Thursday, April 25, 2024

ఇప్పటికీ దొరకని ఆచూకీ.. వివిధ వేషాలలో అమృత్‌పాల్‌..

- Advertisement -
- Advertisement -

అంతుచిక్కని అమృత్‌పాల్‌ కోసం లుకౌట్ నోటీసు వెలువరించిన పంజాబ్ పోలీసు
ఏడు వేషాలలోని ఆయన చిత్రాల విడుదల
నాన్‌బెయిలబుల్ వారంటు జారీ
ఇప్పటికీ గాలింపు చర్యల్లో దొరకని ఆచూకీ
నేపాల్ మీదుగా కెనడాకు తరలివెళ్లే ప్లాన్
రెండు మూడు రాష్ట్రాల్లో తనిఖీలు ముమ్మరం
చండీగఢ్: ఖలీస్థానీ వాదిగా పేరొందిన అమృత్‌పాల్ ఇప్పటికి చిక్కుపడకపోవడంతో పంజాబ్ పోలీసులు ఆయన కోసం లుకౌట్ నోటిసు జారీ చేశారు. సంబంధిత కీలక ప్రకటన ఎల్‌ఒసిని బుధవారం పంజాబ్ పోలీసులు వెలువరించారు. అమృత్‌పాల్ ఎవరికి చిక్కకుండా ఉండేందుకు పలు వేషాలలో తిరుగుతున్నట్లు, బైక్‌లు, కార్లలో తిరుగుతున్నట్లు గుర్తించారు. దీనితో ఆయన 7 వేషాలలో ఉన్నప్పటి ఊహాత్మక రేఖచిత్రాలను విడుదల చేశారు. ఆయన గురించి సమాచారం ఉంటే తమకు వెంటనే తెలియచేయాలని పౌరులకు సూచించారు. అమృత్‌కు వ్యతిరేకంగా లుకౌట్ జారీ చేసిన దశలోనే ఆయనకు నాన్ బెయిలబుల్ వారంట్లు కూడా వెలువరించారు.

బుధవారంతో అమృత్‌పాల్‌కోసం గాలింపు చర్యలు చేపట్టి ఐదురోజులు దాటుతోంది. మారణాయుధాలతో ఆయన తన అనుచరులతో తిరుగుతున్నాడని తెలియడంతో పలు ప్రాంతాలలో భద్రతను పెంచారు. దేశ సరిహద్దులు దాటి వెళ్లకుండా పలు చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి అమృత్‌పాల్ యుపి ఆ తరువాత నేపాల్ మీదుగా కెనడాకు ఫరారు అవుతారని సమాచారం అందడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. తీవ్రస్థాయిలో ప్రమాదకరమైన వ్యక్తి తప్పించుకునేలా నిర్లక్షం వహించారని పేర్కొంటూ పంజాబ్ హర్యానా హైకోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను పట్టుకునేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు, తొందరలోనే ఆటకట్టించగలమనే నమ్మకంతో ఉన్నట్లు పంజాబ్ ఐజిపి సుఖ్‌చైన్ సింగ్ గిల్ వార్తాసంస్థలకు తెలిపారు.

మంగళవారం పోలీసులు అమృత్‌పాల్ అనుచరులు నలుగురిని అరెస్టు చేశారు. అమృత్‌పాల్ తప్పించుకుని పోవడంలో వీరు కీలక పాత్ర పోషించినట్లు నిర్థారణ అయింది. నిందితులు మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ మనూ, గుర్దీప్‌సింగ్ అలియాస్ దీపా, హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యపీ, గుర్బీజ్ సింగ్ అలియాస్ బేజాలు చాకచక్యంతో వ్యవహరించి అమృత్‌పాల్ పోలీసుల వలయం నుంచి తప్పించుకునేందుకు సహాయపడ్డారని పోలీసులు పేర్కొంటున్నారు. అమృత్‌పాల్‌ను గంటల పాటు పోలీసులు వాహనాలలో ఛేజ్ చేశారు. జలంధర్ వద్ద ఓ కారులో అమృత్‌పాల్ పోలీసులకు చిక్కకుండా వేగంగా దూసుకువెళ్లారు. ఆ తరువాత పోలీసులకు ఆయన జాడ లేకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News