Sunday, April 28, 2024

రాష్ట్రంలో 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ వర్చువల్‌గా శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :  అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ కింద రాష్ట్రంలో రూ.898 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పథకంలో భాగంగా హైదరాబాద్, హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట, ఉప్పుగూడ, మలక్‌పేట, మల్కాజిగిరి, ఆదిలాబాద్, భద్రాచలం రోడ్డు, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట, ఖమ్మం, మధిర, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, తాండూరు, రామగుండం, రాయగిరి(యాదాద్రి) రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందనున్నాయి.
2014 నుంచి 2023 వరకు రైల్వే శాఖ బడ్జెట్ 17 రెట్లు పెరిగింది
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో ఇండియన్ రైల్వే అభివృద్ధి చెందిందని కిషన్‌రెడ్డి తెలిపారు. రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 2014 నుంచి 2023 వరకు రైల్వే శాఖ బడ్జెట్ 17 రెట్లు పెరిగిందన్నారు. హైదరాబాద్ నుంచి యాద్రాద్రి వరకు ఎంఎంటిఎస్‌ను రూ.3 వందల కోట్లతో నిర్మించబోతున్నామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఆయన విమర్శించారు. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందడం లేదని ఆయన ఆరోపించారు.
సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి కోసం రూ.700 కోట్లు
2 వేల కి.మీలకు పైగా రైల్వేలైన్స్ కోసం రాష్ట్రంలో సర్వే చేశామని కిషన్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి కోసం రూ.700 కోట్లు వెచ్చించామని, చర్లపల్లి రైల్వే టెర్మినల్ 2024లోపు పూర్తి చేస్తామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.300 కోట్లతో కాచిగూడ రైల్వేస్టేషన్ అభివృద్ధిని చేస్తున్నామన్నారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ శంకుస్థాపనకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దక్షిణమధ్య రైల్వే జిఎం అరుణ్‌కుమార్ జైన్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News