసాయం అభివృద్ధి చేసుకుని ప్రశాంతంగా జీవించారు. వారే ఈ దేశ మూలవాసులు.

ఆ సమయంలో గుర్రాల మీద వలస వచ్చిన వారు బ్రాహ్మణార్యులు. వారు, తమ ఆధిక్యతను చాటుకోవడానికి తమను భగవంతుడి స్థానంలో నిలుపుకున్నారు. మిగతా వారిని కుల సంస్కృతి ప్రకారం నిచ్చెనమెట్ల వ్యవస్థగా విభజించారు. మూలవాసులు ఈ విషయం క్షుణ్ణంగా అవగతం చేసుకోవాలి. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి మూలవాసులంతా వైదిక మత ఆచారాలను అనుకరిస్తూ అదే గొప్ప సంస్కృతి. అదే గొప్ప సంప్రదాయం అనే భ్రమలో ఉండికూడదు. వారిని బానిసల్లా తొక్కిపెట్టడానికి హైందవమెంత క్రూరంగా ప్రవర్తించిందో తెలుసుకోవాలి. ప్రపంచానికి తొలిసారి భౌతికవాదాన్ని వివరించిన వారు మన చార్వాకులు. వారేం చెప్పారో తెలుసుకోరు. ఆ తర్వాత వచ్చిన బౌద్ధం, జైనం సూచించిన జీవన విధానం గూర్చి తెలుసుకోరు. వీటన్నిటినీ నాశనం చేస్తూ దౌర్జన్యంగా వచ్చి పెత్తనం చలాయించిందే వైదిక మతం కదా? తర్కబద్ధమైన, మానవీయ విలువలతో కూడిన చార్వాకాన్ని, బౌద్ధాన్ని వదిలేసి మూర్ఖపండితులు రూపొందించిన హైందవాన్ని అనుకరించడం విచారకరం.

తాము గొప్ప దైవభక్తులమై పొయ్యామనుకోవడమంత హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదు. అయితే మూలవాసులు ఈ విషయం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. వివేకవంతుడెవ్వడూ మనువాద సంస్కృతిని, బ్రాహ్మణిజాన్ని సమర్ధించడు. సరే ఈ విషయాలు అలా ఉండనిచ్చి మనువాదం పునాదులుగా గల బిజెపి కేంద్ర ప్రభుత్వం ఏం చెపుతూ ఉందో చూద్దాం! వారి మాటల వెనక ఎంత నిజాయితీ ఉందో పరిశీలిద్దాం! కాంగ్రెస్ వారు, ఇతర ప్రతిపక్షాల వారు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని మోడీ గొంతు చించుకుంటూ ఉంటారు కదా? తను కూర్చున్న కుర్చీ అడుగున ఎన్ని గోతులున్నాయో, ఆ గోతుల్లో ఎన్నెన్ని కుటుంబాలున్నాయో ఏ మాత్రం చూసుకోరు. తమ బిజెపి కుటుంబాల వైపు లేదా భాగస్వాములైన ఎన్‌డిఎ కూటమి కుటుంబాల వైపు చూసుకుంటే కుటుంబ రాజకీయాలంటే ఏమిటో తెలిసొచ్చేది.

ఉదాహరణకు మనమిక్కడ కొన్ని కుటుంబాల గురించి చూద్దాం. ఏం? ఇవి కుటుంబ రాజకీయాలూ వారసత్వ రాజకీయాలూ కావా? ప్రణిత్ కౌర్: పంజాబ్ మాజీ సి.ఎం. అమరిందర్ సింగ్ భార్య బన్సురీ స్వరాజ్; సుష్మా స్వరాజ్ కుమార్తె సీతాసోరెన్; జెఎంఎం నేత శిబుసోరెన్ కోడలు గీతా కోడా; జార్ఖండ్ మాజీ సిఎం మధుకోడా భార్య జ్యోతి మిర్ధా; మాజీ ఎంపి నాథూరామ్ మిర్థా మనుమరాలు గాయత్రి సిద్దేశ్వర; కేంద్ర మాజీ మంత్రి జి.ఎం. సిద్దేశ్వర భార్య నవనీత్ రాణా; మాజీ ఎంఎల్‌ఎ రవి రాణా భార్య మాళవికా దేవి; మాజీ ఎంపి అర్క కేసరి దేవ్ భార్య కృతి సింగ్ దేవ్ వర్మ; త్రిప్రా మోరా పార్టీ వ్యవస్థాపకుడు ప్రద్యోత్ కిషోర్ మాణిక్యదేవ్ వర్మ సోదరి. పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు కుమార్తె. ఇవి కొన్ని మాత్రమే వీళ్లంతా ఎన్‌డిఎ భాగస్వాములు బిజెపి ప్రభుత్వంతో భుజం భుజం రాసుకుని తిరిగేవారు. మోడీ, షాలకు ఎందుకో తమ చుట్టూ ఉన్నవారు కనబడరు. తమకు ఉన్న కంటి దోషం బాగు చేయించుకోరు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. నరేంద్ర మోడీ తన కుటుంబ సభ్యులెవరూ రాజకీయాల్లోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. వేరే వాళ్ళ లాగా తన భార్య ఎక్కడ రాజకీయాల్లోకి వచ్చి, తనను మించి పోతుందేమోనని ముందే పసిగట్టి అనైతికం అని తెలిసి కూడా ఒక మహిళ బతుకును నాశనం చేయడం లాంటిదని తెలిసి కూడా విడాకులు ఇవ్వకుండానే భార్యను వదిలేశాడు. అదే విచిత్రం!

దేశ ప్రజలంతా తన కుటుంబమని చెప్పుకుని తిరుగుతుంటారు. ఆ అనైతిక సాహసానికి ఎవరు జోహారు చెప్పాలీ? పైగా, ఈ మధ్య తనే ఏర్పాటు చేసుకున్న ఇంటర్వూలలో మోడీ చిత్రవిచిత్రమైన విషయాలు చెపుతున్నాడు. తన తల్లి బతికి ఉన్నంత కాలం తను ఆమె కుమారుడనేనని అనుకున్నాడట. ఆమె మరణించిన తర్వాత, తనకు ఒక బలమైన విశ్వాసం కలిగిందట. అదేమంటే ఆ భగవంతుడే తనను నేరుగా ఈ భూమి మీదికి అంటే ఈ దేశానికి పంపించాడనీ, తనతో ఏవేవో సత్కార్యాలు చేయిస్తున్నాడనీ అనిపిస్తోందట! కనిపెంచిన తల్లి విలువను తగ్గించి, కనపడని దేవుని మహిమకు ప్రాధాన్యమిచ్చే వాడికి అసలు మనిషికి ఉండే విలువ ఉంటుందా? సీరియస్‌గా ఆలోచించవల్సిన విషయం! ఏమైనా ఇలాంటి మాటలతో ఈయన మోడీ బాబా అయిపొయ్యాడు. ఇలాంటి వెర్రి మాటలు చెప్పే దొంగ బాబాలకు దేశంలో కొదువలేదు. వాళ్ళలో కొందరు కటకటాల పాలయ్యారు కూడా? ఈయన ఆ దారిలోనే నడుస్తున్నాడేమోననే అనుమానం ఈ దేశ ప్రజలకు కలుగుతోంది? వారిపై వారికి అంత విశ్వాసం ఉంటుం దంటే, అది కేవలం వారి మూఢత్వం వల్లనే”నని అన్నాడు జర్మన్ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా.

దేవరాజు మహరాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News