Thursday, May 2, 2024

రద్దు సరే.. మద్దతు ధర మాటేంటీ?

- Advertisement -
- Advertisement -

Set minimum support prices for crops

స్వామినాధన్ నివేదిక హామీ నెరవేర్చరా
2022నాటికి రెంట్టింపు ఆదాయం ఇచ్చే విధానం ఏదీ..

మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్రప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ రైతుల్లో ఆగ్రహావేశలు చల్లారటం లేదు. కేంద్రం గతంలో ఇచ్చిన కనీస మద్దతు ధరలు పెంచుతామని ప్రకటించింది. డా.స్వామినాధన్ కమిషన్ నివేదికలను అమలు చేస్తామని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోడి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని రైతు సంఘాల నాయకులు , వ్యవసాయరంగం నిపుణులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేస్తేనే కేంద్రంపై రైతాంగానికి కొంతలో కొంతయినా కోపం తగ్గుతుందని అంటున్నారు. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరలను అమలు చేస్తూ రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చట్టం చేస్తేనే కేంద్రంపై రైతాంగానికి నమ్మకం కలుగుతుందని , అలా కాకుండా కేవలం నల్లచట్టాలను రద్దు చేసి చేతులు దులుపుకుంటామంటే ఎవరూ కేంద్రాన్ని విశ్వసించరని పలువురు రైతు సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పంటలసాగులో పెట్టుబడి ఖర్చులకు తగ్గట్టుగా కనీస మద్దతు ధరలను నిర్ణయించాలని దశాబ్దాల తరబడి చేస్తున్న డిమాండ్ల మాటేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

డా.స్వామినాధన్ కమిషన్ నివేదికన యదాతధంగా అమలు చేయాలని కోరుతున్నారు . ఈ కమిషన్ నివేదిక ప్రకారం వ్యవసాయ రంగంలో పంటల సాగుపై రైతుల పెట్టుబడితోపాటు , రైతు కుంటుంబం చేసిన శ్రమకు ప్రతిఫలం, సాగుచేసిన భూమికి విలువకు కౌలు కలిపి పంట సాగుఖర్చుకిందనే లెక్కించాలి. అన్ని ఖర్చులు కలిపి పంట దిగుబడిలో అందనంగా 50శాతం రైతుకు అందేవిధంగా పంటలకు కనీస మద్దతు ధరలను అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నివేదిక ప్రకారం పంటలకు కనీస మద్దతు ధరలు నిర్ణయిస్తామని, భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వస్తే స్వామినాధన్ కమిటి నివేదికను యధాతధంగా అమలు చేస్తామని ఆ పార్టీ రైతులకు హామీ ఇచ్చింది. ఈ హామీలను నమ్మిన రైతులు బిజేపికి అధికారం కట్టబెట్టారు. ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టిన నరేంద్రమోడి సైతం పలు హామీలు ఇచ్చారు. 2022నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటమే తమ ప్రభుత్వ లక్షం అని పదే పదే ప్రకటిస్తువచ్చారు. రైతుల ఆదాయం రెట్టింపు మాట దేవుడెరుగు పంటల సాగులో పెట్టుబడి ఖర్చులు రెట్టింపయ్యాయి. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వ్యవసాయరంగంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి.

ట్రాక్టర్‌తో దుక్కులు దున్నటం మొదలుకుని యంత్రాలతో పంటకోతలు, ధాన్యం రవాణ తదితర ఖర్చులు పెరిగిన డిజిల్ కారణంగా ఎకరానికి సాగు ఖర్చులో రూ.2000అదనపు భారం పడింది.ఇక రసాయనిక ఎరువుల ధరలు సరేసరి. రూ.1200ఉన్న డిఏపి బస్తాను ఏకంగా రూ.1900కు పెంచింది. మరి ధాన్యం మద్దతు ధరలు మాత్రం ఎరువుల ధరతో సమానంగా పెంచేందుకు కేంద్రానికి చేతులు రాలేకపోయాయి. కొత్తచట్టాలను రద్దు చేసినంత మాత్రన రైతులు ఇప్పుడెదుర్కొంటున్న సమస్యలు సమసి పోవని కనీస మద్దతు ధరల చట్టాన్ని సాధించే వరకూ రైతుల పోరాటం కొనసాగుతుందని రైతు సంఘాలు, ప్రజసంఘాల ఐక్య వేదికలు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వం అరకొరగా పెంచే మద్దతు ధరలు కూడా రైతులకు ఏమాత్రం ఊరటనివ్వలేకపోతున్నాయి. ధాన్యం మద్దతు ధరలే తీసుకుంటే 201617 క్వింటాలు ధాన్యం మద్దతు ధర రూ.1510ఉండగా , దాన్ని 201718లో రూ.1590కి పెంచింది. 201819లో రూ.1770, 201920లో రూ.1835, 202021లో రూ.1888కి పెంచింది. 202122లో దీన్ని రూ.1960కి పెంచింది. ఏటా రూ.90 వంతున ధాన్యం మద్దతు ధరలు క్వింటాలు రూ.1960కి చేరేందుకు ఐదేళ్ల సమయం పట్టింది.

