Wednesday, May 1, 2024

తెలుగు రాష్ట్రాల్లో సంబరంగా సంక్రాంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

నెక్లెస్ రోడ్డులో పతంగులు ఎగురవేసిన తలసాని, కిషన్ రెడ్డి
శిల్పారామంలోనూ ఉత్సాహంగా వేడుకలు
మన తెలంగాణ / హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పండుగ శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. ఆదివారం బోగి పండుగ పర్వదినం కావడంతో ఊరూవాడ తెల్లవారు జామునే బోగి మంటలు వేశారు. మంటల చుట్టూ తిరుగుతూ చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ సందడి చేశారు. హైదరాబాద్‌లోనూ బోగి పండుగ వేడుక ఉత్సాహంగా జరిగింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు పతంగులు ఎగురు వేసి సంబరాల్లో పాల్గొన్నారు. అటు పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో గంగిరెద్డుల ఆటలు, హరిదాసుల సంకీర్తనలు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉదయం నుండే బోగి మంటల మధ్య చిన్నారులు సందడి చేయగా మన సంస్కృతి సంప్రదాయాలను నేటితరం పిల్లలకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేశారు. అటు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శిర్పారామంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించారు.

శిల్పారామంలో గంగిరెద్దుల హడావిడితో పాటు కళాకారుల ఆటపాటలతో అచ్చం పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబించడంతో పాటు చిన్ననాటి మధుర స్కృతులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తెలంగాణ జిల్లాల వారీగానూ బోగి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారంలో పాత వస్తువులను బోగి మంటల్లో వేసి కీడు తొలగిపోవాలని స్థానికులు కోరుకున్నారు. మంటల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో చిన్నారులు సందడి చేశారు. ఇందల్‌వాయి గ్రామంలో బోగి వేడుకలు ఆబాలగోపాలం ఉత్సాహంగా సాయాయి. అటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానూ ఆహ్లాదకర వాతావరణలో వేడుకలు జరిగాయి. వేకువ జామునే ఇళ్ల ముందు కల్లాపి జల్లి, రంగుల రంగవళ్లులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి శోభ ఉట్టి పడింది. మూడు రోజుల పండుగలో భాగంగా తొలి రోజు భోగభాగ్యాలు తెచ్చే బోగి పండుగను ప్రజలు అట్టహాసంగా జరిపారు. ఇటు మంచిర్యాల జిల్లాలోనూ ఉదయం నుండే ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టుకున్నారు. వాకిళ్ల ముందు తీరొక్క రంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్థానికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటల చుట్టూ తిరుగుతూ సంబరాలు చేశారు. తాము పడిన కష్టాలు, బాధలను ఆహుతి చేస్తూ రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలు కలగాలని ప్రజలు కోరుకున్నారు.
పంచెకట్టుతో సతీసమేతంగా వేడుకల్లో పాల్గొన్న ఏపి సిఎం వైఎస్ జగన్
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. భోగి పండుగ నేపథ్యంలో ఆదివారం వేకువజాము నుంచే సందడి మొదలైంది. బంధుమిత్రులు, భోగి మంటలు, అందమైన రంగవల్లులు, గొబ్బిళ్లు, పిండివంటలు, గాలి పటాలు, ఇలా తెలుగు ప్రజలు సంక్రాంతిని ఘనంగా ఆస్వాదించారు. ఏపిలోని తాడేపల్లిలో సిఎం క్యాంపు కార్యాలయంలోనూ సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయం వద్ద ప్రత్యేకంగా రూపొందించిన వేదికపై సంబరాలు జరిపారు. ఈ వేడుకలకు ఎపి సిఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించారు. ఇక్కడ జరిగిన కార్యక్రమాలను సిఎం జగన్, వైఎస్ భారతి దంపతులు ఆసక్తిగా తిలకించారు. సిఎం జగన్ దంపతులు గోమాతకు పూజ చేశారు. అనంతరం భోగి మంటను వెలిగించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ తెల్ల చొక్కా, తెల్ల పంచె, భుజంపై కండువాతో సంప్రదాయ బద్ధంగా కనిపించారు. తన అర్ధాంగి వైఎస్ భారతితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని పేర్కొంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం అనంతరం
సిఎం జగన్ ను వైసీపీ నేతలు, యువనేతలు కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
వందేళ్ళ క్రితం తిరుమల ఏ విధంగా ఉండేదో అదే తరహాలో ప్రత్యేకంగా సెట్టింగ్
సిఎం జగన్ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు, గంగిరెద్దులకు సారెను సమర్పించడం, భోగిమంటలు, గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు, హరిదాసుల కీర్తనలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలతో వైభవంగా వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంక్రాంతి సంబరాలు
అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సంప్రదాయ దుస్తులు ధరించి బోగి పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏపి రాజధాని గ్రామమైన మందండంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అనంతరం నారావారి పల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ పాల్గొన్నారు.

Jagan

Chandrababu

Jagan and Bharathi

Kishan Reddy

Kite flying

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News