Thursday, May 2, 2024

ఈ నెల 9న కొలీజియం సిఫార్సుల అమలులో జాప్యంపై పిటిషన్లపై సుప్రీం విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం, బదిలీలకు సంబంధించి కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను ఆమోదించడంలో కేంద్రం ఆలస్యం చేస్తోందంటూ దాఖలయిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం( ఈ నెల 9న) విచారణ జరపనుంది. కొలీజియం వ్యవస్థ ద్వారా జడ్జీలను నియమించే విధానంపై గత కొంత కాలంగా కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విధానం పట్ల గతంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పని చేసిన కిరెన్ రిజిజు సహా పలు వర్గాలనుంచి విమర్శలు రావడం తెలిసిందే. కాగా, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుదాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం ఈ నెల 9న ఈ వ్యవహారంపై దాఖలయిన రెండు పిటిషన్లపై వాదనలు విననుంది.గత సెప్టెంబర్ 26న దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమస్యను పరిష్కరించడానికి తన పలుకుబడిని ఉపయోగించాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని కోరింది. గత వారం దాకా 80 సిఫార్సులు పెండింగ్‌లో ఉన్నాయి. పది పేర్లకు ఆమోదం తెలపడంతో ఇప్పుడు 70 పేర్లు పెండింగ్‌లో ఉన్నాయి.

వీటిలో 26 జడ్జీల బదిలీలకు సంబంధించినవే ఉన్నాయి. కీలక హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి సంబంధించిన కేసు కూడా పెండింగ్‌లో ఉంది’ అని ఆ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. గత ఏడాది సెప్టెంబర్‌నుంచి ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయని బెంచ్ పేర్కొంది. కాగా దీనిపై కేంద్రంనుంచి ఆదేశాలతో రావడానికి అటార్నీ జనరల్ వారం రోజులు సమయం అడిగారు. ‘అటార్నీ జనరల్ చాలా స్వల్ప సమయం అడిగినందున ఈ రోజు నేను ఏమీ మాట్లాడడం లేదు. వచ్చే సారి నేను మౌనంగా ఉండను.ఈ సమస్యలు పరిష్కారం కావడానికి మీ పలుకుబడి ఉపయోగించండి’ అని జస్టిస్ కౌల్ అటార్నీ జనరల్‌నుద్దేశించి అన్నారు. కాగా 2021లో సుప్రీంకోర్టు నిర్దేశించిన కాలపరిమితికి కట్టుబడి ఉండనందుకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలయిన మరో పిటిషన్ కూడా సోమవారం విచారణకు రానుంది. తాము సిఫార్సు చేసిన పేర్లను కొలీజియం గనుక ఏకగ్రీవంగా పునరుద్ఘాటించిన పక్షంలో మూడు, నాలుగు వారాల్లోగా కేంద్రం జడ్జీలను నియమించాలని సుప్రీంకోర్టు ఆ తీర్పులో పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News