అదే 50కిలోల ఎరువుల బస్తా ధర ఒక్కసారిగా రూ.700పెంచటం ఇదెక్కడి న్యాయం అని రైతులు నిలదీస్తున్నారు. సబ్సిడీల పేరుతో ఎరువుల ధరను నియంత్రిస్తున్నామని చెప్పే ప్రభుత్వం పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా ధాన్యం మద్దతు ధరలను పెంచేందుకు మాత్రం ముందుకు రావటం లేదు. ప్రతియేటా పంటలకు కనీస మద్దత ధరల నిర్ణయంలో ధరల నిర్ణాయక కమీషన్ పేరుతో మొక్కుబడి పెంపుదల రైతుల కన్నీటిని తుడవలేకపోతోంది. క్షేత్ర స్ధాయిలో వరి పంట సాగు ఖర్చులను తీసుకుంటే విత్తనం మొదలు పంట విక్రయం దాక ఎకరానికి రూ.35వేలు ఖర్చవుతున్నట్టు రైతులు చెబుతున్నారు. అన్ని అనుకూలిస్తే ఎకరానికి సగటున 27క్వింటాళ్ల దాన్యం దిగుబడి లభిస్తున్నట్టు కేంద్రప్రభుత్వమే అంచనా వేసింది. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న కనీస మద్దతు ధరల ప్రకారం ఎకరానికి రూ.52వేల విలువ మేరకు పంట దిగుబడి లభిస్తోంది. అందులో సాగు ఖర్చలు రూ.35వేలు మినహాయిస్తే రైతు చేతికి రూ.17000 అందనున్నాయి. ఇందులో భూమివిలువ లేదా కౌలు ఖర్చు రూ.12500 మినహాయిస్తే రైతుకు నికరంగా ఎకరం వరిసాగుకు 4500 మిగలనున్నాయి.

వరిసాగులో విత్తనం మొదలు పంట చేతికొచ్చేదాక 150రోజుల పాటు శ్రమించే రైతుకు మిగిలేది రూ.4500మాత్రమే. సొంతభూమి ఉన్న రైతులకైతే వరిసాగులో 5నెలల కాలానికి నెలకు రూ.3400 లభించనుంది. అదికూడా ప్రకృతి వైపరిత్యాలు , చీడపీడలను తట్టుకుని శ్రమిస్తేనే ఆమాత్రమైన కళ్లచూడగలుగుతున్నారు. ఏమాత్రం క్షేత్ర స్థాయి పరిజ్ఞానం లేకుండా ఏక్కడో ఢీల్లీలో ఏసి రూముల్లో కూర్చుని పంటల మద్దతు ధరలు నిర్ణయిస్తున్న అధికారులు రైతుల పాలిట శనిలా దాపురించారన్న ఆక్రోశం గత కొంతకాలంగా రైతుల్లో గూడుకట్టుకుంది. స్వామినాధన్ కమిషన్ సిఫార్సుల మేరకు సాగుఖర్చులకు 50శాతం అదనంగా రాబడి లభించేలా మద్దతు ధరలు నిర్ణయించి రైతుల కష్టాలు తొలగిస్తే తప్ప వ్యవసాయం మనుగడ సాగించేలేందటున్నారు.

క్వింటాలకు 4500మద్దతు ధర ప్రకటించాలి:

రాష్టంలో పంట సాగు ఖర్చులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మద్దతు ధరల పెంపుదలపై కేంద్రానికి ఇటీవల నివేదిక పంపింది. వరి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.4500 ప్రకటించాలని నివేదికలో ప్రతిపాదించింది. మిగిలిన పంటలకు కూడా కనీస మద్దతు ధరలు పెంచాలని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పైలెట్ ప్రాతిపదికన ఒక్కో పంటకు ఒక్కో ఎకరం , ఆయా నేలలు , వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ప్రాంతాలను ఎంచుకుని పంటలు సాగు చేయాలని రైతులు కోరుతున్నారు. సాగు ఖర్చులు, పంట దిగుబడులు పరిగణలోకి తీసుకుని ఆమేరకు స్వామినాధన్ కమీషన్ సిఫార్సులకు తగ్గట్టుగా ధరలు నిర్ణయించాలని కోరుతున్నారు. లేదంటే రైతులకు 2022నాటికి రెంట్టింపు ఆదాయం లభించటమే లక్షంగా ప్రధాని మోడి ప్రకటనలకు తగ్గట్టుగానైనా మద్దతు ధరలను అమలు చేయాలని రైతులతోపాటు , రైతు సంఘాల నేతలు, ప్రజాసంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News