Thursday, May 2, 2024

ఒలింపిక్స్ స్వర్ణమే లక్ష్యం…

- Advertisement -
- Advertisement -
PV-Sindhu
స్టార్ షట్లర్ పి.వి.సింధు

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి.సింధు స్పష్టం చేసింది. బుధవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో సింధు ఈ విషయం తెలిపింది. కిందటి ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించడంతో తన ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందని చెప్పింది. ఇదే జోరును ఒలింపిక్స్‌లోనూ కొనసాగించి స్వర్ణం సాధిస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ తర్వాత వరుస ఓటములు ఎదురైనా తన ఆత్మవిశ్వాసం తగ్గలేదని పేర్కొంది.

ఆటలో గెలుపోటములు సహాజమని, అంత మాత్రాన దీని ప్రభావం తన కెరీర్ ఏమాత్రం ఉండదని అభిప్రాయపడింది. ఇక, వరుస ఓటముల తర్వాత తనపై విమర్శలు వెల్లువెత్తాయని, అయితే దీన్ని తాను పెద్దగా పట్టించుకోనని తెలిపింది. మళ్లీ పూర్వ వైభవం సాధిస్తాననే నమ్మకం తనకుందని వివరించింది. క్లిష్ట పరిస్థితులను సయితం తట్టుకుని ముందుకు సాగే సత్తా తనకుందని, ఇందుకు తాను సాధించిన విజయాలే నిదర్శనమని సింధు పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్ లక్షంగా తన సాధన ఉంటుందని, దీని కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతున్నట్టు తెలిపింది.

ఈసారి ఒలింపిక్స్‌లో కచ్చితంగా స్వర్ణం గెలుస్తాననే నమ్మకం తనకుందని వివరించింది. తన కెరీర్‌లోనే ఈ ఏడాది చాలా ప్రత్యేకమైందని స్పష్టం చేసింది. ఒలింపిక్స్‌లో పసిడి సాధించడం ద్వారా తన ఆటపై వచ్చిన విమర్శలకు తగిన సమాధానం చెబుతానని భారత స్టార్ షట్లర్ ధీమా వ్యక్తం చేసింది. ఇక, తన కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నానని, ప్రతి సారి వాటిని తన ఆట ద్వారా తిప్పికొట్టిన విషయాన్ని గుర్తు చేసింది. మరోవైపు కొత్త సంవత్సరం తన కెరీర్‌కు కొత్త ఊపు ఇస్తుందనే నమ్మకాన్ని సింధు వ్యక్తం చేసింది.

PV Sindhus targets Olympic gold Medal 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News