Friday, April 26, 2024

కొత్త చరిత్ర లిఖించిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

రాణించిన బౌలర్లు, రోహిత్, రాహుల్ మెరుపులు, సిఫర్ట్ శ్రమ వృథా

 ఐదో టి20లోనూ కివీస్ చిత్తు
మౌంగ్ మాంగనుయ్: న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన ఐదో, చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 50తో క్లీన్‌స్వీప్ చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. టి20 చరిత్రలోనే తొలిసారి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి లేకుండానే బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌కు సారథ్యం వహించిన రోహిత్ శర్మ అర్ధాంతరంగా తప్పుకున్నాడు. దీంతో లోకేశ్ రాహుల్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక, కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే జట్టును గెలిపించి అరుదైన ఘనతను సాధించాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లు కీలక సమయంలో అద్భుత బౌలింగ్‌తో కివీస్ నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. స్పీడ్‌స్టర్ జస్‌ప్రిత్ బుమ్రా అసాధారణ బౌలింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుత బౌలింగ్‌ను కనబరిచిన బుమ్రా 4 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రాకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక, నిలకడగా రాణించిన లోకేశ్ రాహుల్ మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక, న్యూజిలాండ్‌భారత్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ నెల ఐదున ఇరు జట్ల మధ్య మొదటి వన్డే జరుగుతుంది.
ఆరంభంలోనే
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్‌ను బుమ్రా వెనక్కి పంపాడు. గుప్టిల్ రెండు పరుగులు మాత్రమే చేసి వికెట్ల ముందు దొరికి పోయాడు. కొద్ది సేపటికే మరో ఓపెనర్ కొలిన్ మన్రో కూడా ఔటయ్యాడు. ధాటిగా ఆడిన మన్రో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో ఆరు బంతుల్లోనే 15 పరుగులు చేశాడు. అయితే ప్రమాదకరంగా కనిపించిన మన్రోను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన టామ్ బ్రౌస్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. శాంసన్ విసిరిన అద్భుత త్రోకు బ్రౌస్ రనౌటయ్యాడు. దీంతో కివీస్ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది.
ఆదుకున్న రాస్, సిఫర్ట్
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను సీనియర్ రాస్ టైలర్, వికెట్ కీపర్ టిమ్ సిఫర్ట్ తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఆరంభంలో భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కిందటి మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన సిఫర్ట్ ఈసారి కూడా దూకుడును ప్రదర్శించాడు. అద్భుత షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లు కొడుతూ స్కోరును పరిగెత్తించాడు. రాస్ మాత్రం సమన్వయంతో ఆడుతూ అతనికి అండగా నిలిచాడు. ఇదే క్రమంలో చెత్త బంతులను ఫోర్లు, సిక్స్‌లుగా మలుస్తూ అలరించాడు. ఇద్దరు కుదురు కోవడంతో కివీస్ విజయం నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సిఫర్ట్ 30 బంతుల్లోనే మూడు సిక్సర్లు, మరో ఐదు ఫోర్లతో 50 పరుగులు చేశాడు. అయితే దూకుడుగా ఆడుతున్న సిఫర్ట్‌ను సైని వెనక్కి పంపాడు. దీంతో 99 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇదిలావుండగా వీరిద్దరూ మధ్యలో శివమ్ దూబే వేసిన ఒక ఓవర్‌లో ఏకంగా 34 పరుగులు పిండుకున్నారు.
చేజేతులా..
సిఫర్ట్ ఔట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు కివీస్ విజయం ఖాయమనే అందరూ భావించారు. ఎప్పుడైతే సిఫర్ట్ వెనుదిరిగాడో భారత బౌలర్లు ఒక్కసారిగా పుంజుకున్నారు. వరుస క్రమంలో వికెట్లు తీస్తూ కివీస్ ఇన్నింగ్స్‌ను శాసించారు. బుమ్రా, శార్దూల్, సైనిలు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కివీస్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించారు. డారీ మిఛెల్ (2)ను బుమ్రా అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. కొద్ది సేపటికే మిఛెల్ సాంట్నర్ (6), స్కాట్ కుగ్లెజిన్ (0)లను శార్దూల్ వెంటవెంటనే పెవిలియన్ పంపాడు. మరోవైపు కుదురుగా ఆడుతున్న రాస్ టైలర్ రెండు సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 53 పరుగులు చేసి సైని బౌలింగ్‌లో ఔటయ్యాడు. టిమ్ సౌథి (6)ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు. చివర్లో ఐష్ సోధి రెండు సిక్సర్లతో అజేయంగా 16 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు, సైని, శార్దూల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
రాహుల్, రోహిత్ జోరు

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను లోకేశ్ రాహుల్, రోహిత్ శర్మలు ఆదుకున్నారు. ఓపెనర్‌గా దిగిన సంజూ శాంసన్ మరోసారి నిరాశ పరిచాడు. ఈసారి కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే తర్వాత వచ్చిన రోహిత్‌తో కలిసి మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు కుదురుగా ఆడుతూ ముందుకు సాగారు. ధాటిగా ఆడిన రాహుల్ రెండు సిక్సర్లు, 4 ఫోర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ మూడు సిక్స్‌లు, మరో 3 ఫోర్లతో 60 పరుగులు చేసి రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యర్ రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు మనీష్ పాండే 11 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించడంతో భారత్ స్కోరు 163 పరుగులకు చేరింది.

Team India Clean Sweep T20 Series against New Zealand

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News