Friday, April 19, 2024

సమాచారం అడగడమే నేరమా?

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీపై ఈగ వాలనివ్వరాదని, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా ఈనిపుల్ల కదిపినా వారిని శిక్షించాలని గుజరాత్ న్యాయస్థానాలు కూడబలుక్కున్నాయా? ఈ ప్రశ్న తలెత్తడానికి ఆస్కారం కలగడం అత్యంత బాధాకరం. భారత్ ఆది నుంచి ప్రజాస్వామ్య దేశమని ప్రధాని మోడీ ఇటీవలనే నొక్కి వక్కాణించారు. ఆ ప్రజాస్వామ్యం ఇదేనా ప్రశ్నించుకోవలసిన అవసరాన్ని గుజరాత్ కోర్టుల తీర్పులు ముందుకు తెస్తున్నాయి. మోడీ ఇంటి పేరు గలవారందరూ దొంగలేనా అని నాలుగేళ్ళ క్రితం కర్ణాటకలో ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రశ్నించినందుకు గుజరాత్‌కు చెందిన ఒక ఎంఎల్‌ఎ రాహుల్ గాంధీపై దావా వేయగా సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు ఇటీవలనే ఆయనకు రెండేళ్ళ శిక్ష విధించింది. ఆ తీర్పు తడి ఆరక ముందే గుజరాత్ హైకోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు శుక్రవారం నాడు రూ. 25 వేలు జరిమానా విధించింది.

సమాచార హక్కు చట్టం కింద ప్రధాని నరేంద్ర మోడీ ఎం.ఎ డిగ్రీ వివరాలివ్వాలని అరవింద్ కేజ్రీవాల్ అడిగిన మీదట ఆ సమాచారాన్ని అందించాలని 2016లో అప్పటి ప్రధాన సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్య ఇచ్చిన ఆదేశాలను గుజరాత్ హైకోర్టు కొట్టి వేసింది. అంతటితో ఆగకుండా కేజ్రీవాల్‌కు రూ. 25 వేలు జరిమానా విధించింది. ఈ సొమ్మును నాలుగు వారాల్లోగా చెల్లించాలని తాఖీదు జారీ చేసింది. ‘ప్రధాని మోడీ డిగ్రీని కోర్టులో చూపడానికి న్యాయమూర్తి ఆగ్రహంతో తిరస్కరించారు. తమ ప్రధాని ఎంత వరకు చదువుకున్నారో తెలుసుకొనే హక్కు ఈ దేశ ప్రజలకు లేదా’ అని కేజ్రీవాల్ ఆవేదనతో అడిగిన ప్రశ్నకు పైకోర్టులోనైనా తగిన సమాధానం లభిస్తుందో లేదో చూడాలి. కేజ్రీవాల్ అడిగిందంతా ప్రధాని ఏమి చదువుకున్నారనేదేగాని వేరేమీ కాదు. ప్రధాని కావడానికి ఆయనకు గల అర్హత, హక్కు ఏమిటని ఆయన అడగలేదు.

140 కోట్ల మంది దేశ ప్రజలందరికీ జవాబుదారీగా వుండవలసిన అత్యున్నత దేశాధికార పీఠం మీద వున్న వ్యక్తి యోగ్యతల గురించి తెలుసుకోవాలని ప్రజలకు వుండడాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. దానిని నేరంగా ఒక ఉన్నత న్యాయస్థానం భావించడాన్ని ఏ కోణంలో చూసినా అర్థం చేసుకోలేని పరిస్థితి. చట్ట ప్రకారం ఎంఎల్‌ఎ, ఎంపి, ముఖ్యమంత్రి, ప్రధాని, రాష్ట్రపతి వంటి పదవులు చేపట్టడానికి విద్యార్హతలు అవసరం లేదన్న మాట వాస్తవమే. అయితే ప్రధానిగా ఇంత సువిశాల దేశ భవిష్యత్తును నిర్ణయించే పీఠం మీద కూచోడమంటే అందుకు అనేక సమస్యల మీద సరైన అవగాహన కలిగి వుండడం అవసరం. అది చదువు ద్వారా సమగ్రంగా లభిస్తుంది. అందుచేత మమ్మల్ని పరిపాలిస్తున్న మా ప్రధాని ఏమి చదువుకున్నారు అనేది తెలుసుకోగలిగినప్పుడు ప్రజలకు ఆ ప్రధాని మీద విశ్వాసం కలుగుతుంది.

ప్రభుత్వానికి సంబంధించి ఏ సమాచారాన్నైనా అడిగి తెలుసుకొనే హక్కును ప్రజలకు కల్పిస్తున్న చట్టం ఒకటి వుంది కాబట్టి దాని ప్రకారం ప్రధాని మోడీకున్న ఎం.ఎ పోస్టుగ్రాడ్యుయేట్ పట్టం వివరాలు కేజ్రీవాల్ తెలుసుకోదలిచారు. అందుకు ఆయనకు జరిమానా విధించారంటే గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బీరేన్ వైష్ణవ్ తీర్పు ప్రకారం సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోడం కూడా నేరమని స్పష్టపడుతున్నది. అమల్లోగల చట్టాన్ని వినియోగించడంలో విధి నిషేధాలనేవాటిని ఒక వేళ నిర్దేశించి వుంటే ఆ ప్రకారం కేజ్రీవాల్ నడచుకోలేదని అనిపిస్తే ఆయనను తప్పుపట్టవచ్చు. అటువంటివేమీ లేనప్పుడు కేవలం తెలుసుకోవాలనే జిజ్ఞాసతో అడగడంలో ఎంత మాత్రం దోషం లేదు. గుజరాత్ హైకోర్టు ఈపాటి ఇంగిత జ్ఞానంతోనైనా వ్యవహరించలేకపోయిందా అనే ప్రశ్నకు సందు కలుగుతున్నది.

ఈ కేసులో వాదనలు పూర్తి అయిన ఫిబ్రవరి 9 నాడు గుజరాత్ యూనివర్శిటీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ సమాచార హక్కు చట్టం కింద ఏ ఒక్క విద్యార్థి డిగ్రీ వివరాలను అడగరాదని అలా అడగడం ఆ వ్యక్తి గోప్యతా హక్కుకు ఉల్లంఘన అని అన్నారు. అదే సందర్భంలో ప్రధాని డిగ్రీ వివరాలు ప్రజల ముందే వున్నాయని వాటిని గుజరాత్ యూనివర్శిటీ తన వెబ్‌సైట్‌లో వుంచిందని చెప్పారు. 2005 నాటి చట్టాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం దుర్వినియోగం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. పిల్లకాయల గిల్లికజ్జాల మాదిరి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని అన్నారు. కేజ్రీవాల్ తరపున వాదించిన సీనియర్ అడ్వొకేట్ దీనిని తప్పుపట్టారు.

ప్రధాని డిగ్రీలకు సంబంధించిన సమాచారం ప్రజలకు అందుబాటులో లేదని స్పష్టం చేశారు. ఏమైనప్పటికీ ప్రధాని మోడీని కాపాడాలనే మితిమించిన శ్రద్ధతోనో, ఆత్రుతతోనో గుజరాత్ నుంచి వస్తున్న తీర్పులు ఆయన రాజకీయ ప్రత్యర్థుల మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. మొన్న రాహుల్ గాంధీకి శిక్ష విధించి పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయే స్థితిని కల్పించడం ద్వారానూ ఇప్పుడు కేజ్రీవాల్‌కు జరిమానా వేయడం ద్వారానూ ప్రధాని వైపు కన్నెత్తి చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నాయి. ఇది దేశ ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచి చేయదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News