Thursday, May 2, 2024

రామగుండం యూరియా ఉత్పత్తి నిలిపివేత

- Advertisement -
- Advertisement -

ఎంఎల్‌ఎ కోరుకంటి చందర్ ఫిర్యాదుతో పిసిబి
ఆదేశాలు ఆగిపోయిన 3750 టన్నుల ఉత్పత్తి

మన తెలంగాణ/గోదావరిఖని/జ్యోతినగర్: రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్)లో కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటించకుండా ఉత్పత్తులు జరుపుతున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఫిర్యాదుతో యూరియా ఉత్పత్తులు నిలిపివేయాలని పిసిబి ఆదేశాలు జారీ చేయడంతో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉత్పత్తి నిలిపివేశారు. దీంతో రోజుకు 3,750 టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. సంవత్సర కాలం నుంచి యూరియా ఉత్పత్తులు జరుపుతున్న ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో అమ్మోనియా లీకేజీతోపాటు, వ్యర్థ నీటిని శుద్ధి చేయకుండానే సమీప గోదావరి నదిలో వదలడం లాంటివి అనేక పిసిబి నిబంధనలు పాటించకుండా యూరియా ఉత్పత్తి జరుగుతుందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 2021లో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలోనే పొల్యూషన్ బోర్డ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇటీవల ఆర్‌ఎఫ్‌సిఎల్ ప్లాంట్‌ను సందర్శించి తనిఖీ జరిపింది. యూరియా ఉత్పత్తుల కోసం రోజుకు 2200 టన్నుల అమ్మోనియాను వినియోగిస్తారు. యూరియా ఉత్పత్తులు జరిగే సమయంలో అనేకసార్లు అమ్మోనియా లీకేజీ జరగడం, దీనిని అరికట్టడంలో ఆర్‌ఎఫ్‌సిఎల్ యాజమాన్యం విఫలం చెందింది.

అమ్మోనియా లీకేజీ ప్రాణాంతకమైనది కావడంతో ఎమ్మెల్యే చందర్ ఈ విషయంలో నిర్లక్షం చేయకూడదని పలుమార్లు కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించారు. అదేవిధంగా అమ్మోనియా స్టోరేజ్ ప్లాంట్, యూరియా ఫిల్లింగ్ టవర్ ఏరియాలో కంట్రోల్ సిస్టంలు ఏర్పాటు చేయడంలేదని, ప్లాంట్ పరిసర ప్రాంతంలో గాలి అమ్మోనియా లెవల్స్ అధికంగా ఉండటం లాంటి వాటిని పిసిబి దృష్టికి తీసుకువెళ్లారు. ప్లాంట్ పరిధిలో ఇలాంటి నిబంధనలు పాటించకుండా యూరియా ఉత్పత్తులు జరపడంతో పరిసర ప్రాంతాల్లో కూడా వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు భారీ ఎరువుల కర్మాగారం పరిసర ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించకపోవడం, ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తికి వినియోగించి, వదిలే వ్యర్థ నీటిని శుద్ధి చేయకుండానే సమీప గోదావరి నదిలో వదలడం వల్ల గోదావరి నదిలో జల కాలుష్యం పెరిగిపోవడాన్ని గుర్తించారు. ఎమ్మెల్యే చందర్ ఫిర్యాదుతో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టాస్క్‌ఫోర్స్ కమిటీ స్పందించి ఆర్‌ఎఫ్‌సిఎల్ నుంచి వెంటనే యూరియా ఉత్పత్తులు నిలిపివేయాలని ఆదేశించారు. కాగా, పూర్తిస్థాయిలో లోడ్‌తో యూరియా ఉత్పత్తులు జరుపుతుండగా ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉత్పత్తులను నిలిపివేసి షట్‌డౌన్ తీసుకున్నట్లు ఆర్‌ఎఫ్‌సిఎల్ అధికారవర్గాలు పేర్కొన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News