Thursday, August 7, 2025

కరీంనగర్‌లో బిఆర్‌ఎస్ బిసి గర్జన సభ 14కు వాయిదా

- Advertisement -
- Advertisement -

కరీంగనర్‌లో శుక్రవారం జరగాల్సిన బిఆర్‌ఎస్ బిసి గర్జన సభ వాయిదా పడింది. ఈ నెల 14వ తేదీన కరీంనగర్‌లో బిఆర్‌ఎస్ బిసి గర్జన సభ నిర్వహించనున్నట్లు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ చెప్పిందని,బిసిలకు లక్ష కోట్లు బడ్జెట్ పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. బిసి రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ఢిల్లీలో మూడు రోజులుగా డ్రామా చేస్తుందని విమర్శించారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాకు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,మల్లిఖార్జున ఖర్గే ఎందుకు రాలేదని ప్రశ్నించారు.ఢిల్లీలో ఇండియా కూటమి మొత్తం ధర్నాకు వస్తుందని చెప్పారని, కానీ రాహుల్ గాంధీ కూడా వెళ్లలేదని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో గురువారం బిఆర్‌ఎస్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్‌లతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, హడావుడిగా కులగణన చేశారని, తొందరపాటుతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని అన్నారు. ఏదో జరిగినట్లు సంబురాలు చేసుకున్నారని విమర్శించారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బిసిల సత్తా ప్రభుత్వానికి చూపుతామని హెచ్చరించారు. మధుసూదనాచారి మాట్లాడుతూ, కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లు కాంగ్రెస్ తీరు ఉందని విమర్శించారు. అసెంబ్లీలో, శాసనమండలిలో బిసి బిల్లు చర్చకు వచ్చినప్పుడు తాము నిరభ్యంతరంగా మద్దతు తెలిపామని పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వం బిసి రిజర్వేషన్లను ఏ విధంగా 9వ షెడ్యూల్‌లో చేర్చారో అలాగే తెలంగాణలో చేయాలని తాము చెప్పామని అన్నారు. ప్రభుత్వం తరపున ఢిల్లీకి వెళ్తున్నామని తలసాని శ్రీనివాస్ యాదవ్‌కుగానీ, తనకు గానీ చెప్పారా..? అని ప్రశ్నించారు. తమను ఢిల్లీకి తీసుకువెళ్తే వాళ్ళ మోసం బయటపడుతుందని అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళలేదని ఆరోపించారు.

మోదీని దించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని బిసి రిజర్వేషన్ల ధర్నాలో రేవంత్ రెడ్డి అన్నారని మండిపడ్డారు. మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తమిళనాడు సిఎంగా జయలలిత ప్రధానమంత్రిని,అన్ని పార్టీలను ఒప్పించి రిజర్వేషన్లు సాధించారని అన్నారు. ప్రభుత్వం గవర్నర్‌కు పంపిన ఆర్డినెన్స్‌లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. విద్య,ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఆర్డినెన్స్‌లో ఎందుకు పంపలేదని అడిగారు. బిసిలను కాంగ్రెస్ మోసం చేస్తోందని విమర్శించారు. మిగిలిన మూడు మంత్రి పదవులను బిసిలకు ఇవ్వాలని, రెవిన్యూ, హోంశాఖ బిసిలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News