Saturday, December 7, 2024

శ్రీలంకలో సిలిండర్ ధర రూ.2657

- Advertisement -
- Advertisement -

Price of Gas cylinder in Sri Lanka is Ts.2657

చుక్కలను తాకిన నిత్యావసరాల ధరలు

కొలంబో : ఆహార, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నిత్యావసరాల ధరలు అమాంతం భగ్గుమంటున్నాయి. నిత్యావసర, ఆహార పదార్దాలపై ధరల నియంత్రణను ప్రభుత్వం ఎత్తి వేయడమే దీనికి కారణం. దీంతో ప్రస్తుతం అక్కడ వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 90 శాతం పెరిగి, రూ.2657 కు చేరింది. ఇక కేజీ పాల ధర ఐదు రెట్లు పెరిగి రూ.1,195 గా ఉంది. గత ఏడాది కాలంగా శ్రీలంకను ఆహార ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిన నిర్ణయాలతో ఆ దేశ విదేశీ మారక ద్రవ్యం భారీగా పతనమైంది. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు దిగుమతులు దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి పర్యాకట రంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఉన్న కాసిన్న విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. అందుకే నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమపిండి, కూరగాయలు వంటి వస్తువులను కూడా శ్రీలంక దిగుమతుల పైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వ నిషేధంతో ఆ వస్తువుల డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది.

ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ఈ పరిస్థితిని అదుపు లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలను తీసుకొచ్చింది. అయితే ధరలపై నియంత్రణ తీసుకురావడంతో అక్రమ నిల్వలు పెరిగి, మార్కెట్లో సరఫరా తగ్గింది. దీంతో ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత గురువారం అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ధరలపై నియంత్రణ ఎత్తి వేయాలని నిర్ణయించింది. దీనివల్ల అక్రమ నిల్వలను బయటకు తీసుకురావొచ్చని తద్వారా సరఫరా పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే నిత్యావసరాలపై ధరల నియంత్రణను తొలగిస్తున్నట్టు గత శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

దీంతో ఒక్కసారిగా నిత్యావసర ధరల మోత మోగింది. గత శుక్రవారం రూ. 1400 ఉన్న 12.5 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర , ఇప్పుడు రూ. 2,657 కు చేరుకుంది. అంటే రెండు రోజుల వ్యవధి లోనే సిలిండర్ ధర రూ.1257 పెరిగింది. ఇక కేజీ పాలు ధర రూ.250 నుంచి రూ.1195 కు పెరిగింది. ఇవే కాదు, గోధుమ పిండి, పంచదార, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు, సిమెంట్ సహా దాదాపు అన్నిటి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News