Tuesday, April 16, 2024

గులాబీ గూటికే

- Advertisement -
- Advertisement -

PACS

 

800 ప్యాక్స్‌ల చైర్మన్ పదవులు టిఆర్‌ఎస్ మద్దతుదారులకే

80 సంఘాలలో ఎన్నిక వాయిదా

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 800ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మెన్ పదవులు టిఆర్‌ఎస్ మద్ధతుదారులకే దక్కాయి. జిల్లాల్లోని పలు ప్యాక్స్‌లలో కోరం లేకపోవడంతో పాటు గొడవలు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో 80 ప్యాక్స్‌లలో ఛైర్మెన్ ఎన్నికలు నిర్వహించ లేదు. వాయిదా పడిన ప్యాక్స్‌లకు సోమవారం ఛైర్మెన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 904 ప్యాక్స్‌లలో ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 11,653 మంది డైరెక్టర్లు ఎన్నికయ్యారు. వీటికి ఆదివారం ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్‌ల ఎన్నిక నిర్వహించారు. ఇందులో 800ల ప్యాక్స్‌లు టిఆర్‌ఎస్ పార్టీ మద్ధతుదారుల ఖాతాలో పడ్డాయి. మరికొన్ని ఛైర్మెన్ పదువులను కాంగ్రెస్, స్వతంత్రులు కైవసం చేసుకున్నారు.

ప్యాక్స్ ఛైర్మెన్ ఎన్నికల్లో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఛైర్మెన్ పదవి కోసం పోటీ అధికంగా ఉన్నచోట్ల గొడవలు జరిగాయి. ఎన్నికలు జరిగినవి కాకుండా పూర్తిగా ఏకగ్రీవమైన 157 ప్యాక్స్‌లలో ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ పదవులు కూడా దాదాపు ఏకగ్రీవమయ్యాయి. వీటన్నింటిని టిఆర్‌ఎస్ మద్ధతుదారులే దక్కించుకోవడం గమనార్హం. కొన్నిచోట్ల కాంగ్రెస్, బిజెపి మద్ధతుదారులు ఒకరిద్దరు ప్యాక్స్‌లో డైరెక్టర్లుగా ఎన్నికైన చోట ఇబ్బందులు తలెత్తినట్లు తెలిసింది. ఇక జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి) అధ్యక్షుల ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ జారీ కానుంది.

ఈ మేరకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు వెల్లడించాయి. డిసిసిబి అధ్యక్షుల ఎన్నిక ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే జరగనుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (ప్యాక్స్) ఎన్నికైన ఛైర్మెన్లు డిసిసిబి అధ్యక్షులను ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం డిసిసిబి, డిసిఎంస్‌లకు ఒక్కో వ్యవస్థకు 20 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియను ఈ నెల 24వ తేదీ కల్లా పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు తెలిపాయి.

Notification for DCCBs today!
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News