శక్తివంతమైన ఫతా క్షిపణి ప్రయోగం
అధునాతన సాంకేతికత ..టార్గెట్ 120 కిమీ
సైనిక ప్రముఖులు, సైంటిస్టుల వీక్షణం
ఇస్లామాబాద్ : భారత్‌తో కయ్యానికి పాకిస్థాన్ పెద్ద ఎత్తున కాలు దువ్వుతోంది. సోమవారం పాకిస్థాన్ తమ అత్యంత కీలకమైన ఫతా శ్రేణి క్షిపణిని ప్రయోగాత్మకంగా విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ అధికారిక సమాచార సంస్థ ఐఎస్‌పిఆర్ ఓ ప్రకటనలో తెలిపింది. పహల్గాం ఉగ్రదాడుల తరువాతి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇక ఏ క్షణంలో అయినా యుద్ధం అనే రీతిలో పరస్పర కవ్వింపు చర్యలతో వాతావరణం వేడెక్కింది. ఇందులో భాగంగానే ఫతా క్షిపణి పరీక్ష జరిగింది. ఇండస్ పేరిట పాకిస్థాన్ ఇప్పుడు భారీ స్థాయిలో తమ సైనిక విన్యాసాలను బలోపేతం చేసుకొంటోంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకువెళ్లే ఈ క్షిపణి తమ ముందు 120 కిలో మీటర్ల దూరంలోని శత్రు లక్షాన్ని ఛేదించగలదు. దీనికి ఇతరత్రా కూడా అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
అధునాతన రీతిలో ఇది శక్తిని సంతరించుకుని ఉంది. దాడుల విషయంలో తాము భారత్‌కు అణువంత కూడా తీసిపోమని చాటుకునేందుకే పాకిస్థాన్ ఇప్పుడు క్షిపణి ప్రయోగానికి సిద్ధపడిందని విశ్లేషిస్తున్నారు. ఇనుమడించిన ఖచ్చితత్వం, మిస్సైల్ సంబంధిత నావిగేషన్ సిస్టం బలోపేతానికి ఇప్పటిపరీక్ష కీలకం అవుతుంది. ప్రధానమైన సాంకేతికత పాటవాన్ని చాటుకునేలా ఈ క్షిపణి రూపొందింది. సోమవారం ఓ రహస్య ప్రాంతంలో జరిగిన క్షిపణి పరీక్ష ఘట్టాన్ని పాకిస్థాన్‌కు చెందిన పలువురు సైనికాధికారులు, సైంటిస్టులు , ఇంజనీర్లు తిలకించారు. కాగా పరీక్ష విజయవంతం అయినందుకు సంబంధిత అధికారులను పాకిస్థాన్ సైనిక దళాల సంయుక్త అధినేత , ఆర్మీచీఫ్ అభినందనలు తెలిపారు. దేశ ప్రాదేశిక సమగ్రతకు భంగం కల్గించే ఎటువంటి అవాంఛనీయ దాడిని అయినా తిప్పికొట్ట గల , ఇదే సమయంలో ఎదురుదాడులకు సిద్ధపడ గల పాటవం సర్వం సంతరించుకుని ఉన్నామని ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఇతర వర్గాలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాయి.