2 వేలకు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు, 2 వందలకు పైగా ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థల
కార్యకలాపాలు నగరం నుంచే
భారత్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో సుమారు 40 శాతం తెలంగాణలోనే
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్రతి 3 టీకాల్లో ఒకటి హైదరాబాద్ నుంచే….
మధుమేహం, ఆంకాలజీ, ఇమ్యునాలజీ, న్యూరో సైన్స్ రంగాల్లో ఎలీ లిల్లీ విశేష కృషి
ఎలీ లిల్లీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్) ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఈ రోజు హైదరాబాద్ ప్రపంచ స్థాయి గ్లోబల్ జీసిసి రాజధానిగా ఎదిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం గచ్చిబౌలిలో ఎలీ లిల్లీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎలీ లిల్లీ సంస్థ లీడర్ షిప్‌ను, ఉద్యోగులను సిఎం సాదారంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఈ రోజు చరిత్రక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమమే తిరుగులేని నిదర్శనమని ఆయన చెప్పారు. భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ ఇప్పటికే గుర్తింపు పొందిందని, 2 వేలకు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయన్నారు. 2 వందలకు పైగా ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని సిఎం రేవంత్ తెలిపారు. భారత్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో సుమారు 40 శాతం తెలంగాణలోనే జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
జీనోమ్ వ్యాలీ పరిశోధన- అభివృద్ధి సముదాయంగా
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్రతి 3 టీకాల్లో ఒకటి హైదరాబాద్‌లోనే అభివృద్ధి చేయడం లేదా తయారవుతుండటం తమకు గర్వకారణమని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, భారతదేశంలోని అతిపెద్ద లైఫ్ సైన్సెస్ పరిశోధన- అభివృద్ధి సముదాయంగా నిలిచిందన్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ సంస్థల కోసం హైదరాబాద్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రపంచ గమ్యస్థానంగా మారిందన్నారు. ఈ రోజు, ఎలీ లిల్లీ సంస్థ రాకతో, లైఫ్ సైన్సెస్ రంగంలో తాము మరో మెట్టుకు చేరుకున్నామని చెప్పారు. మధుమేహం, ఆంకాలజీ, ఇమ్యునాలజీ, న్యూరో సైన్స్ రంగాల్లో ఎలీ లిల్లీ సంస్థ కృషి ఒక గేమ్-ఛేంజర్‌గా నిలిచిపోతుందని తెలిపారు.
తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా
తమ ప్రభుత్వ చిత్తశుద్ధి, దృష్టికోణం, కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు. ఈ విజయం సాధించడంలో అహర్నిశలు మంత్రి శ్రీధర్ బాబు, జయేశ్ రంజన్, పాలుపంచుకున్నారని, ఈ సందర్భంగా వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఇది తెలంగాణ రైజింగ్ 2047 దిశగా తాము వేసిన మరో ముఖ్యమైన అడుగు అని ఆయన అన్నారు. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పరిశోధనలో కీలక పాత్ర
తెలంగాణపై నిరంతర నమ్మకం ఉంచి, అండగా నిలిచి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నందుకు పారిశ్రామికవేత్తలు, -పెట్టుబడిదారులు, ప్రపంచ శ్రేణి కార్పొరేషన్లకు, కంపెనీలకు ఈ సందర్భంగా సిఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు ప్రారంభమైన ఎలీ లిల్లీ నూతన కేంద్రం ఆ సంస్థ గ్లోబల్ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి ఉప యోగపడుతుందని సిఎం పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్, ప్రపంచవ్యాప్తంగా రోగులకు పరిష్కారాల కోసం పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. హైదరాబాద్‌లో టాలెంట్ ఉదని, లీడర్‌షిప్ ఉందని, దీంతోపాటు విజన్, మంచి పాలసీ, మౌలిక సదుపాయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు నెంబర్‌వన్ హబ్..
తాను, తమ ప్రభుత్వం అన్ని వేళలా మీకు అండగా ఉంటామని వారికి సిఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. పారదర్శకత, అభివృద్ధి, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌లో పని చేయబోయే ఎలీ లిల్లీ ఉద్యోగులు, కేవలం హైదరాబాద్‌లో నివసించడం, పనిచేయడం మాత్రమే కాదని, ఇప్పుడు మీరు మా కుటుంబ సభ్యులుగా మారారని సిఎం రేవంత్ తెలిపారు. మీ సహకారంతో, తెలంగాణను భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా మాత్రమే కాకుండా ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు నంబర్ వన్ హబ్‌గ్గా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. మనమందరం కలిసి కొత్త ఆవిష్కరణలు చేద్దామని, ప్రజల జీవితాలను మారుద్దామపి, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ భవిష్యత్‌ను నిర్మిద్దామని సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.