Thursday, May 2, 2024

యువత బలిదానాల వల్లే తెలంగాణ కల సాకారం: ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఏర్పాటు నిర్ణయం కఠినమైంది
యువత బలిదానాల వల్లే తెలంగాణ కల సాకారం
సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చి 9 ఏళ్లు దాటినా కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు
నీరు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం సాగింది
అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ‘ప్రత్యేక తెలంగాణ’ రాష్ట్రం ఇవ్వలేదు
ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న బిఆర్‌ఎస్ హామీ నెరవేరిందా?
యూత్ డిక్లరేషన్ విడుదల చేసిన ప్రియాంక గాంధీ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు నిర్ణయం చాలా కఠినమైందని, యువత బలిదానాల వల్ల తెలంగాణ సాధ్యమైందని ఎఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువ సంఘర్షణ సభ’ కు ఏఐసీసీ ఆమె ముఖ్య అతిథిగా హాజరై, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌ను ఆవిష్కరించారు. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా సభకు చేరుకున్న ఆమెకు రాష్ట్ర ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, సభకు తరలివచ్చిన అభిమానులకు ప్రియాంక గాంధీ అభివాదం చేస్తూ సభపైకి చేరుకున్నారు. ‘జై బోలో తెలంగాణ’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

యూత్ డిక్లరేషన్‌ను అమలు చేయకలేక పోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఆమె కోరారు. తాను తప్పుడు వాగ్దానాలు ఇవ్వలేనన్నారు. తెలంగాణ మీకు నేల కాదు, తల్లి లాంటిదన్నారు. నీరు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం సాగిందన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలకపాత్ర పోషించారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్న తపన సోనియాకు ఉందన్నారు. తెలంగాణ సాధన కోసం శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేశారని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ కోసం యువత ఆత్మబలిదానం చేసుకుందని చెప్పారు. దేశం కోసం తన కుటుంబం కూడా ప్రాణ త్యాగాలు చేసిందన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం అమరులయ్యారని గుర్తు చేశారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చి 9 ఏళ్లు దాటినా కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న బిఆర్‌ఎస్ హామీ నెరవేరిందా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం బిఆర్‌ఎస్ సర్కార్ కాదని పేర్కొన్నారు. నయా జాగీర్ధార్ల తరహలో బిఆర్‌ఎస్ పాలన ఉందని విమర్శించారు. టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నా పత్రాలు లీక్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదన్నారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదని విమర్శించారు. గత 9 ఏళ్లలో 12 రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఖాళీని కూడా భర్తీ చేయలేదు. ఒక్క ప్రభుత్వ వర్సిటీలో కూడా ఉద్యోగ నియామకాలు జరగలేదన్నా రు. తనను మరో ఇందిరమ్మ అంటారన్నారు. అలా అన్నప్పుడు తన బాధ్యత మరింత పెరుగుతుందని చెప్పారు. 40 ఏళ్లు అయినా ఇందిరను తలు చుకుంటున్నారంటే ఆమె అందించిన సేవలు అలాంటివని చెప్పారు. తాను నయా ఇందిరమ్మ మాదిరిగా ఆమె ఆశయాలు నెరవేరుస్తా నన్నారు. యూత్ డిక్లరేషన్ లోని అంశాలను కొన్నింటిని ఆమె తన స్రసంగంలో ప్రకటించారు. అనంతరం హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌ను ప్రియాంక గాంధీ విడుదల చేశారు.

Priyanka Gandhi Speech at Yuva Sangharshana Sabha

ఆ పని చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయండి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌ను అమలు చేయకపోతే తమ ప్రభుత్వాన్ని కూల్చేయండని ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతల ముందే ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
షెడ్యూల్‌లో మార్పులు…
సరూర్‌నగర్ సభ ఆలస్యం కారణంగా ప్రియాంక గాంధీ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. సూర్యాస్తమయం కావడంతో ఆమె రోడ్డు మార్గాన బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి పయనమయ్యారు.

యూత్ డిక్లరేషన్ అంశాలను ప్రకటించిన రేవంత్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి స్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే యూత్ డిక్లరేషన్‌ను అమలు పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఐదు అంశాలతో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించింది. యూత్ డిక్లరేషన్‌లోని అంశాలను రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి ఏటా జూన్ రెండున జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని తేల్చి చెప్పారు. ఐదు అంశాలతో యూత్ డిక్లరేషన్‌ను రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైద్రాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటించేందుకు వచ్చిన ప్రియాంక గాంధీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఓయూ, కాకతీయ విశ్వ విద్యాలయాలు కావన్నారు. ఈ రెండు యూనివర్శిటీలు ఆత్మగౌరవ ప్రతీకలుగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి చాటిన వేదికలుగా ఆయన పేర్కొన్నారు. అంతేకాదు. ఈ యూనివర్శిటీలు తెలంగాణ పౌరుషానికి వేదికలుగా నిలిచాయన్నారు. ఉమ్మడి ఎపి రాష్ట్రంలో 12.5 ఉద్యోగాలుంటే రాష్ట్ర విభజనలో తెలంగాణకు 5.3 ఉద్యోగాలను కేటాయించినట్టుగా గుర్తు చేశారు. తొలి ఏడాది 1.07 లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని బిఆర్‌ఎస్ మాట ఇచ్చిందని గుర్తు చేశారు.

బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారంగా రాష్ట్రంలో 1.9 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.5 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని చెప్పారు. బిఆర్‌ఎస్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు దాటినా కూడా ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదన్నారు. అమరవీరుల ఉద్యమకారులకు గుర్తుగా తొలి డిక్లరేషన్ అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇస్తామని ప్రకటించారు. అమరవీరుల కుటుంబాలకు రూ. 25 వేల పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. అమరవీరులకు సముచిత గుర్తింపు ఇచ్చే బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు. సెప్టెంబర్ 17న నియామకపత్రాలను లబ్దిదారులకు అందిస్తామన్నారు. ప్రతి నిరుద్యోగికి రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు.

ప్రభుత్వం నుండి రాయితీ పొందిన ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల కల్పనలో 75 శాతం స్థానికులకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మరో నాలుగు ట్రిపుల్ ఐటీ సంస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్య, ఉపాధి సమస్యలపై యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. నిరుద్యోగ యువతకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఏడు జోన్లలో ఎంప్లాయిమెంట్, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గల్ఫ్ కార్మికులను ఆదుకొనేందుకు చట్టం తెస్తామని చెప్పారు. మోసం చేసే ఏజంట్లను నియంత్రిస్తామని ప్రకటించారు. విద్యార్ధుల ఫీజు రీఎంబర్స్ మెంట్, పాత బకాయిలను చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మంలలో వర్శిటీలు తీసుకొస్తామని తెలిపారు. స్పోర్ట్ అకాడమీ ఏర్పాటుతో గ్రామీణ యువతకు చేయూత అందిస్తామన్నారు. విద్యార్ధినులకు ఎలక్ట్రిక్ బైక్‌లను ఉచితంగా అందిస్తామన్నారు. టిఎస్‌పిఎస్‌సిని బలోపేతం చేస్తామన్నారు. టిఎస్‌పిఎస్‌సి రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆరోపించారు.

విద్యార్థి లోకం, నిరుద్యోగ యువత ఏకం కావాలి : సిఎల్‌పి నేత భట్టి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కళను సాకారం ఘనత కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి దక్కుతుందని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క చెప్పారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగాల లేక యువత నిరాశలో ఉందని చెప్పారు. నీళ్లు, నిధులు, నియమాకాలు కోసం పోరాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలకు పాల్పడితే బిడ్డలు మరణించకూడదని తల్లిలాగా ఆలోచన చేసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. ఏ యువత కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందో నేడు ఉద్యోగాల లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

తెలంగాణ యువతకు భరోసా ఇవ్వడానికి ప్రియాంక గాంధీ రాష్ట్రానికి వచ్చారని చెప్పారు. నిరుద్యోగ సమస్యకు భరోసా కోసం రాష్ట్రం నలుమూలల నుంచి యువత ఇక్కడకు వచ్చారని అన్నారు. ఆదిలాబాద్ నుంచి సరూర్‌నగర్ వరకు పాదయాత్ర చేశానని చెప్పారు. తన పాదయాత్రలో అనేక సమస్యలను చూశానని తెలిపారు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఫలాలు కొందరు ప్రభుత్వ పెద్దలకే అందుతున్నాయని విమర్శించారు. ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుందని ప్రశ్నించారు. విద్యార్థి లోకం, నిరుద్యోగ యువత ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. మరోకసారి పోరాటానికి సిద్దం అవుదామని పిలుపునిచ్చారు. ఆశలు, ఆశయాలను గుర్తించిన కాంగ్రెస్‌తో చేతులు కలిపి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని కోరారు. ఇక, తన ప్రసంగం ముగిసిన తర్వాత పోచంపల్లి చేనేత కార్మికులు అందజేసిన చీరను ప్రియాంక గాంధీకి మల్లు భట్టివిక్రమార్క బహుకరించారు.

కాంగ్రెస్ మెంబర్‌షిప్‌తో రూ. 2 లక్షల ఇన్సూరెన్స్..అందించిన ప్రియాంక
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొనన్న వారికి ఇన్సూరెన్స్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ సోమవారం అందించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ ను ఈ దఫా అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. పార్టీ సభ్యత్వం తీసుకున్న 140 మంది పార్టీ కార్యకర్తలకు ఆమె చెక్కులను అందించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రెండు లక్షల ఇన్సూరెన్స్‌ను కాంగ్రెస్ పార్టీ అందించింది. తెలంగాణలో సుమారు 30 లక్షల సభ్యత్వం చేర్పించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. పార్టీ సీనియర్లు కూడా సభ్యత్వ సేకరణలో పాల్గొన్నారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా గత ఏడాది సభ్యత్వ నమోదు ప్రక్రియ నిర్వహించారు. సభ్యత్వ నమోదు పూర్తైన తర్వాత ఎన్నికలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News