Wednesday, May 29, 2024

రేపే మున్సిపోల్స్

- Advertisement -
- Advertisement -

Polling

 

మూగబోయిన మైకులు, ఓటర్లకు ప్రలోభాలు
తొలిసారి కొంపల్లిలో ఫేస్ రికగ్నైజేషన్

హైదరాబాద్: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్‌లలో ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎండ్‌కార్డ్ పడింది. వీటికి ఈ నెల 22న పోలింగ్ నిర్వహించనున్నారు. జనవరి 25వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు. ఆ ప్రాంతాలలో పోలింగ్ ముగిసే వరకు మద్యం షాపులు, బార్లు మూసివేయనున్నారు. ప్రసార, ప్రచార మాధ్యమాల్లో రాజకీయ పార్టీల ప్రచారాలను ఎన్నికల సంఘం నిషేధం విధించింది. బల్క్ మెసేజ్‌లను బ్యాన్ చేశారు. ఇక పత్రిక ప్రకటన ఇవ్వాలనుకుంటే సంబంధిత జిల్లా ఎన్నికల అథారిటీ నుంచి ముందస్తు ప్రి సర్టిఫికేషన్‌కు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటికి గుట్టు చప్పుడు కాకుండా ప్రలోభాలకు అభ్యర్థులు తెరతీశారు.

అత్యంత సన్నిహితుల చేత డబ్బు, మద్యం పంపిణీ చేయడంతో పాటు విలువైన వస్తువులు, బహుమతులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఎన్నికల అధికారుల దృష్టికి వెళ్లగా సీజ్ చేశారు. అయితే మంగళవారం మధ్యాహ్నాని కల్లా పూర్తిగా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు పోటాపోటీగా ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ నెల 14న నామినేషన్ల ఉపసంహరణ తరువాత పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ రోజు నుంచి సోమవారం సాయంత్రం వరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు హోరాహోరిగా ప్రచారం నిర్వహించారు. అన్ని ఎన్నికల్లో వరుస గెలుపుతో ఊపు మీదున్న అధికార టిఆర్‌ఎస్ మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటేందుకు స్వయంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రంగంలోకి దిగి అన్ని తానై చక్కదిద్దారు.

రెబల్స్ బెడద ఉండకూదని ప్రయత్నించినప్పటికీ కొన్నిచోట్ల తప్పలేదు. మంత్రులు, టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కూడా తమ పరిధిలోని మున్సిపాలిటీలను గెలుచుకునేందుకు శతవిధాలా ప్రచారం చేశారు. బిజెపి టిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని కొన్ని చోట్ల టఫ్ ఫైట్ ప్రచారాన్ని నిర్వహించింది. కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, ఎంపిలు ఆర్వింద్, బండి సంజయ్, సోయం బాపురావు విస్తృత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ తరపున కూడా ప్రచారం హోరెత్తింది. పిసిసి చీఫ్ ఉత్తమ్, ఎంపిలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయా మున్సిపాలిటీల్లో స్వయంగా ప్రచారం చేశారు. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 53,36,505 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 26,71,694 ఉండగా మహిళలు 26,64, 557మంది ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 6.40 లక్షల మంది, జనగామ జిల్లాలో అతి తక్కువగా 39,729 మంది ఓటర్లు ఉన్నారు.

తొలిసారి ఫేస్ రికగ్నేజేషన్
భారతదేశంలోనే తొలిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయకుండా..ఫేస్ రికగ్నేజేషన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కొంపల్లి మున్సిపల్ పరిధిలోని 6 వార్డుల్లో, 10 పోలింగ్ కేంద్రాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. రికగ్నైజేషన్ యాప్ అమలుకు ప్రత్యేక పోలింగ్ అధికారిని నియమించారు.

* మున్సిపాల్టీలో 2 వేల 647 వార్డులకు ఎన్నికలు.
* మున్సిపాల్టీల బరిలో 11 వేల 153 మంది అభ్యర్థులు.
* 9 కార్పొరేషన్‌లోని 325 డివిజన్లలో ఎన్నికలు.
* కార్పొరేషన్ బరిలో 1745 మంది అభ్యర్థులు.
* 120 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్‌లలో మొత్తం 3052 వార్డులు.
* 80 వార్డులు ఏకగ్రీవం.
* 2 వేల 972 స్థానాలకు ఎన్నికలు.

* మున్సిపల్ ఎన్నికల బరిలో 12 వేల 898 మంది అభ్యర్థులు.
* 77 ఏకగ్రీవం చేసుకున్న టిఆర్‌ఎస్.
* మూడు వార్డుల్లో ఎంఐఎం ఏకగ్రీవం.
* టిఆర్‌ఎస్ నుంచి 2972 మంది అభ్యర్థులు.
* కాంగ్రెస్ నుంచి 2616, సిపిఐ నుంచి 177, సిపిఎం నుంచి 166, ఎంఐఎం నుంచి 276, బిజెపి నుంచి 2313, టిడిపి నుంచి 347, స్వతంత్ర అభ్యర్థులు 3750 మంది.

* బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు.
* తెలుపు రంగులో బ్యాలెట్.
* నా ఓటు యాప్ ద్వారా ఓటర్ స్లిప్ డౌన్ లోడ్‌కు వెసులుబాటు.
* 44 వేల ఎన్నికల సిబ్బంది.
* ఎన్నికల సిబ్బంది కోసం ఆన్ లైన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం.
* ఎన్నికల ప్రాంతాల్లో జనవరి 22న సెలవు.
* ప్రతి పోలింగ్ కేంద్రాల్లో సిసి కెమెరాల ఏర్పాటు. పోలింగ్ ప్రక్రియ వీడియో రికార్డు.
* పోలింగ్ సరళి తెలుసుకొనేందుకు వెబ్ కాస్టింగ్. 144 సెక్షన్ అమలు.

Polling tomorrow
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News