Tuesday, May 7, 2024

సుప్రీంకోర్టు తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు

- Advertisement -
- Advertisement -

ఇవిఎంలపై ఏడుపు ఆపి దేశానికి క్షమాపణ చెప్పండి
ప్రతిపక్షాలకు ప్రధాని మోడీ డిమాండ్

పాట్నా: ఇవిఎంల ద్వారా వేసే ఓటును ఓటర్ వెరిఫైయబుల్ ఆడిట్ ట్రెయిల్(వివిప్యాట్)తో క్రాస్ చెక్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడం ప్రతిపక్షాలకు చెంపపెట్టని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇందుకు గాను ప్రతిపక్షాలు దేశానికి క్షమాపణ చెప్పాలని కూడా ప్రధాని డిమాండ్ చేశారు. బీహార్‌లోని అరారియాలో శుక్రవారం ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగిస్తూ మన ప్రజాస్వామ్యానికి నేడు ఒక సుదినమని అన్నారు. ఇవిఎంల మీద ఏడ్చే ప్రతిపక్షాల మొహంపైన సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొట్టిందని ఆయన చెప్పారు.

మన ప్రజాస్వామ్యాన్ని, మన ఎన్నికల ప్రక్రియను ప్రపంచమంతా శ్లాఘిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం తమ రాజకీయ ప్రయోజనాల కోసం అప్రతిష్ట పాల్జేస్తున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మరోసారి ధ్వజమెత్తుతూ ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఓబిసిల హక్కులను లాక్కునేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని మోడీ ఆరోపించారు. తాను ఈ విషయాన్ని ఎంతో బాధ్యతతో చెబుతున్నానని ఆయన అన్నారు. భారత్‌లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదని బాబా సాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పారని, కాని కాంగ్రెస్ మాత్రం మతపరమైన రిజర్వేషన్లు అమలు చేయడానికి కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

కర్నాటక తరహా రిజర్వేషన్ల విధానాన్ని దేశమంతటా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఓబిసి వర్గానికి ద్రోహం చేస్తూ ఆర్థికపరమైన స్థితిగతులకు అతీతంగా కర్నాటకలోని ముస్లింలందరినీ ఓబిసి జాబితాలో చేర్చిందని ఆయన ఆరోపించారు. బీహార్‌లోని ఆర్‌జెడి-కాంగ్రెస్ కూటమిపై మండిపడుతూ వారికి భౠరతదేశ రాజ్యాంగమంటే ఏమాత్రం లెక్కలేదని ఆరోపించారు. దశాబ్దాలుగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ఇప్పుడు పేదలు, నిజాయితీపరులైన ఓటర్లకు ఇవిఎం బలం లభించడంతో ఇవిఎంల వదిలించుకోవడానికి ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News