Monday, May 6, 2024

కెమెరాకే ట్రిక్కులు నేర్పిన రాజన్ బాబు

- Advertisement -
- Advertisement -

అద్భుతమైన జ్ఞాపకాలు, తియ్యటి అనుభూతులు, మధుర ఘట్టాలు, గొప్ప సన్నివేశాలు, అపురూప సంఘటనలు, మనసు దోచే దృశ్యాలు, ఆలోచింప జేసే రూపాలు, అరుదైన చిత్రాలు వెరసి ఫోటోగ్రఫీ. వెలకట్టలేని దృశ్యాలను పది కాలాల పాటు పదిలంగా మన కళ్లముందు ఉంచేది ఫోటో. వంద మాటలతో చెప్పలేనిది ఒక్క ఫోటోతో చెప్పడం సాధ్యం. అంతటి శక్తివంతమైనది ఫోటోగ్రఫీ. అలాంటి శక్తిని వశం చేసుకుని ఫోటోతో అద్భుతాలు సృష్టించిన కెమెరా మాంత్రికుడు బండి రాజన్ బాబు. కెమెరాకే ట్రిక్కులు నేర్పిన నేర్పరి రాజన్ బాబు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన రాజన్ బాబు తెలంగాణకు చెందినవారు కావడం గర్వకారణం. బండి రాజన్ బాబు (ఫిబ్రవరి 9, 1939 – ఆగస్టు 24, 2011) ప్రఖ్యాత ఛాయా చిత్రకారులు. దృశ్య ప్రధానమైన ఛాయా గ్రహణంలో పేరు తెచ్చుకొన్న బండి రాజన్ బాబు 1939, ఫిబ్రవరి 9 న అవిభక్త కరీంనగర్, నేటి జగిత్యాల జిల్లా కోరుట్లలో జన్మించారు. రాజన్ బాబంటే తొలుత గుర్తుకు వచ్చేవి అరకు లోయల్లో తీసిన బొండా గిరిజన మహిళల అగణిత ఛాయా చిత్రాలు.

బాల్యంలో రంగులు వేయడం, చిత్రాలను గీయడం పట్ల ఆసక్తిని కనబరిచిన రాజన్ బాబు, మంచి చిత్రకారుడు కావల్సి ఉండగా, కుంచె నుండి కెమెరాకు మారడం యాదృచ్ఛికం. బాల్యం నుంచి చిత్రకళపై మక్కువ ఉన్న రాజన్ 7వ తరగతి చదువుతున్నప్పుడు తన కజిన్ బహుకరించిన సాధారణ కొడాక్ 620 కెమెరాతో తీసిన చిత్రాలు పెక్కుమంది ప్రశంసలు అందుకొని రాజన్‌లోని ఛాయాగ్రాహకుడిని వెలికి తీసింది. హైదరాబాదులోని జెఎన్‌టియు ఫైన్ ఆర్ట్ కళాశాలలో కమర్షియల్ ఆర్ట్ (వ్యాపార చిత్రకళ) లో డిప్లొమా కోర్స్‌లో చేరిన సమయంలో రాజన్ బాబు ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు దివంగత రాజా త్రయంబక్ రాజా బహదూర్‌ను కలవడం జరిగింది. రాజా త్రయంబక్ రాజా, రాజన్ బాబును కుంచెస్థానంలో కెమెరా పట్టుకోమన్న సలహా రాజన్ జీవితాన్ని మలుపు తిప్పింది. 5 సంవత్సరాల డిప్లొమా చేసి, కళాశాలలో డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణుడై, కళాశాల యాజమాన్యం మెప్పుపొంది అదే కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. తరువాత ఇక్రిశాట్‌లో సైంటిఫిక్ ఫోటోగ్రాఫర్‌గా పని చేశారు. 1978లో తన ఫోటోస్టుడియో స్థాపించి, రాజన్ స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ ప్రారంభించి ఎందరో విద్యార్థులను నిపుణులైన ఛాయా గ్రాహకులుగా తీర్చిదిద్దారు.

