గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగర్‌కర్నూల్ జిల్లా, ఉప్పునుంతల మండల పరిధిలో గల దుందుభి నది ప్రవాహం భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నదిపై రహదారిని మూసివేసినట్లు ఎస్‌ఐ వెంకట్ రెడ్డి తెలిపారు. నది ప్రవాహం ఎక్కువ ఉన్నందున ఎవరు కూడా అత్యుత్సాహం చూపించి నదిని దాటవద్దని సూచించారు. సమీప గ్రామాల ప్రజలు గమనించి చింతపల్లి గ్రామం మీదుగా రాకపోకలు కొనసాగించాలని ఆయా గ్రామాల ప్రజలకు, ప్రయాణికులకు తెలిపారు. ఉల్పర మీదుగా కల్వకుర్తి వెళ్లే ఆర్‌టిసి బస్సులను రద్దు చేశారు.
బస్సులు రాకపోవడంతో ప్రజలు ఎంతో ఇబ్బందికి గురయ్యారు. ఉల్పర, మొల్గర బ్రిడ్జి నిర్మించాలని బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో బ్రిడ్జి నిర్మాణం కోసం అనుమతులు వచ్చాయి. నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్ ప్రక్రియ పూర్తయినా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదు. ఈ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు జరుగుతుంతో, తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని సమీప గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేపట్టాలని అచ్చంపేట ఎంఎల్‌ఎ వంశీకృష్ణను ఉప్పునుంతల, వంగూరు మండల ప్రజలు కోరుతున్నారు.