Sunday, June 16, 2024

అగ్నివీర్ పథకాన్ని చెత్తబుట్టలో పడేస్తాం:రాహుల్

- Advertisement -
- Advertisement -

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి చెత్తకుండీలో పడేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. దేశ యువతను కూలీలుగా మార్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానాలో తన తొలి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ రైతుల సమస్యపై ప్రధాని మోడీ వైఖరిని ఎండగట్టారు. అగ్నివీర్ పథకంపై బిజెపి ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ ఇది సైన్యం పథకం కాదని, ఇది మోడీ పథకమని ఆయన ఆరోపించారు. అగ్నివీర్ ఫథకాన్ని సైన్యం కోరుకోవడం లేదని ఆయన తెలిపారు. భారతదేశ సరిహద్దులు దేశ యువత చేతుల్లో భద్రంగా ఉన్నాయని, మన యువత డిఎన్‌ఎలోనే దేశభక్తి ఉందని ఆయన అన్నారు. భారతదేశ యువతను కూలీలుగా మోడీ మార్చివేశారని ఆయన ఆరోపించారు. రెండు రకాల అమర జవాన్లు ఉంటారని మన ప్రభుత్వం చెబుతోందని, ఒకరు సాధారణ జవాన్ అయితే మరొకరు పెన్షన్, అమర వీరుని హోదా,

ఇతర అన్ని సౌకర్యాలు లభించే అధికారి అని రాహుల్ చెప్పారు. అగ్నివీర్ పేరుతో సైన్యంలోకి వచ్చే పేద కుటుంబానికి చెందిన వ్యక్తి మరణిస్తే అమర వీరుని హోదా కాని, పెన్షన్ కాని రావని, కనీసం క్యాంటీన్ సౌకర్యం కూడా ఉండదని ఆయన తెలిపారు. కేంద్రం 2022లో త్రివిధ దళాలలో స్వల్పకాలిక సైనిక జవాన్ల నియామకం కోసం అగ్నిపథ్ నియామక పథకాన్ని ప్రవేశపెట్టింది. 17 సంత్సరాలు పైబడి 21 సంవత్సరాలు లోపు ఉన్న యువత ఈ పథకం నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులుగా పనిచేయాల్సి ఉంటుంది. వీరిలో 25 శాతం మంది సర్వీసును 15 సంవత్సరాల వరకు పొడిగిస్తారు. కాగా..రైతుల సమస్యపై ప్రభుత్వ విధానాన్ని రాహుల్ దుయ్యబట్టారు. 22 మంది కోటీశ్వరులకు చెందిన రూ. 16 లక్షల కోట్ల రుణాలను మోడీ ప్రభుత్వం మాఫీ చేసిందని ఆయన ఆరోపించారు. జూన్ 4న తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. వ్యవసాయ రుణ మాఫీకి సంబంధించి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రుణ మాఫీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన వాగ్దానం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News