Tuesday, April 30, 2024

ఉడకని అన్నం.. నీళ్ళ చారు తినేదెలా సార్

- Advertisement -
- Advertisement -

పెద్దేముల్: ఉడకని అన్నం.. నీళ్ళ చారును తినలేమని విద్యార్థులు వాపోతున్నారు. పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులు కలుషిత అహారాన్ని తిని కొంతమంది వాంతు లు, విరేచనాలు చేసుకున్నారు. ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా.. మంబాపూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 441 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి భోజనాన్ని వండి పెట్టేందుకు 6 మంది భోజన కార్మికులు పని చేస్తున్నారు. అయితే మంగళవారం బియ్యాన్ని చెరగకపోవడం, పరిశుభ్రంగా కడగపోవడం, తెల్లపురుగులు రావడంతో 14 మంది విద్యార్థులకు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. వాస్తవానికి మధ్యాహ్న భోజన కార్మికులు ఎప్పటికి బియ్యాన్ని చెరిగి, శుభ్రంగా కడిగి వండేవారు.

అయితే కొన్నిరోజుల నుంచి నామమాత్రంగా బియ్యాన్ని చెరిగి, వండిపెట్టడం వల్లనే వాంతులు చేసుకున్నట్లు విద్యార్థులు తెలిపారు.ముఖ్యంగా భోజనం ఎలా వండుతున్నారు..? బియ్యాన్ని శుభ్రం చేస్తున్నారా..? లేదా? అనే విషయాలపై హెచ్‌ఎం రాములు దృష్టి సారించలేదని తెలుస్తున్నది. తద్వారానే ఇలా జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భోజన విషయంలో హెచ్‌ఎం రాములు పూర్తిగా విఫలమయ్యారనే అరోపణలు సైతం వినిపిస్తున్నాయి. భోజనం సక్రమంగా పెట్టించక పోవడం వల్లన హెచ్‌ఎం రాములును విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. విద్యార్థులు వాంతులు చేసుకున్న విషయం తెలుసుకొని ఎంపీడీఓ లక్ష్మప్ప, సర్పంచ్ శ్రావణ్‌కుమార్, ఎంపిఒ షేక్ సుష్మలు పాఠశాలను సందర్శించారు. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా అధికారులను చుట్టుముట్టి తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రతిరోజు అన్నం సరిగ్గా ఉండటం లేదని, ఒకరోజు మెత్తగా.. మరోరోజు పిప్పి అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉడకని అన్నం, నీళ్ళచారును తినలేకపోతున్నామని, వారానికి ఒకసారి మాత్రమే గుడ్డు పెడుతున్నారని, తమ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయంపై ఎంపీడీఓ లక్ష్మప్ప మాట్లాడుతూ.. పాఠశాలలో మెను ప్రకారం భోజనం అందించాలని, భోజన విషయంలో ఎక్కడకూడా రాజీపడరాదన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎం రాములుకు అదేశించారు. కంపుకొడుతున్న లేడిస్ టాయిలెట్స్‌ను చూసి హెచ్‌ఎంపై అగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక దృష్టి సారించి పాఠశాల సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. వారి వెంట ఏపీఓ లక్ష్మీదేవి, ఎస్‌ఎంసీ చైర్మన్ శ్రీనివాస్, ఇంచార్జి పంచాయితీ కార్యదర్శి సంజీవ్ కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News