Friday, May 3, 2024

మరియుపోల్ ఆర్ట్ స్కూల్‌పై రష్యా దాడి

- Advertisement -
- Advertisement -

Russian forces bomb art school in Mariupol housing 400 refugees

శరణార్థులకు ఆశ్రయమిస్తున్న స్కూల్
శిథిలాల కిందనే శరణార్థులు
ధ్వంసమైన స్టీల్ ప్లాంటు

కీవ్: గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌లోని కీలక రేవుపట్టణం మరియుపోల్‌పై భీకర దాడులు కొనసాగిస్తున్న రష్యా మరోసారి నగరంలో దాదాపు 400 మంది శరణార్థులు తలదాచుకున్న ఆర్ట్ స్కూలుపై బాంబుల వర్షం కురిపించింది. బాంబుల దాడిలో స్కూల్ భవనం పూర్తిగా ధ్వంసమైందని, అందులోని శరణార్థులు శిథిలాల కింద చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. అయితే ఎంత మంది మరణించారో అధికారులు వెల్లడించలేదని ఎపి వార్తాసంస్థ తెలిపింది. అజోవ్ సముద్రంలోని వ్యూహాత్మక నౌకాశ్రయమైన మరియుపోల్‌ను రష్యా బలగాలు కొద్ది రోజుల క్రితమే చుట్టుముట్టాయి. ఆహారం, నీటి సరఫరాను బంద్ చేయడంతో పాటు నగరంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గత వారం రోజుల్లో నగరంలో పౌరులు తలదాచుకున్న భవనాలపై రష్యా బాంబుదాడులు చేయడం ఇది రెండో సారి. గత బుధవారం స్థానిక ఆర్ట్ థియేటర్‌పై జరిపిన బాంబుదాడుల్లో వందలాది మంది మరణించి ఉంటారని భావిస్తున్నారు. సుమారు 200 మందిని కాపాడినట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్తున్నారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.

ఇప్పటివరకు రష్యా బాంబుదాడుల్లో మరియుపోల్‌లో కనీసం 2,300 మంది చనిపోగా, వందలాది మంది గాయపడ్డారు. మృతుల్లో చాలా మందిని సామూహిక సమాధుల్లో ఖననం చేశారు. మరియుపోల్‌లో ఎక్కడ చూసినా శవాల కుప్పలు, శిథిలాల దిబ్బలే కనిపిస్తున్నాయి. ప్రాణాలతో బయటపడిన ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. నగరవాసులపై రష్యా సైనికులు కనీస జాలి కూడా చూపడం లేదు. ఇళ్లనుంచి బయటికి వచ్చిన వారికి ఆహారం, నీరు అందించడానికి నిరాకరిస్తున్నారని డొనెస్క్ మిలిటరీ హెడ్ పావ్లోకైరిలెంకో తెలిపారు. గత వారం రోజుల్లో 40,000 మంది మరియుపోల్ నగరాన్ని వదిలిపెట్టిపారిపోయారని స్థానిక అధికారులు తెలిపారు. కాగా మరియుపోల్ స్వాధీనం నేపథ్యంలో రష్యా సైన్యాలు పాల్పడుతున్న యుద్ధ నేరాలు చరిత్రలో నిలిచిపోతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విమర్శించారు. సుమారు నాలుగున్నర లక్షల మంది ప్రజలు ఈ నగరంలో చిక్కుకుని ఆహారం, నీరు లేక అల్లాడుతున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్‌లో రష్యా ఎంత భయోత్పాతం సృష్టిస్తే పర్యవసానాలు అంత తీవ్రంగా ఉంటాయని ఆయన అన్నారు.

పూర్తిగా ధ్వంసమైన అజోవ్‌స్తాల్ ఉక్కు కర్మాగారం

కాగా తాజాగా రష్యా జరిపిన బాంబుదాడుల్లో యూరప్‌లోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారమైన అజోవ్‌స్తాల్ స్టీల్‌ప్లాంట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఉక్రెయిన్‌కుఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లనుందని స్థానిక ఎంపి లీసియా వ్యాసిలెన్కో ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. స్టీల్‌ప్లాంట్ ధ్వంసం కారణంగా పర్యావరణం కూడా దెబ్బతినే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మెటిన్‌వెస్ ్టగ్రూప్‌కు చెందిన అజోవ్‌స్తాల్ స్టీల్‌ప్లాంట్ ఉక్రెయిన్‌లోని అత్యంత ధనవంతుడైన రినాట్‌అఖ్‌మెటోవ్ అధీనంలో ఉంది.

మరోసారి హైపర్‌సోనిక్ క్షిపణుల ప్రయోగం

ఉక్రెయిన్‌పై మరోసారి కింజల్ హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ ఆదివారం వెల్లడించింది. వాటి సాయంతో దక్షిణ ఉక్రెయిన్ మైకలోవ్ రీజియన్‌లోని కోస్తాంతినివ్కా స్థావరం సమీపంలోని ఉక్రెయిన్ బలగాలకు చెందిన ఇంధన, కందెనల నిల్వ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపింది. దీంతో పాటుగా నల్లసముద్రం, కాస్పియన్ సముద్రంలోని తమ నౌకలనుంచి ఉక్రెయిన్‌పై క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ తెలిపారు. తొలి సారి ఈ సరికొత్త క్షిపణులను పశ్చిమ ఇవనో ఫ్రాంకివ్స్ ప్రాంతంలోని భారీ భూగర్భ ఆయుధాగారంపై ప్రయోగించినట్లు రష్యా శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఖర్కివ్‌లో ఐదుగురు పౌరులు మృతి

మరోవైపు తూర్పు ఉక్రెయిన్‌లోని ఖర్కివ్ నగరంలో రష్యా బలగాలు తాజాగా జరిపిన దాడుల్లో అయిదుగురు పౌరులు మృతిచెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగాయని, మృతుల్లో తొమ్మిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడని వారు తెలిపారు. సైనిక చర్య మొదలైనప్పటినుంచీ ఖర్కీవ్‌పై రష్యా బలగాలు దాడులు చేస్తూనే ఉన్నాయి.

రష్యా ఎయిర్‌బోర్న్ రెజిమెంట్‌ను మట్టుబెట్టాం: ఉక్రెయిన్

ర్యాకు చెందిన ఒక ఎయిర్‌బోర్న్ రెజిమెంట్ మొత్తాన్ని తమ దళాలు నాశనం చేశాయని ఉక్రెయిన్ ప్రకటించింది.ఈ విషయాన్ని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ ఫేస్‌బుక్ పేజిలో తెలిపింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలో వీరితో భీకర పోరు జరిగినట్లు ప్రకటించింది.

కోటిమంది నిరాశ్రయులుగా మారారు: ఐరాస

సైనిక చర్య మొదలైనప్పటినుంచి ఉక్రెయిన్‌నుంచి పొరుగు దేశాలకు వెళ్లిపోయి శరణార్థులుగా మారిన వారు, దేశంలో నిరాశ్రయులైన వారి సంఖ్య కోటికి చేరుకుందని ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజన్సీ యుఎన్‌హెచ్‌సిఆర్ హైకమిషనర్ ఫిలిప్పో గ్రాండీ వెల్లడించారు.

ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించనున్న జెలెన్‌స్కీ

రష్యాను నిలువరించేందుకు ఇజ్రాయెల్ మద్దతును కూడగట్టేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం ఇజ్రాయిల్ పార్లమెంటు ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించనున్నారు.ఈ విషయాన్ని ఇజ్రాయె పార్లమెంటు ‘ సెన్సెట్’ ప్రతినిధి ధ్రువీకరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News