Friday, May 3, 2024

మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్న ప్రధాని మోడీ: రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ మ్యాచ్ పాల్పడుతున్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా 400సీట్ల నినాదం సాధ్యం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంపైర్లను ఒత్తిడి చేసి, ఆటగాళ్లను కొనుగోలు చేసి, కెప్టెన్లను బెదిరించి మ్యాచ్‌లు గెలవడాన్ని క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారని ఆయన వివరణ ఇచ్చారు. ఈవీఎంలు, మ్యాచ్‌ఫిక్సింగ్, సోషల్ మీడియా, ప్రెస్‌పై ఒత్తిడి లేకుండా బీజేపీ 180 సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలవలేదని తేల్చి చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని అంపైర్లను ఎన్నుకున్నారని, ఈ ఎన్నికల మ్యాచ్‌కి ముందే తమ జట్టు ఆటగాళ్లైన ఇద్దరిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. పేదల నుండి రాజ్యాంగాన్ని లాక్కోవడం కోసం ప్రధాని మోడీ 34 మంది క్రోనీ క్యాపిటలిస్టులను మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ను మనీల్యాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్‌ఆద్మీ పార్టీ , ఇండియా కూటమి అగ్రనేతలు ఢిల్లీలో ఆదివారం చేపట్టిన లోక్‌తంత్ర బచావో ర్యాలీలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అని, కానీ ఎన్నికల ముందు తమ బ్యాంక్ ఖాతాలన్నీ మూసివేయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల కోసం తాము ప్రచారాలు నిర్వహించాలని, కార్మికులను రాష్ట్రాలకు తరలించి పోస్టర్లు వేయాలని, కానీ బ్యాంక్ ఖాతాలు మూసివేస్తే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, హేమంత్ సోరేన్‌లను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. ఇప్పుడు వస్తున్న ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని, దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునే చివరి అవకాశమని, స్పష్టం చేశారు. ఒకవేళ పూర్తిస్థాయిలో ఓటు వేయకపోతే వారి మ్యాచ్ ఫిక్సింగ్ ఫలిస్తుందని, అదే జరిగితే రాజ్యాంగం ధ్వంసమవుతుందని రాహుల్ హెచ్చరించారు. రాజ్యాంగం అనేది ప్రజల గొంతుకని, అది నాశనమైతే దేశం అంతమవుతుందని వెల్లడించారు. 400 కి పైగా సీట్లు వస్తే తాము రాజ్యాంగం మారుస్తామని ఓ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను కూడా రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News