Wednesday, April 24, 2024

తెలంగాణ ఒలింపిక్స్ సంఘం ఎన్నికల్లో కుట్రలు

- Advertisement -
- Advertisement -

చంద్రకుమార్ నియామకం చెల్లదు, అక్రమాలపై విచారణ జరపాలి
హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ రావు డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఒలింపిక్స్ సంఘానికి జరుగుతున్న ఎన్నికల్లో కొందరూ కుట్ర రాజకీయాలకు తెరలేపారని రాష్ట్ర హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్‌రావు ఆరోపించారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్మోహన్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాగైన నెగ్గాలనే లక్షంతో కొందరూ అక్రమాలకు పాల్పడుతున్నారని, ఇందులో భాగంగానే తమ ప్యానల్ తరఫున అధ్యక్ష పదవి కోసం జయేశ్ రంజన్ వేసిన నామినేషన్‌ను తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ఒలింపిక్స్ సంఘం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఎలాగైన ఎన్నికల్లో పదవులు దక్కించు కోవాలనే లక్షంతో కొందరూ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికలకు చంద్రకుమార్‌ను రిటర్నింగ్ అధికారి(ఆర్వో)గా ఎలా నియమిస్తారని జగన్మోహన్ రావు ప్రశ్నించారు. భారత ఒలింపిక్స్ సంఘం ఈ ఎన్నికల కోసం జస్టిస్ భానును రిటర్నింగ్ అధికారిగా నియమించిందని, అయితే ఆయనకు బదులు ప్రస్తుత ఒలింపిక్స్ సంఘం ప్రతినిధి జగదీశ్ యాదవ్ చంద్రకుమార్‌ను ఆర్వోగా నియమించడం తగదని స్పష్టం చేశారు. చంద్రకుమార్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ జయేశ్ రంజన్ నామినేషన్‌ను తిరస్కరించారని ఆరోపించారు. ఈ విషయంపై తాను న్యాయ పోరాటానికి వెళుతామని జగన్మోహన్ రావు తెలిపారు. కిందటి ఏడాది నవంబర్ 19న తెలంగాణ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జస్టిస్ భానును నియమిస్తూ భారత ఒలింపిక్స్ సంఘం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ అభ్యర్తి నామినేషన్‌ను అకారణంగా తొలగించడం బాధాకరమన్నాడు. తమకు అన్యాయం జరిగినందును తెలంగాణ ఒలింపిక్స్ సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగాక తెలంగాణ స్పోర్ట్ కోడ్ అమలులో ఉన్నందున ప్రస్తుతం అధ్యక్ష పదవికి రంగారావు వేసిన నామినేషన్ చెల్లదని జగన్మోహన్ రావు వివరించారు. ఈ నిబంధనల ప్రకారం 70 ఏళ్ల పైబడిన వారు ఒలింపిక్స్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని ఆయన స్పష్టం చేశారు. ఇక, ఈ ఎన్నికల్లో జగదీష్ వర్గం పలు అక్రమాలకు పాల్పడుతోందని, ఎలాగైన గెలవాలనే లక్షంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఒలింపిక్స్ సంఘం ఎన్నికల ప్రక్రియాలో నెలకొన్న అక్రమాల నేపథ్యంలో వీటిని వెంటనే వాయిదా వేయాలని కోరారు. అంతేగాక అక్రమాలకు పాల్పడిన వారిపై న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ అభ్యర్థనను మన్నించక పోతే మొత్తం ఎన్నికలనే బహిష్కరిస్తామని జగన్మోహన్ రావు స్పష్టం చేశారు. ఇక, ఈ ఎన్నికలను హైదరాబాద్‌లో కాకుండా ఢిల్లీలో నిర్వహించడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. ఎన్నికలను హైదరాబాద్‌లోనే నిర్వహించాలని కోరారు. ఢిల్లీలో ఎన్నికలు నిర్వహిస్తే అక్రమాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. కొందరూ ఢిల్లీ పెద్దల అండదండలతోనే రిటర్నింగ్ అధికారికా చంద్రకుమార్ తెరపైకి వచ్చారన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలను నిర్వహిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో భారత ఒలింపిక్స్ సంఘం అధికారులు జోక్యం చేసుకోవాలని సూచించారు. అంతేగాక ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్.ఆర్.ప్రేమ్ రాజ్, సోమేశ్వర్ రావు, పాణిరావు, ప్రకాశ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana olympic association Elections 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News