ఛాయాగ్రాహణంలో రాజన్ తొక్కిన కొత్తపుంతలు తనకు దేశీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. 1987లో నగ్నచిత్రాలపై ఛాయా చిత్ర కళాకృతులను సమర్పించి రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ ఫెలోషిప్ పొందారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అకాడెమీ ఆఫ్ ఫోటోగ్రఫీ కార్యదర్శిగా ఉంటూ, భగవాన్ దాస్ తర్వాత లెన్స్ లైట్ అనే ఛాయా గ్రాహక పత్రికకు సంపాదకత్వం వహించారు. డిజిటల్ ఛాయా గ్రాహణానికి ముందు ఛాయా చిత్రాలు డార్క్ రూం (చీకటి గది) లోనే స్థిర రూపం దాల్చేవి. నెగటివ్‌లు వృద్ధి చేయటానికి, స్థిరపరచడానికై రాజన్ తానే రూపొందించుకొన్న రసాయనిక సూత్రంపై ద్రవణాలు కలిపి డెవలపర్ తయారు చేసి, నెగటివ్‌లను స్థిరపరిచేవారు. ఈ విధానంలో చిత్రంలో నలుపు, తెలుపులను ప్రస్ఫుటంగా చూపే హైడ్రోక్వినాన్ లేకుండా కేవలం మెటల్‌తోనే ఫిల్మ్‌ను వృద్ధి పరచి, స్థిరపరచి నలుపు తెలుపులో ఎన్నో కళాఖండాలు సృష్టించారు. ఇది రాజన్ ప్రతిభకు నిదర్శనం. ఫోటోషాప్ లాంటి సాఫ్టవేర్ లేని సమయంలో కూడా రాజన్ అద్భుతాలు చేశారు. తన కళానైపుణ్యంతో తన ఛాయా చిత్రాలను పలు మార్లు వన్ మాన్ షోలో ప్రదర్శించి, పలువురి ప్రశంసలందుకున్నారు.

రాజన్ తీసిన నగ్న చిత్రాలో రసికత వుంటుంది కాని అసభ్యతకు చోటు ఉండదు. అందుకే అవి రసజ్ఞుల ప్రశంసలు పొందా యి. కొడాక్ 620తో మొదలుపెట్టిన రాజన్, తన విద్యార్థులకు ఛాయా గ్రహణ పాఠాలలో భాగంగా బోధించడానికై, చాలా కెమెరాలు సేకరించారు. వాటిలో ఛాయా చిత్రకారులలో హోదాకు చిహ్నమైన Hasselblad -medium -format camera కూడా ఉంది. ఫిల్మ్ కెమెరా Asahi Pentax నుంచి, ఛాయాగ్రహణం డిజిటల్ దిశగా సాగిన పయనంలో రాజన్ Canon 400d వాడే వాతు. ఛాయాగ్రహణ శాఖలలో ఒకటైన ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో కూడా రాజన్ తన సత్తా చూపారు. నగ్న చిత్రాలకు, అసభ్య చిత్రాలకు మధ్య ఒక గీత ఉంటుంది అనే వారు రాజన్ బాబు. ఛాయాగ్రహణం ఒక భాషైతే, అందులోని వ్యాకరణమే Composition, Color, Space, Form, Proper Exposure, Angle and Light అని వివరించే వారు. ఈ మెళకువ గ్రహించిన వాడు మంచి ఛాయా గ్రాహకుడవుతాడని రాజన్ అంటుండే వారు. పిక్టోరియల్ ఫోటోగ్రఫీలో తనదైన ముద్ర వేసిన రాజన్ బాబు 2011, ఆగస్టు 24న తన 73వ ఏట, అనారోగ్యంతో హైదరాబాదులో మరణించారు. రాష్ట్ర, జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఫోటో ప్రదర్శనలు ఏర్పాటు చేసి, లెక్కకు మించిన అవార్డులు, బహుమతులు సొంతం చేసుకున్న రాజన్ బాబు ఫోటోగ్రఫీ కళాకారునిగా చిరకాలం గుర్తుండి పోతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News