బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పోరాటం వల్లనే సమ్మక్క సారలమ్మ బ్యారేజీ సాధ్యమైందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ బ్యారేజీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుమతులు సాధించినట్టు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఛత్తీస్‌ఘడ్‌తో యాభై ఎకరాల ముంపునకు సంబంధించి అంగీకారం కుదిరితే ఏవో గొప్పలు సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. సమ్మక్క బ్యారేజ్‌కు కొత్తగా అనుమతులు సాధించినట్టు డబ్బా కొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. 2001లో కెసిఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమానికి చంద్రబాబు భయపడి దేవాదుల ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారని గుర్తు చేశారు.
రూ. 811 కోట్ల వ్యయంతో అప్పట్లో దేవాదులకు జిఒ ఇచ్చారని, 2009లో గానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. రూ. 15 వేల కోట్ల నుంచి రూ. 20 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఆ ప్రాజెక్టు నుంచి సరిగా నీళ్లు తోడలేక పోయారని, ఇన్‌టెక్ వెల్ కూడా సరిగా ఏర్పాటు చేయలేదని అన్నారు. 170 రోజులు నీళ్లు తోడాల్సిఉండగా 110 రోజులు కూడా దేవాదులతో నీళ్లు రాలేదని, 37 టీఎంసీల నీళ్లు కూడా కాంగ్రెస్ హయాంలో తోడలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించకుండా కెసిఆర్ దేవాదుల ప్రాజెక్టును సరిదిద్దారని గుర్తు చేశారు. దేవాదులను పటిష్టం చేసేందుకు ఏడు టిఎంసిల సామర్థ్యంతో సమ్మక్క సారక్క బ్యారేజ్‌ను కెసిఆర్ నిర్మించారని చెప్పారు. సమ్మక్క బ్యారేజ్‌కు ఛత్తీస్‌ఘడ్ అభ్యంతరాలతో సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వలేదని అన్నారు. 2023 ఎన్నికల సందర్భంగా ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ఇక్కడి కాంగ్రెస్ నాయకులు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కెసిఆర్‌కు అనుమతులు దక్కకుండా చేశారని పేర్కొన్నారు.
అప్పుడు ఛత్తీస్‌ఘడ్ సంతకం చేసిన ఒప్పంద పత్రాన్ని ఉత్తమ్ తీసుకొచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు. దేవాదుల నుంచి నీళ్లు తెచ్చి నిల్వ చేసుకునేందుకు పది రిజర్వాయర్లు నిర్మించిన ఘనత కెసిఆర్‌దే అని పేర్కొన్నారు. పెండింగ్ రిజర్వాయర్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని అన్నారు. కెసిఆర్ మీద దుష్ప్రచారం చేయడం మానేసి ప్రాజెక్టుల పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
Also Read: రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం