Thursday, May 2, 2024

రెజ్లర్లతో అర్థరాత్రి పోలీసు బలగాల కుస్తీ

- Advertisement -
- Advertisement -

రెజ్లర్లతో అర్థరాత్రి పోలీసు బలగాల కుస్తీ
పలువురు క్రీడాకారులకు గాయాలు
నిరసన ఏర్పాట్ల విచ్ఛిత్తికి దౌర్జన్యం
అడ్డుకున్న వారిపై లాఠీలు దెబ్బలు
న్యూఢిల్లీ: నిరసన దీక్షలో ఉన్న రెజర్లపై ఢిల్లీ పోలీసులు బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత దాడికి దిగారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఈ ఘటనతో అక్కడి రెజర్లు, వారి అభిమానులు ఏకమై పోలీసులతో కలబడటం, ఈ దశలో పోలీసులకు వీరికి మధ్య తోపులాటలు, ఘర్షణలు చోటుచేసుకోవడం కలకలానికి దారితీసింది. ఘర్షణల దశలో ప్రముఖ కుస్తీ క్రీడాకారిణి అయిన వినేష్‌కు, బజ్‌రంగ్‌లకు గాయాలు అయ్యాయి. దుశ్యంత్ ఫోగాట్ నుదుటిపై గాయం అయింది.

అయితే శాంతి భద్రతల పరిరక్షణ దశలోనే తాము తగు విధంగా వ్యవహరించామని పోలీసు అధికారులు తెలిపారు. తాము తమ తోటి రెజర్ల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని నిరసించేందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నామని, రాత్రి వర్షం పడటంతో ఇక్కడికి మరికొన్ని బెంచ్‌లు, చాపలు తీసుకుని వచ్చేందుకు యత్నించామని, దీనిని పోలీసులు అడ్డుకున్నారని రెజర్ల సంఘాలు తెలిపాయి. ధర్నా జరిపే వారికి సౌకర్యాలు ఎందుకు అని అక్కడ ఉన్న పోలీసులలో ఓ తాగి ఉన్న పోలీసు దుర్భాషలాడారని వెల్లడైంది. ఈ క్రమంలో రెజర్లకు పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. పోలీసు బాగా తాగి మహిళా రెజర్ల పట్ల అసభ్యంగా వ్యవహరించాడని, వారిని బూతులు తిట్టాడని అక్కడివారు ఆరోపించారు.

పలువురు రెజర్లను నెట్టివేశారని విమర్శలు వెలువడ్డాయి. బజ్‌రంగ్ పునియా, రెజ్లర్ సాక్షి భర్త సత్యవర్త్ కదియన్ జోక్యం చేసుకోబోగా ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగిందని వెల్లడైంది. ఈ దశలో పోలీసులు లాఠీలు ప్రయోగించారు. దీనితో బజ్‌రంగ్ భుజానికి దెబ్బతగిలింది. వినీష్‌కు మోకాలి గాయం అయింది. నుదుటిపై గాయం అయిన దుష్యంత్ ఫోగాట్‌ను చికిత్సకు ఆర్‌ఎంఎల్ హాస్పిటల్‌కు తరలించారు. పలువురు రెజ్లర్లను అరెస్టు చేసి తీసుకువెళ్లడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అయితే వీరిని అడ్డుకుంటూ వినెష్ అడ్డంగా పడుకున్నారు. దీనితో ఓ మహిళా కానిస్టేబుల్ ఆమెను కొట్టినట్లు వెల్లడైంది. తనను ఢిల్లీ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ధర్మేందర్ కుమార్ సింగ్ తిట్టారని వినేష్ ఆరోపించారు. ఇటువంటి అత్యాచారాలు, ఈ విధమైన అవమానాలు భరించేందుకా తాము దేశం కోసం పతాకాలు సాధించింది అని పలువురు రెజర్లు నిరసన వ్యక్తం చేశారు. తమను చంపివేస్తే చంపివేయండి కానీ ఈ విధంగా వేధించుకు తినకండని రెజ్లర్లు ఆగ్రహించారు.అర్థరాత్రి తరువాత ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరాయి. 20 మంది రెజర్లు అక్కడ ఉండగా వీరిచుట్టూ రెండు వందల మంది వరకూ పోలీసులు నిలిచారు.

