Saturday, April 27, 2024

టైటిల్ పోరుకు నాదల్, మెద్వెదెవ్

- Advertisement -
- Advertisement -

Rafael Nadal reaches Australian Open final

సిట్సిపాస్, బెరెటెని ఇంటికి, నేడు మహిళల ఫైనల్
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ఆరో సీడ్ నాదల్ ఇటలీకి చెందిన మాటియో బెరెటెనిను ఓడించాడు. ఇక రెండో సెమీస్‌లో అగ్రశ్రేణి ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ (రష్యా) జయకేతనం ఎగుర వేశాడు. గ్రీక్ వీరుడు, నాలుగో సీడ్ స్టెఫానొస్ సిట్సిపాస్‌తో జరిగిన పోరులో రెండో సీడ్ మెద్వెదెవ్ విజయం సాధించాడు. అతను గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా రెండోసారి కావడం విశేషం. కిందటి ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో డానిల్ విజేతగా నిలిచాడు. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో నాదల్‌తో డానిల్ పడుతాడు.

ఆరంభం నుంచే..

ఇక బెరెటెనితో జరిగిన సెమీస్ పోరులో స్పెయిన్ బుల్ నాదల్ ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించాడు. తన మార్క్ ఆటతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. దూకుడైన ఆటతో లక్షం దిశగా అడుగులు వేశాడు. క్వార్టర్ ఫైనల్లో చేసిన తప్పిదాలను ఈసారి నాదల్ పునరావృతం చేయలేదు. నిలకడైన ఆటతో మ్యాచ్‌పై పట్టు బిగించాడు. ఇదే క్రమంలో అలవోకగా తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. బెరెటెని తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. వరుస తప్పిదాలకు పాల్పడి సెట్‌ను కోల్పోయాడు. రెండో సెట్‌లో నాదల్ మరింత చెలరేగి పోయాడు. అద్భుత షాట్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. రఫెల్ ధాటికి బెరెటెని ఎదురు నిలువలేక పోయాడు. చెలరేగి ఆడిన నాదల్ అలవోకగా రెండో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ మూడో సెట్‌లో బెరెటెని అనూహ్యంగా పుంజుకున్నాడు. నాదల్ జోరుకు బ్రేక్ వేస్తూ ముందుకు సాగాడు. అద్భుత షాట్లతో నాదల్‌ను హడలెత్తించాడు. అతని ధాటికి నాదల్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. చివరి వరకు దూకుడును ప్రదర్శించిన ఇటలీ సంచలనం సెట్‌ను దక్కించుకున్నాడు.

అయితే నాలుగో సెట్‌లో మళ్లీ నాదల్ ఆధిపత్యం చెలాయించాడు. ఆరంభం నుంచే బెరెటెనిపై ఒత్తిడి పెంచాడు. తన మార్క్ షాట్లతో అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాడు. నాదల్ విజృంభణతో బెరెటెని పూర్తిగా చతికిల పడ్డాడు. ఏ మాత్రం ప్రతిఘటించకుండానే చేతులెత్తేశాడు. ఇక అద్భుతంగా ఆడిన నాదల్ అలవోకగా సెట్‌ను గెలిచి టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు. మరో సెమీస్‌లో డానిల్ మెద్వెదెవ్ విజయం సాధించాడు. సిట్సిపాస్‌తో జరిగిన పోరులో డానిల్ 76, 46, 64, 61 తేడాతో జయభేరి మోగించాడు. ఆరంభ సెట్‌లో పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు డానిల్ అటు సిట్సిపాస్ ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో ఆధిపత్యం తరచూ చేతులు మారుతూ వచ్చింది. అంతేగాక సెట్ కూడా టైబ్రేకర్ వరకు వెళ్లింది. హోరాహోరీగా సాగిన పోరులో చివరికి రష్యా స్టార్‌కు విజయం వరించింది.

కానీ రెండో సెట్‌లో సిట్సిపాస్ పుంజుకున్నాడు. ఈసారి చివరి వరకు నిలకైడన ఆటను కనబరిస్తూ సునాయాసంగా సెట్‌ను సొంతం చేసుకున్నాడు. తర్వాతి సెట్‌లో కూడా పోరు ఆసక్తికరంగా సాగింది. ఇద్దరు సర్వం ఒడ్డి పోరాడారు. అయితే కీలక సమయంలో సిట్సిపాస్ ఒత్తిడికి గురై వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన డానిల్ సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక నాలుగో సెట్‌లో మెద్వెదెవ్‌కు ఎదురే లేకుండా పోయింది. అద్భుత ఆటతో అలరించిన డానిల్ అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు.

చారిత్రక విజయానికి
అడుగు దూరంలో నాదల్

స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తన కెరీర్‌లోనే అత్యంత అరుదైన విజయానికి చేరువయ్యాడు. ఆదివారం జరిగే ఫైనల్లో గెలిస్తే నాదల్ చరిత్ర సృష్టిస్టాడు. ఇప్పటికే కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌టైటిల్స్‌తో రఫెల్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్‌లు కూడా చెరో 20 టైటిల్స్‌తో మొదటి స్థానంలో నిలిచారు. ఇక డానిల్ మెద్వెదెవ్‌తో జరిగే తుది సమరంలో నాదల్ గెలిస్తే 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన తొలి ఆటగాడు అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు.

బార్టీతో కొలిన్స్ అమీతుమీ

మహిళల సింగిల్స్ పోరుకు టాప్ సీడ్ అష్లే బార్టీ (ఆస్ట్రేలియా), 27వ సీడ్ డానిల్లి కొలిన్స్ (అమెరికా) సిద్ధమయ్యారు. బార్టీ ఇప్పటికే కెరీర్‌లో రెండు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. ఈసారి గెలిచి మూడో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉంది. సొంత అభిమానుల మధ్య జరుగుతున్న పోరులో బార్టీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు కొలిన్స్ ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. తొలి ప్రయత్నంలోనే టైటిల్ సాధించి చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో కొలిన్స్ కనిపిస్తోంది. సెమీస్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ (పోలండ్)ను ఓడించి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది. బార్టీతో జరిగే తుది సమరానికి సమరోత్సాహంతో సిద్ధమైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News