Wednesday, May 1, 2024

రారాజు జకోవిచ్

- Advertisement -
- Advertisement -

 

మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సెర్బియా యోధుడు, రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో ఐదో సీడ్ డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా)ను ఓడించి జకోవిచ్ తన కెరీర్‌లో ఎనిమిదో ఆస్ట్రేలియా ఓపె న్ టైటిల్‌ను సాధించాడు. ఓవరాల్‌గా జకోవిచ్ కెరీర్‌లో ఇది 17వ సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. జకోవిచ్ కంటే నాదల్ (19), ఫెదరర్ (20) మాత్రమే ముందంజలో ఉన్నారు. థిమ్‌తో జరిగిన తుది సమరంలో జకోవిచ్‌కు గట్టి పోటీ తప్పలేదు. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో జకోవిచ్ చెమటోడ్చి నెగ్గాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన సమరంలో జకోవిచ్ 64, 46, 26, 63, 64తో థిమ్ ను ఓడించాడు. తొలి సెట్ నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు జకోవిచ్, అటు థిమ్ ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. అయితే కీలక సమయంలో జకోవిచ్ పట్టును సాధించాడు. థిమ్ జోరుకు బ్రేక్ వేస్తూ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఇదే క్రమంలో సెట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. తర్వాతి సెట్‌లో కూడా హోరాహోరీ పోరు తప్పలేదు. ఈసారి థిమ్ దూకుడును ప్రదర్శించాడు. జకోవిచ్‌ను ముప్పుతిప్పలు పెడుతూ లక్షం దిశగా సాగాడు. చూడచక్కని షాట్లతో అలరించిన థిమ్ సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక, మూడో సెట్‌లో మాత్రం థిమ్‌కు ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన థిమ్ ఏమాత్రం కష్టపడకుండానే సెట్‌ను గెలుచుకున్నాడు. ఈ పరిస్థితు ల్లో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. కానీ, కీలకమైన నాలుగో సెట్‌లో జకోవిచ్ మళ్లీ పుంజుకున్నాడు. థిమ్‌ను హడలెత్తిస్తూ ముందుకు సాగాడు. చూడచక్కని షాట్లతో అలరించిన జకోవిచ్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఇదే సమయంలో అలవోకగా సెట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక, ఫలితాన్ని తేల్చే ఐదో సెట్‌లో మళ్లీ ఆసక్తికర పోరు తప్పలేదు. ఇటు థిమ్, అటు జకోవిచ్ ప్రతిపాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. దీంతో ఆధిపత్యం తరచూ చేతులు మారుతూ వచ్చింది. కానీ, చివరి వరకు నిలకడైన ఆటను కనబరిచిన జకోవిచ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని విజేతగా నిలిచాడు. ఇదే సమయంలో 8 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
రామ్ జోడీకి టైటిల్

పురుషుల డబుల్స్ టైటిల్‌ను 11వ సీడ్ రాజీవ్ రామ్ (అమెరికా) జోయ్ సాలిస్‌బరి (బ్రిటన్) జంట కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో రామ్ జంట 64, 62తో ఆస్ట్రేలియాకు చెందిన లుక్ సావెల్లెఇవాన్ డాడిగ్ జోడీని ఓడించింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన రామ్ జోడీ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చివరి వరకు ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ వరుసగా రెండు సెట్లను గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలి సెట్‌లో రామ్ జోడీకి కాస్త పోటీ ఇచ్చిన ఆస్ట్రేలియా జంట తర్వాతి సెట్‌లో మాత్రం చేతులెత్తేసింది. కనీస పోటీ ఇవ్వకుండానే ఓటమి చవిచూసింది.

Novak Djokovic win australian open 2020 Title

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News