Sunday, April 28, 2024

మానవ హక్కులనూ స్వలాభ దృష్టితో చూస్తున్నారు

- Advertisement -
- Advertisement -
Prime Minister at the NHRC Foundation Day
అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి… ఎన్‌హెచ్‌ఆర్‌సి వృవస్థాపక దినోత్సవంలో ప్రధాని

న్యూఢిల్లీ: మానవ హక్కులను తమకు నచ్చిన రీతిలో వివరిస్తున్న వారిని ప్రధాని నరేంద్ర మోడీ ఎండగట్టారు. మానవ హక్కుల ఉల్లంఘనలను రాజకీయ లాభ నష్టాల దృష్టితో చూసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. వీరి వైఖరి మానవ హక్కులకే కాకుండా దేశానికి కూడా మానికరమన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్( ఎన్‌హెచ్‌ఆర్‌సి) 28వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా మంగళవారం ప్రధాని మాట్లాడారు. ఒకే విధమైన సంఘటనలు జరిగినప్పుడు వీటిని మానవ హక్కులుగా చెప్తున్న కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వేర్వేరు విధాలుగా చూస్తున్నారన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన పేరుతో దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలనిప్రజలను కోరారు.

మరుగుదొడ్లు, వంటగ్యాస్, విద్యుత్, గృహాలు వంటి పేదల మౌలిక అవసరాలను తీర్చడానికి తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. పేదలు తమ హక్కుల పట్ల మరింత అవగాహన పెంచుకుంటున్నారని తెలిపారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ చట్టాన్ని ఆమోదించడం ద్వారా ముస్లిం మహిళలకు కొత్త హక్కులను కల్పించామన్నారు. ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచినట్లు తెలిపారు. అత్యాచారాల నిరోధం కోసం కఠిన చట్టాలను తీసుకు వచ్చినట్లు తెలిపారు. మహిళలను సాధికారులను చేయడం కోసం తమ ప్రభుత్వంకృషి చేస్తోందన్నారు. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ప్రకారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను 1993 అక్టోబర్ 12న ఏర్పాటు చేశారు. మానవ హక్కుల పరిరక్షణ,అభివృద్ధి దీని ప్రధాన లక్షాలు. ఎన్‌హెచ్‌ఆర్‌సి మానవ హక్కుల ఉల్లంఘన కేసులను విచారణకు స్వీకరించి బాధితులకు పరిహారాన్ని సిఫార్సు చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News