బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఈదురు గాలులుతో కూడిన వర్షాలు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా విస్తరిస్తున్నాయని,
రెండు మూడు రోజుల్లో దక్షిణ అరేబియా, మాల్దీవులు, కొమోరిన్ సహా బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని ఐఎండి వెల్లడించింది. మరోవైపు అంచనా వేసిన సమయాని కంటే ముందుగానే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు పూర్తిగా విస్తరించి ఉన్నాయని ఐఎండి తెలిపింది. తొలుత ఈ నెల 27వ తేదీన కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయని అంచనా వేసినా, ఈ నెల 24వ తేదీన కేరళ తీరంలోకి ప్రవేశించి, జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐఎండి అధికారులు పేర్కొన్నారు.