Monday, April 29, 2024

ఈ బాండ్ పేపర్‌ను గుర్తు పట్టగలరా?

- Advertisement -
- Advertisement -

పసుపు బోర్డు ఇస్తామంటూ రాసిన ఈ బాండ్ పేపర్లను గుర్తు పట్టగలరా….
ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఇస్తామని హామీ ఇచ్చిన బిజెపి
ఆ తరువాత మరచిపోయింది
నిజామాబాద్ ఎంపి సైతం ఈ విషయాన్ని మరిచిపోయారు ?
ట్విట్టర్ వేదికగా ఎంపి అర్వింద్‌ను ప్రశ్నించిన మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు అంశం మరోమారు తెరపైకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రస్తుత నిజామాబాద్ ఎంపి అర్వింద్‌కుమార్ పసుపు రైతులకు రాసినట్లు ఉన్న ఓ బాండ్ పేపర్‌ను తాజాగా పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘పసుపు బోర్డు ఇస్తామంటూ రాసిన ఈ బాండ్ పేపర్లను గుర్తు పట్టగలరా అంటూ’ పురపాలక శాఖ మంత్రి కెటిఆర్, నిజామాబాద్ ఎంపి అర్వింద్‌కుమార్‌ను ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఇస్తామని హామీ ఇచ్చిన బిజెపి ఆ తరువాత మరచిపోయిందని ఆయన మండిపడ్డారు. రైతులు ఎన్నో ఉద్యమాలు చేసిన కనీసం పట్టించుకోపోవడం దారుణమని కెటిఆర్ దుయ్యబట్టారు. ఈ మేరకు తన ట్విటర్‌లో ఎంపి అర్వింద్ కుమార్ పేరు, సంతకంతో ఉన్న ఓ బాండ్ పేపర్‌ను కెటిఆర్ పోస్టు చేశారు.

ఇది రైతులను అవమానించడమే…
ఇది రైతులను అత్యంత దారుణంగా అవమానించడమేనని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బిజెపి ఆ తరువాత రైతులు ఎన్నో ఉద్యమాలు చేసినా పసుపు బోర్డు ఇవ్వకపోవటం దారుణమని ఆయన మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహానికి పసుపు రైతులు తగిన బుద్ధి చెబుతారని కెటిఆర్ విమర్శించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డుపై రాజకీయం చాలా ఏళ్లుగా నడుస్తోందని, ఇది వరకే అక్కడ పోటాపోటీగా ప్లెక్సీలు ఏర్పాటు చేసి నేతలకు పసుపు రైతుల నుంచి నిరసన సెగలు చాలా జరిగాయని కెటిఆర్ తెలిపారు.

దేశంలో సాగయ్యే పసుపులో 50శాతం ఇక్కడి నుంచే..
నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు ఎంతో అవసరం. ఇక్కడ ప్రతి ఏటా సుమారు 40వేల ఎకరాల్లో పసుపు పంట సాగు చేస్తున్నారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో దీనిని అత్యధికంగా పండిస్తున్నారు. దేశంలో సాగయ్యే పసుపులో 50శాతం నిజామాబాద్ జిల్లాలోనే ఉత్పత్తి అవుతోంది. పంట సాగు చేసేందుకు తొమ్మిది నెలల సమయం పడుతుండగా సుమారు లక్షన్నర వరకు పెట్టుబడి ఖర్చు అవుతోంది. కానీ సరైన మద్దతు ధర లేకపోవడంతో అన్నదాతలు చాలావరకు నష్టపోతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటైతే తమ పంటకు గిట్టుబాటు ధర లభించి తమ కష్టాలు తీరుతాయని రైతుల నమ్మకం, కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం అక్కడ పసుపు బోర్డుకు అంగీకారం తెలపలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News