ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయండి
సుప్రీంకోర్టులో ప్రభుత్వం వాదనలు
విచారణ పేరుతో హింసిస్తున్నారు
ప్రభాకర్ రావు తరపు న్యాయవాది వాదనలు
విచారణ అక్టోబర్ 8కి వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నింధితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో తెలియదు, గుర్తులేదు అని చెబుతున్నారని ఆయన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సిట్ అధికారుల దాఖలు చేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను అక్టోబర్ 8వ తేదీ చేపడతామని జస్టిస్ బివి. నాగరత్నం వెల్లడించారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ వరకు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని చెపుతూ మధ్యంతర ఊరటను పొడిగించింది. అలాగే విచారణకు సహకరించాల్సిందేనని ప్రభాకర్ రావుకు స్పష్టం చేసింది. అదే సమయంలో విచారించి ఆయన నుంచి సమాచారం రాబట్టాలని సిట్‌కు కోర్టు సూచించింది.
సోమవారం జరిగిన విచారణలో ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సిథార్థ లూధ్రా వాదనలు వినిపించారు. సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులకు ప్రభాకర్ రావు సహకరించడంలేదని, విచారణలో గుర్తులేదు, తెలియదు అని సమాధాలు చెపుతున్నారని కోర్టుకు తెలిపారు. కంప్యూటర్, ట్యాప్ టాప్, ఫోన్లో డేటాను రీసెట్ చేశారని వివరించారు. ప్రభుత్వం మారినప్పుడు అధికారులు వారికి ఇచ్చిన అన్ని పరికరాలు యధావిధిగా తిరిగి ఇవ్వాలని నిబంధన ఉందని, ప్రభాకర్ రావు నిబంధనలకు విరుద్దంగా డేటా మొత్తం డిలీట్ చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్‌టాప్, కంప్యూటర్ల పాస్వర్డ్లు చెప్పేందుకు ఆయన సహకరించడం లేదన్నారు. విచారణకు సహకరించని ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరారు. కోర్టు నోటీసులు జారీ చేసిన తరువాత రాష్ట్రానికి రాకుండా వేరే చోట నుంచి అమెరికా పారిపోయారని తెలిపారు. ఆయన ఇంట్లో కంప్యూటర్ నుంచి ఆధారాలు తొలగించిన అంశపై దర్యాప్తు చేయాల్సి ఉందని కోర్టుకు వివరించారు.
అమెరికా తీసుకెళ్లి ల్యాప్ టాప్‌లో డేటా ధ్వసం చేశారని, ఫారెన్సిక్ పరిశీలనలో ఎప్పుడు డేటా ధ్వంసం చేశారో తేదీతో సహా ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ కేసు నమోదు చేయలేదని, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోందని కోర్టుకు వివరించారు. ఈ దశలో ప్రభాకర్ రావు తరపు న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు విచారణకు ఎప్పుడు పిలిచినా వెళ్లారని, ఇప్పటికి 15 సార్లు విచారించారని కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో ఆయన్ను వేధిస్తున్నారని, ప్రతి ఒక్కరిని పిలిచి ప్రభాకర్ రావుకు వ్యతిరేకంగా బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారని వివరించారు. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని న్యాయవాది శేషాద్రి నాయుడు కోరగా రెండు వారాల సమయమిస్తూ ధర్మాసనం విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.
Also Read: అల్పపీడన ప్రభావం.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు