Thursday, September 19, 2024

ఆరు పతకాలతో ఆటకట్టు

- Advertisement -
- Advertisement -

పారిస్ వేదికగా రెండు వారాలకు పైగా ఉత్కంఠభరితంగా సాగిన విశ్వక్రీడా సంరంభం ముగిసింది. గత టోక్యో ఒలింపిక్స్‌తో పోలిస్తే, ఈసారి భారత క్రీడాకారుల ప్రతిభ కాస్త మసకబారిందనే చెప్పాలి. పతకాల పట్టికలో నిరుడు 48వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి ఒక రజతం, ఐదు కాంస్యాలతో 71వ స్థానానికి దిగజారింది. ఎప్పటిలాగానే ఈసారి కూడా అమెరికా, చైనా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుని తొలి రెండు స్థానాలనూ కైవసం చేసుకోగా, భారత్‌తో పోలిస్తే సుమారు పన్నెండో వంతు జనాభా కలిగిన జపాన్ మూడో స్థానాన్ని నిలబెట్టుకోవడం గమనార్హం.

ఈసారి అనేక క్రీడాంశాల్లో మన ఆటగాళ్లు తృటిలో పతకాలు కోల్పోవడం క్రీడాభిమానుల్ని తీవ్రంగా నిరాశపరచింది. మనుభాకర్ (25 మీటర్ల పిస్టల్ విభాగం), అర్జున్ బబుత (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), అనంతజీత్ సింగ్, మహేశ్వరీ చౌహాన్ (షూటింగ్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్), అంకిత భాకత్, బి. ధీరజ్ (ఆర్చెరీ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్), లక్ష్యసేన్ (బ్యాడ్మింటన్ సింగిల్స్)వెంట్రుకవాసి తేడాతో పతకాలు కోల్పోకపోయి ఉంటే, కథ మరోలాఉండేది. కానీ, ఉత్కంఠభరితంగా సాగే కొన్ని క్రీడలలో చివరి నిమిషం వరకూ విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేం. ఈసారి ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడటం అటు క్రీడాకారులను, ఇటు క్రీడాభిమానులు దిగ్భ్రాంతి గొలిపింది. ఫైనల్‌కు చేరుకుని పతకం ఖాయం చేసుకున్న ఫొగాట్.. కేవలం వంద గ్రాముల బరువు ఎక్కువ ఉందనే కారణంగా అనర్హతకు గురికావడం ఆటలపట్ల మక్కువ గల కోట్లాది మందిని కలతకు గురిచేసింది.

టోక్యో ఒలింపిక్స్‌లో ప్రతిభ కనబరిచిన పలువురు భారత క్రీడాకారులు ఈసారి ఆశించిన స్థాయిలో రాణించలేదు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో ప్రతిభ చాటి పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఈసారి క్వార్టర్ ఫైనల్సయినా చేరుకోలేకపోగా, గత ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి సత్తా చాటిన జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకోవడం భారత్ ఆశలపై నీళ్లు చల్లింది. అయితే గత ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన హర్మన్ ప్రీత్ నేతృత్వంలోని హాకీ సేన ఈసారి కూడా కాంస్యాన్ని నిలబెట్టుకోవడం, నిరుడు తుపాకీ పనిచేయక ప్రతిభ చాటలేకపోయిన మనుభాకర్ షూటింగ్ లో రెండు పతకాలు చేజిక్కించుకోవడం అభినందనీయం. ఒలింపిక్ క్రీడల్లో భారత ప్రాతినిథ్యం మొదలయ్యాక, గత 124 ఏళ్లలో మనం సాధించింది కేవలం 41 పతకాలు మాత్రమేనంటే ఆశ్చర్యం కలుగుతుంది.

ఇందులో 10 స్వర్ణాలు, 10 రజతాలు కాగా, మిగిలినవి కాంస్యాలు. దీనిని బట్టి చూస్తే, అంతర్జాతీయ క్రీడాంగణంలో మన ప్రతిభాపాటవాలు ఇప్పటికీ తీసికట్టేనని చెప్పకతప్పదు. కొత్త సహస్రాబ్దిలో బ్యాడ్మింటన్, బాక్సింగ్, హాకీ, రెజ్లింగ్, షూటింగ్ వంటి కొద్దిపాటి క్రీడల్లో మన ఆటగాళ్లు రాణిస్తున్నా, అనేక క్రీడాంశాలలో పతకాల ఖాతా ఇప్పటికీ తెరవనేలేదు. మునుపు ఎన్నడూ లేని విధంగా ఈసారి ఒలింపిక్స్‌లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్, మిషన్ ఒలింపిక్ సెల్ వంటి పథకాలను చేపట్టి కోట్లాది రూపాయలు వెచ్చించడం అభినందనీయమే అయినా, ఇప్పటికీ క్రీడలను రాజకీయాల నుంచి వేరు చేసి చూసేందుకు మాత్రం వెనుకాడుతోంది. ఒలింపిక్ క్రీడలకు ఆరు నెలల ముందు అప్పటి రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బిజెపి నేత బ్రిజ్ భూషణ్ పై వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా, సాక్షిమాలిక్ సాగించిన పోరాటం గురించి తెలియనివారు లేరు.

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ రెజ్లర్లు న్యాయ పోరాటానికి దిగినా ప్రభుత్వం ఒక పట్టాన దిగిరాలేదు. చివరకు బ్రిజ్ భూషణ్ ని తప్పించినా, ఆ పదవిని ఆయన అనుచరుడికే దక్కేలా చేయడంతో కన్నీటి పర్యంతమైన రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ ఏకంగా తన క్రీడా జీవితానికే స్వస్తి పలికింది. క్రీడలకూ, రాజకీయాలకు ఉన్న ఈ అవినాభావ సంబంధానికి తెర దించనంత వరకూ క్రీడాకారుల ప్రతిభ అడవిగాచిన వెన్నెలే అవుతుంది. పారిస్ ఒలింపిక్స్‌లో మన తీరు.. క్రీడాప్రాధికార సంస్థలకు, క్రీడా మంత్రిత్వ శాఖలకు, క్రీడా సమాఖ్యలకు, పాలకులకూ కనువిప్పు కావాలి. 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమివ్వాలని ఉవ్విళ్లూరుతున్న ఇండియా ఇలాంటి సమస్యలకు పరిష్కారం వెదికి, ముందుగా తన ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News