కుస్తీ ఫెడరేషన్ ఛైర్మన్ బర్తరఫ్ అవసరం: రాహుల్
న్యాయం చేయాల్సిన బాధ్యత మోడీదే
జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఘటన క్రీడాకారుల పట్ల ఘోర అవమానం అని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే కలుగచేసుకుని సంబంధిత విషయంపై రెజ్లింగ్ సంఘం అధ్యక్షులు బృజ్ భూషణ్‌ను బర్తరఫ్ చేయాలని పార్టీ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు, మహిళా రెజ్లర్లపట్ల దారుణ రీతిలో అవమానకర చర్యలకు దిగారని ఇప్పుడు వారిపై పోలీసులు దాడులు సాగించారని, ఇదేనా ప్రధాని మోడీ చెప్పే తరచూ వల్లించే బేటీ బచావ్ ఉద్ధేశం అని ప్రశ్నించారు. దేశంలోని కూతుళ్లకు రక్షణ లేదనే విషయం ఢిల్లీ సాక్షిగా జరిగిందన్నారు. తన ప్రకటనకు తోడుగా ఆయన ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద జరిగిన తోపులాట ఘటన ఫోటోలను జతపర్చారు. రెజ్లర్లు కుప్పకూలిపోవడం వంటి ఘటనలను తెలిపే వీడియోను ప్రియాంక గాంధీ తమ ట్వీటులో పొందుపర్చారు.

క్రీడాకారిణుల కన్నీళ్లు దేశానికి ఏం ఖ్యాతి తెచ్చిపెడుతాయని ప్రశ్నించారు. వారు దేశానికి ఖ్యాతికోసం శక్తి వంచన లేకుండా కృషి చేసి, అంకితభావంతో అవార్డులు తెచ్చిపెడితే, తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని శాంతియుతంగా కోరితే ఈ విధంగా వారిపై దమననీతికి దిగుతారా అని నిలదీశారు. ప్రధాని మోడీ ఇప్పటికైనా ఓసారి జంతర్‌మంతర్ వద్దకు వెళ్లి వీరి సాధకబాధకాలను తెలుసుకుంటే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అంతర్జాతీయ స్థాయి పతాకాలు సాధించిన పలువురు క్రీడాకారులు జంతర్‌మంతర్ వద్ద ధర్నాలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంపి, రెజ్లర్ల సంఘం అధ్యక్షులు అయిన బృజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు దిగారని పేర్కొంటూ దీనిపై ఆయన పట్ల కఠిన చర్యలు చేపట్టాలని నిరసనకు దిగారు. 13 రోజులుగా ఇక్కడ ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ దశలో బుధవారం రాత్రి పోలీసులు రెజ్లర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఓ వైపు బృజ్ భూషణ్ తరచూ ఈ ధర్నాపై స్పందిస్తూ మోడీజీ కాని అమిత్ షాజీ కానీ చెబితే తాను వెంటనే పదవికి రాజీనామా చేస్తానని చెపుతున్నాడని, మరి ఎందుకు ఈవిధంగా వారు ఆయన రాజీనామాకు ఆదేశించడం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే విస్మయం వ్యక్తం చేశారు. మోడీకి ఈ దేశ ఆడపడుచులు, క్రీడా కీర్తి పతాకాలు తెచ్చిన కూతుళ్ల పట్ల అభిమానం లేదనే అనుకోవల్సి ఉంటుందన్నారు. కర్నాటక ఎన్నికల సభల్లో ప్రధాని మోడీ మహిళా శక్తి గురించి పెద్దగా చెపుతున్నారని, మరి దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు మహిళల పట్ల జరిగిన అవమానం ఏ శక్తికి చెందుతుందని కాంగ్రెస్ నిలదీసింది.

Also Read: సుప్రీం కోర్టులో కనిమొళి కరుణానిధికి భారీ ఊరట

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News